టిడిపిలో అంతర్గత యుద్ధం..!

11 Jul 2016


ప్రతిపక్షాన్ని బలహీన పర్చాలన్న వ్యూహంతో భవిష్యత్‌ పరిణామాలను తెలుగుదేశం నాయకత్వం ఊహించినట్లు లేదు. ఆ ఫలితాలను ప్రకాశం జిల్లా తెలుగుదేశం నేడు చవిచూస్తోంది. జిల్లాల్లో పార్టీలో ఏర్పడిన గ్రూపులనే సర్దుబాటు చేసుకోలేక ఇంతకాలంగా సతమతమైంది. నేడు వైసిపి నుంచి తెచ్చుకున్న ఎమ్మెల్యేలతో కొత్త రాజకీయ వైషమ్యాలను కొనితెచ్చుకుంది. రెండు నెలలుగా ప్రకాశం జిల్లా తెలుగుదేశంలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. గత ఎన్నికల్లో తమపై గెలిచిన వారే నియోజకవర్గాల్లో నేతలు కావడాన్ని టిడిపి ఇన్‌ఛార్జులు జీర్ణించుకోలేక పోతున్నారు. నాడు వైసిపి అభ్యర్థుల చేతిలో ఓడిన తెలుగుదేశం అభ్యర్దులందరూ ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులుగా మారారు. రెండేళ్లుగా వారిదే నియోజకవర్గంలో పెత్తనమైంది. పదవి లేకున్నా అధికారాన్ని అనుభవిస్తున్నారు. వారి కనుసన్నల్లోనే పనులన్నీ సాగిపోతూ వచ్చాయి. ఒక రకంగా అనధికారిక ఎమ్మెల్యేలుగా వారు చక్రం తిప్పారు. ఈ కాలంలో వైసిపి ఎమ్మెల్యేలు చేతలుడిగి పాలనా వ్యవహారాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ఏమీ చేయలేని స్థితిలో పడ్డారు. రాజ్యసభ ఎన్నికల కోసం అంటూ తెలుగుదేశం అధిష్టానం వైసిపి ఎమ్మెల్యేలకు గాలం వేయడం ప్రారంభించింది. తిరుపతిలో జరిగిన మహానాడు నాటికే కొందరిని లాగేసింది. ప్యాకేజీలతో ఎమ్మెల్యేలకు గాలం వేశారన్న విమర్శలు ఆ పార్టీ నేతలనుంచే వినిపించాయి. అలా చేరిన వైసిపి ఎమ్మెల్యేల నియోజ కవర్గాల్లో నేడు తెలుగుదేశం మూడు గ్రూపులు, ఆరు గొడవలతో కొట్టుమిట్టాడుతోంది. నిత్యం అధిష్టానం పంచాయతీలు నడపక తప్పని స్థితి ఏర్పడింది.

TDP is trying to make strong party. For that they are taking MLA from other parites. But internal disputes are raising in TDP between senior leaders and Other party leaders.