పక్షపాతం ప్రదర్శిస్తున్న కోడెల..

2 Jul 2016


అనర్హత పిటిషన్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిర్ణయంపై  వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. సాంకేతిక కారణాలతో 13 అనర్హత పిటిషన్లను చెల్లవని చెప్పడం రాజ్యాంగ స్పూర్తిని తుంగలో తొక్కడమేనని ఆ పార్టీ అభిప్రాయపడింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై నెగ్గి టీడీపీలో చేరింది వాస్తవం కాదా అని వైసీపీ ఎమ్మెల్యే - పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం  అనర్హత పిటిషన్లపై మొదట్లోనే స్పీకర్ వేటు వేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

ఈ నెల 8న సుప్రీంకోర్టులో ఫిరాయింపులు కేసు విచారణకొస్తుందన్న నేపథ్యంలోనే, స్పీకర్ హడావుడిగా నిర్ణయం తీసుకున్నారని బుగ్గన ఆరోపించారు. స్పీకర్ అనే వ్యక్తి ఖ్వాజీ జుడిషియల్ ట్రిబ్యునల్ మాత్రమేనని - ట్రిబ్యునల్ నియమ నిబంధనలను స్పీకర్ పాటించాలని సూచించారు. నిర్ణయం తీసుకునే ముందు పిటిషనర్లకు అవకాశం ఇవ్వాలని కానీ దానికి విరుద్ధంగా స్పీకర్ వ్యవహరించారని విమర్శించారు. 

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విషయంలో స్పీకర్ తగిన చర్యలు తీసుకోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్ వచ్చే వారం విచారణకు రానున్న దశలో స్పీకర్ ఫిర్యాదును తిరస్కరించడం హేయనీయమని వైసీపీ విమర్శిస్తోంది.

YSRCP introduced complaint against party changed MLA. But AP speaker Kodela Siva Prasad dismissed it with technical reasons.