మార్పు కోసమే గడపగడపకు వైఎస్‌ఆర్‌ సీపీ

9 Jul 2016


రాజకీయాల్లో మార్పు కోసమే తమ పార్టీ రాష్ట్రంలో 'గడపగడపకూ' కార్యక్రమం చేపట్టిందని ప్రతిపక్ష నాయకుడు, వైసిపి రాష్ట్ర అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్ల తన పాలనలో ఒక్క హామీనీ నెరవేర్చలేదని, రుణమాఫీ కాకపోవడం వల్లనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం కడప జిల్లా ఇడుపులపాయలో కీర్తిశేషులు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 67వ జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి జగన్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఇడుపులపాయ గ్రామంలో గడప గడపకూ వైఎస్‌ఆర్‌ సీపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలో ఇంటింటికీ (గడపగడపకూ) వెళ్లి ప్రజలకు కరపత్రాన్ని అందించారు. కరపత్రంలోని వంద మార్కుల ప్రశ్నలకు సంబంధించి ప్రజల నుంచి సమాధానాలు అడిగారు. పాలనలో చంద్రబాబు పాసయ్యారా? ఫెయిలయ్యారా అనేది ప్రజలే నిర్ణయించాలని కోరారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో ఎలాంటి మేళ్లు జరిగాయనే వివరాలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీ, ఇంటింటికి నిరుద్యోగ భృతి మీకు వస్తున్నాయా అని ప్రజలను జగన్‌ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. చంద్రబాబు తాజాగా కుంభకోణాల్లో రూ.1.45 లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డారన్నారని విమర్శించారు. రాజధాని, అగ్రి గోల్డ్‌, ఇరిగేషన్‌, లిక్కర్‌ సిండికేట్లు, పోలవరం అంచనాలు, నీరు-చెట్టు, ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదన్నారు. 

హామీలపై చంద్రబాబును నిలదీయాలని, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందని అన్నారు. లేకుంటే వచ్చే ఎన్నికల్లో ఇంటికో కారు లేదంటే ఏకంగా విమానమే ఇస్తామని చంద్రబాబు చెబుతారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మోసాలను ఎండగట్టేందుకు ప్రజలకే బ్యాలెట్‌ ఇస్తున్నామని, వంద మార్కులకు ఎన్ని మార్కులు వేస్తారో చెప్పాలని కోరుతామని తెలిపారు. గత ఎన్నికల సమయంలో రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని చంద్రబాబు చెప్పారని, ఇప్పటివరకూ ఎవరికీ రుణాలు మాఫీ చేయలేదని విమర్శించారు. మోసం చేసేవారిని ఎక్కడికక్కడ నిలదీస్తేనే మార్పు వస్తుందని అన్నారు. గడప గడపకూ వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమంలో ప్రతిచోటా తాను పాల్గొంటానని చెప్పారు. రైతు రుణమాఫీ చేయపోవడంతో రైతుల ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ప్రజలను చంద్రబాబు మోసగించి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. చంద్రబాబు మోసకారితనాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. మోసపూరిత రాజకీయాల్లో మార్పు రావాలంటే ప్రజల నుంచే రావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, వైసిపి జిల్లా అధ్యక్షులు అమర్‌నాధ్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

On YS Rajashekar Reddy 67th birthday, YS Jagan started Gadapa Gadapaku YSR Party program. Jagan told to get change in AP CM Chandrababu Naidu, we started this program.