ఏపీకి కేంద్రం ఇచ్చిన కొత్త షాక్‌

5 Jul 2016


రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక నిధులపై కేంద్రం భిన్న రీతిలో కొర్రీలు వేస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ తేల్చి చెప్పిన కేంద్రం ద్రవ్య లోటుపైనా కొర్రీలు వేస్తోంది. అనవసర ఖర్చులు, కొత్త కొత్త పథకాల అమలు వల్లనే లోటు పెరిగి పోయిందన్న వాదనను తెరపైకి తీసుకు వస్తోంది. దీనిపై అనేక వివరణలను రాష్ట్ర అధికారులు కేంద్రానికి పంపిస్తున్నప్పటికీ, వాటిని కేంద్రం ఆమోదించకుండా మరికొన్ని అనుమానాలు లేవనెత్తుతున్నట్లు తెలుస్తోంది. చివరకు ఆడిటర్‌ జనరల్‌ నివేదికతో కలిపి గవర్నర్‌ రాసిన లేఖను కూడా కేంద్రం పట్టించుకోని పరిస్థితి తలెత్తింది. దీంతో ఇక లోటు నిధులు ఎప్పుడు వస్తాయి? ఎంత వరకు వస్తాయన్నది అనుమానాస్పదంగానే మారి నట్టు అధికారులు సైతం ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ముందుగా రూ.15,691 కోట్ల వరకు లోటు ఉంటుందని గుర్తించారు. తరువాత అది రూ.16 వేల కోట్లు దాటిపోయింది. ఇటీవల కాగ్‌ కూడా తన నివేదికలో లోటు రూ.16,078 కోట్లుగా ఉన్నట్లు నివేదిక ఇచ్చింది. ఈ అంశాలపై 2014 మార్చి 20న ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌గా నరసింహన్‌ కూడా కేంద్రానికి ప్రత్యేకంగా లేఖ రాశారు. లోటును సక్రమంగా గుర్తించేందుకు, ఆ మొత్తాన్ని రాష్ట్రానికి విడుదల చేసేందుకు కూడా చర్యలు తీసుకోవాలని ఆయన తన లేఖలో కోరారు. అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అజయ్‌ కల్లాం కూడా 2014 మే 27న కేంద్రానికి స్పష్టమైన గణాంకాలతో లేఖ రాశారు. అప్పటి నుంచి ఈ నిధుల కోసం వేట కొనసాగుతూనే ఉంది. వరుసగా రెండేళ్ల పాటు చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఒక ఏడాదికని రూ.2303 కోట్లు, తరువాత రూ. 500 కోట్లు కేంద్రం ఇచ్చింది. ఇంకా మరో రూ.13 వేల కోట్ల వరకు రావాల్సి ఉండగా, దానిపై కేంద్రం కొర్రీలు వేస్తోంది. ప్రధానంగా అనవసర ఖర్చులు, కొత్త కొత్త పథకాల కారణంగానే లోటు పెరిగిందని కేంద్ర ఆర్థిక శాఖ ఆరోపిస్తోంది. అమృత హస్తం, ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ, రైతు రుణ మాఫీ వంటి పథకాలు కొత్తగా అమలు చేయడం ద్వారా లోటు పెరగడానికి కారణమయ్యాయని కేంద్రం పేర్కొంది. ఇవి పేర్లు మారిన పథకాలే తప్ప, కొత్తవి కాదంటూ కేంద్రానికి రాష్ట్రం వివరణ ఇచ్చుకుంది. రైతు సాధికారిత సంస్థ కూడా రైతుల ప్రయోజనాలను కాపాడేందుకేనని పేర్కొంది. అయినా కేంద్రం సంతృప్తి చెందినట్లు కనిపించడం లేదు.

ఆడిటర్‌ జనరల్‌ కూడా రూ.16,078 కోట్ల లోటుకు అంగీకరించిన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తీసుకు వస్తూనే, దాన్ని అంగీకరించని పక్షంలో 14 ప్రణాళిక సంఘం మార్గదర్శకాలనైనా పాటించాలని కోరింది. దీనివల్ల రూ.9 వేల కోట్లకు పైగా రావాల్సి ఉంటుందని కూడా పేర్కొంది. అయితే ఇందుకూ కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రణాళిక సంఘం 2015-16 నుంచి 2019-20 వరకు అమలులో ఉంటుందని, అటువంటిది 2014-15 లోటుకు ఈ మార్గదర్శకాలు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించింది. దీంతో కంగు తినడం రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారుల వంతుగా మారింది. ఇన్నాళ్లూ రాష్ట్రంలో వేడి పుట్టిస్తున్న ప్రత్యేక మోదా కూడా ఇక లేనట్టేనని తాజాగా కేంద్రం స్పష్టం చేసినట్లు తెలిసింది. అన్ని రాష్ట్రాలూ తమకు సమానమేనని, అందుకే ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి ఈ హౌదా ఇవ్వలేదని రాష్ట్ర అధికారులకు తేల్చి చెప్పినట్లు సమాచారం.

Central Government already told that it is not possible to give special status to AP. And told we will solve revenue deffisit. Now it it is Central government telling AP government spending more money for Social causes.