నిబంధనలకు విరుద్ధంగా పట్టిసీమ నీటి విడుదల

7 Jul 2016


తమ ప్రభుత్వం ఇచ్చిన జీవోకు విరుద్ధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టిసీమ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు విడుదల చేయడంపై రైతుల్లో ఆందోళన మొదలైంది. పోలవరం కుడి కాలువకు సంబంధించి రామిలేరు వద్ద ఇంకా పనులు పూర్తి కాలేదు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజి వద్ద ప్రస్తుతం (బుధవారం) 8.08 అడుగుల నీటిమట్టం నమోదైంది. అయినా ముఖ్యమంత్రి బుధవారం పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేశారు. పట్టిసీమ జీవో ప్రకారం.. గోదావరికి వరదలు సంభవించినప్పుడు.. అదీ ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 14 అడుగుల నీటిమట్టం నమోదైనప్పుడే పట్టిసీమ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉంది. రోజుకు 8,500 క్యూసెక్కుల వరద జలాలను 30 పంపుల ద్వారా కృష్ణా డెల్టాకు విడుదల చేయాలి. 

ఒక్కో పంపు నుంచి రోజుకు 280 క్యూసెక్కుల నీటిని లిఫ్ట్‌ చేయాల్సి ఉంది. దీనికి విరుద్ధంగా ముఖ్యమంత్రి నీటిని విడుదల చేయడం చర్చనీయాంశమైంది. ఆయన ఇచ్చిన జీఓను ఆయనే అమలు చేయకపోవడాన్ని రైతులు తప్పుపడుతున్నారు. గోదావరికి వరదలు సంభవించినపుడు ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ వద్ద 11.75 అడుగుల నీటిమట్టం నమోదైతే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. 13.75 అడుగులు నమోదైతే రెండో ప్రమాద హెచ్చరిక, 17.75 అడుగులు నమోదైతే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. రెండో ప్రమాద హెచ్చరిక దశ దాటిన తర్వాతే పట్టిసీమ ద్వారా నీటిని లిఫ్ట్‌ చేయాల్సి ఉంది. దీనికి విరుద్ధంగా నీటిని తోడితే ఉభయగోదావరి డెల్టాలకు సాగు నీరు అందదని రైతులు, రైతు సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. వరదల సమయంలో ఏటా మూడు వేల నుంచి ఆరువేల టిఎంసిల వరద జలాలు సముద్రంలో వృథాగా కలుస్తున్నాయి. పోలవరం నిర్మించేలోపు పట్టిసీమ ద్వారా వరద జలాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం రూ.1300 కోట్ల వ్యయంతో పట్టిసీమ పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకూ రూ.1,120 కోట్లు ఖర్చు చేసింది. ఇంకా కుడి కాల్వ పనులు పూర్తి కాలేదు. 24 పంపుల ద్వారా 8,100 క్యూసెక్కుల వరద జలాలను కృష్ణ ప్రాజెక్టులో అనుసంధానం చేయడానికి ముఖ్యమంత్రి బుధవారం నుంచి శ్రీకారం చుట్టడంపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Yesterday Chandrababu Naidu is always saying about pattiseema project. Yesterday he launched it. But it is not in rules. According to rules, water can be released to Pattiseema with certain water levels.