రేపు వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం

13 Jun 2016


ఏపీలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 14న (మంగళవారం) విజయవాడలో జరుగనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్తాయి విస్తృత సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బందర్ రోడ్డులోని ఏ-1 కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ సమావేశాల్లో తాజా రాజకీయ పరిణామాలతో సహా పలు ప్రధాన అంశాలు చర్చకు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అధికారపక్షం వైఫల్యాలు, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి, ప్రతిపక్షాలపైనా, మీడియాపైనా కొనసాగుతున్న అణచివేత వైఖరి వంటి అంశాలతో పాటుగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై 8 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టబోయే ‘గడప గడపకూ వైఎస్సార్’ అనే పార్టీ కార్యక్రమాన్ని పకడ్బందీగా ముందుకు తీసుకువెళ్లాల్సిన తీరుపై చర్చ జరుగుతుంది. 

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ విస్తృత సమావేశంలో పార్టీ శ్రేణులకు, నేతలకు, ప్రజా ప్రతినిధులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 14న ఉదయం 8 నుంచి 9.45 గంటల వరకు మీటింగ్ హాలు వద్ద ప్రతినిధులను నమోదు చేసుకుని ఎంట్రీ పాసులు జారీ చేస్తారని పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

AP YSRCP party high level meeting will be conducting tomorrow. In Vijayawada A-Convention hall all YSRCP leaders will discuss about present political issues and programs.