పవన్ కల్యాణ్ ఏమయాడు..?

13 Jun 2016


కాపు రిజర్వేషన్ల హామీని నెరవేర్చడం, తుని ఘటనలో అరెస్టుచేసిన వారిని విడుదల చేయాలన్న డిమాండ్లతో ముద్రగడ పద్మనాభం గత ఐదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ మౌనం దాల్చడం చర్చనీయాంశంగా మారింది. గత కొద్దిరోజులుగా దీక్ష సాగిస్తున్న ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నిలుపుకోకపోవడం, కాపు రిజర్వేషన్లు కల్పించే విషయంలో సాగదీత ధోరణి, ఆస్పత్రిలో కొనసాగిస్తున్న దీక్ష కారణంగా క్షీణిస్తున్న ఆయన ఆరోగ్యంపై అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

వివిధ పార్టీలకు చెందిన కాపు నేతలు సోమవారం హైదరాబాద్ సమావేశమై పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ముద్రగడ దీక్షకు సంఘీభావంగా నిలవాలని నిర్ణయించారు. సోమవారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో సినీ ప్రముఖుడు దాసరి నారాయణరావు, కాంగ్రెస్ నేతలు చిరంజీవి, పల్లంరాజు, సి. రామచంద్రయ్య, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, కన్నబాబు తదితర అనేకమంది నేతలు పార్టీలకు అతీతంగా సమావేశమై పరిస్థితిని సమీక్షించారు.

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నా, కాపుల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నా జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ స్పందించకపోవడం నేతల్లో చర్చనీయాంశంగా మారింది. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని పక్షంలో నిలదీస్తామని గతంలో ప్రకటించిన పవన్ కల్యాణ్ ఇంతటి తీవ్రమైన విషయంలో ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్న మొదలైంది. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ పవన్ కల్యాణ్ సాక్షిగానే చేశారని, ఇప్పుడు వెంటనే స్పందించాలని కాంగ్రెస్ నేతలు బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు.పవన్ కల్యాణ్ కు ప్రస్తుతం సినిమా షూటింగులు కూడా ఏమీ లేవని, ఆయన ఎందుకు స్పందించడం లేదన్న విషయం తెలియదని అభిమానులు అంటున్నారు. చంద్రబాబుకు మిత్రపక్షంగా ఉన్నందున ఇలాంటి సమయాల్లో పవన్ కల్యాణ్ చొరవ తీసుకోకపోవడం అభిమానుల్లోనూ అసంతృప్తి నెలకొందని చెబుతున్నారు.

Pavan Kalyan started Janasena party in 2014 to question political issues. But he is not talking about present political issues and Mudragada issue.