బాబు దత్తత ఊళ్లో చదువు చట్టుబండలు

28 Jun 2016


రాష్ట్రంలో తమకు నచ్చిన గ్రామాలు, వార్డులను దత్తత తీసుకొని మౌలిక సదుపాయాలు కల్పించాలని దేశాలు తిరిగి చెబుతున్న చంద్రబాబు.. తాను దత్తత తీసుకున్న పంచాయతీలో విద్యావకాశాల మెరుగునకు కనీసంగా దృష్టి పెట్టడం లేదు. విశాఖ మన్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయ తీల్లోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కరువ య్యాయి. రేషనలైజేషన్‌ పేరుతో ఈ పంచాయతీ పరిధిలోని లిట్టిగుడ పాఠశాలను మూసివేసి 16 మంది గిరిజన విద్యార్థులను చదువుకు దూరం చేశారు. ప్రముఖ పర్యాటక కేంద్రం, పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన అరకులోయ ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీ పరిధిలో ఉంది. అరకులోయ హైస్కూల్లో ఆరు నుంచి పదో తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులు 262 మంది ఉన్నారు. వీరిలో విద్యార్థినులు 112 మంది ఉన్నారు. ఆరు, ఇతర తరగతుల ప్రవేశాలు పూర్తయితే మరో వంద మంది విద్యార్థుల వరకు పెరుగుతారు. 

బతుకుతెరువు కోసం ఇక్కడకొచ్చిన పేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఈ పాఠశాలలో ఎక్కువ మంది ఉన్నారు. అత్యధిక మంది గిరిజన విద్యార్థులు ఆశ్రమ, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో చదువుతుండగా, వాటిల్లో సీట్లురాని, ప్రవేశాలకు అవకాశంలేని పేద పిల్లలంతా ఈ హైస్కూల్లో చేరుతున్నారు. ఈ పాఠశాల ప్రాంగణమంతా గోతులు, తుప్పలతో నిండి ఉంది. ఎప్పుడో కట్టిన రేకుల షెడ్‌ మరుగుదొడ్డిని విద్యార్థినులు ఉపయోగించుకునేలా లేవు. మగపిల్లల మరుగుదొడ్లూ తుప్పల్లోనే ఉన్నాయి. వీటికి రన్నింగ్‌ వాటర్‌ సదుపాయం లేదు. పురుష ఉపాధ్యా యులు, పిల్లలు బయటకు వెళ్తున్నా.. ఉపాధ్యాయినులు, విద్యార్థినులు టారులెట్స్‌లేక సమీప తుప్పల్లోకి వెళ్లాల్సి వస్తోంది. ఉన్న బోరు సరిగా పనిచేయటం లేదు. ఆఖరికి తాగునీరూ లేదు. ఆరో తరగతి పిల్లలు శిథిలావస్థలోనున్న రేకుల షెడ్‌లో చదువులు సాగిస్తున్నారు. ఎంతోకాలం క్రితం నిర్మించిన ఈ తరగతి గదులను ఆరో తరగతి ఎ, బి సెక్షన్ల విద్యార్థులకు, స్టాఫ్‌రూమ్‌, స్టాక్‌రూమ్‌ కింద వాడుతున్నారు. రేకులు దెబ్బతినడంతో వర్షం పడితే ఈ గదులన్నీ కారిపోతున్నాయి. వర్షం పడినన్ని రోజులూ ఇతర తరగతుల్లో వీరిని సర్దుబాటు చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం కింద వంట చేసేందుకు నిర్మించిన రేకుల షెడ్‌ శిథిలావస్థకు చేరుకుంది. 

గతంలో తొమ్మిది, పది తరగతుల విద్యార్థులు కూర్చోడానికి బల్లలు సమకూ ర్చారు. ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న తరువాత ఒక్క బల్ల కూడా సమకూర్చలేదు. పాడైన బెంచీలను ఉపాధ్యా యులంతా కలిసి డబ్బులు పోగుచేసి మరమ్మ తులు చేయించి ఏడు, ఎనిమిది తరగతుల పిల్లలకు కేటాయిం చారు. పాఠశాలలోని ఒక్క తరగతికీ ఫ్యాన్‌ సౌకర్యం లేదు. ఆరేళ్ల క్రితం ఆర్‌విఎం నిధులతో నిర్మించిన భవనం తలుపులు, కిటికీలు ఊడిపోయి దర్శనమి స్తున్నాయి. కొద్ది రోజుల క్రితం పాఠశాల ముందు భాగంలోని ప్రహరీ తప్ప ఇంతకుమించి సదుపాయాల కల్పనకు ఒక్క పైసా విడుదల చేయలేదు. మూడువైపులా ప్రహరీ లేకపోవడంతో రాత్రి సమయంలో అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. వాచ్‌మెన్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, అటెండర్‌ లేకపోవడంతో ఈ పనులు కూడా ఉపాధ్యాయులే చేసుకోవాల్సివస్తోంది. పీరియడ్లకు బెల్‌ కూడా ఉపాధ్యాయులే కొట్టాల్సి వస్తోంది. గ్రేడ్‌ -2 హిందీ, పిఇటి టీచర్లను ఎంతో కాలంగా నియమించటం లేదు.

Chandrababu Naidu always saying adopt a village or a street, develop as you can do. He adopted village Pedhalabudu, has no minimum felicities. Even government school has no toilets.