పుస్తకాలు లేని చదువులు..

22 Jun 2016


వేసవి సెలవుల్లోనే పాఠ్యపుస్తకాలను మండల కేంద్రాలకు పంపించి వాటిని స్కూలు తెరిచే రోజుకే పూర్తిగా పంపిణీ చేయిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఆచరణలో మాటను నిలబెట్టుకోలేకపోయింది. బడులు తెరిచి పది రోజులయినా పుస్తకాలను పూర్తిగా అందించలేకపోయింది. అయితే ప్రభుత్వం అవసరానికి మించి పుస్తకాలు సరఫరా చేశామని చెపుతోంది. క్షేత్రస్థాయి పరిశీలనలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ప్రతి జిల్లాలోనూ పుస్తకాల కొరత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కొన్నిచోట్ల ఇంగ్లీషు మాధ్యమం పుస్తకాలకు బదులు తెలుగు మాధ్యమానివి రావడంతో ఇబ్బందులు తలెత్తాయి. కొన్ని జిల్లాలకు రావాల్సిన పుస్తకాలు నిర్దేశిత సంఖ్యకు అనుగుణంగా వచ్చినప్పటికీ కొన్ని సబ్జెక్టులవి ఎక్కువగానూ, మరికొన్ని సబ్జెక్టులవి తక్కువగా వచ్చాయి. తక్కువ వచ్చినవారికి ఆ మేరకింకా పుస్తకాలందలేదు. అనంతపురం, కడప జిల్లాలో ఉర్దూ మీడియంలో చదివే విద్యార్థులకు ఉర్దూ పుస్తకాలందలేదు. శ్రీకాకుళం జిల్లాలో ఒరియా విద్యార్థులకు రాలేదు. తూర్పుగోదావరిలో కొన్ని పాఠశాలలకు ఏడు, ఎనిమిదో తరగతి విద్యా ర్థులకు తెలుగు, హిందీ పాఠ్యపుస్తకాలు రాలేదు. ఈ ఏడాది తరగతుల్లో సిలబస్‌ మారింది. దీనికి సంబంధించి కూడా పుస్తకాలు రాలేదు. 

శ్రీకాకుళం జిల్లాకు 15,54,659 పాఠ్య పుస్తకాలు అవసరం. కాగా, ఇప్పటివరకూ 14,82,851 పుస్తకాలే వచ్చాయి. కెజిబివిలకు ఇంగ్లీషు మీడియం పుస్తకాలు రావాల్సి ఉండగా తెలుగు మీడియం పుస్తకాలు వచ్చాయి. వీటికోసం ప్రభుత్వ పాఠ్య పుస్తకాల డైరెక్టర్‌తో మాట్లాడుతున్నామని అధికారులు చెపుతున్నారు. వీటితోపాటు ఒరియా పుస్తకాలూ ఇంకా రావాల్సి ఉంది. విజయనగరం జిల్లాలో 12,16,707 పుస్తకాలు అవసరం కాగా, పుస్తకాల పంపిణీ ఇంకా కొనసాగుతూనే ఉంది. విశాఖ జిల్లాకు 18,82,251 పాఠ్యపుస్తకాలు ఇవ్వాల్సి ఉంది. ఇంకా రావాల్సిన పుస్తకాలు 39,047 ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 29,78,250 పాఠ్యపుస్తకాలు అవసరం. ఇంకా 78,280 పుస్తకాలు రావాల్సి ఉంది. ఏడు, ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఇవ్వాల్సిన తెలుగు, హిందీ పాఠ్యపుస్తకాలు కొన్ని పాఠశాలలకు రావాల్సి ఉంది. జిల్లాకు రావాల్సిన పాఠ్యపుస్తకాలను ఇప్పటికే పంపించామని ఉన్నతాధికారులు చెప్పారని డిఇఒ ఆర్‌.నరసింహారావు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో విద్యార్థులకు అందజేస్తామన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో పుస్తకాల పంపిణీ 75 శాతమే జరిగింది. అయితే పుస్తకాలు అదనంగా వచ్చాయని డిఇఒ డి.మధుసూదనరావు చెపుతున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. కృష్ణాజిల్లాకు మొత్తం 16,09,911 పాఠ్యపుస్తకాలు అవసరంకాగా 13,78,155 పుస్తకాలే గోదాముకొచ్చాయి. గత ఏడాది 1,24,093 పుస్తకాలు ఉన్నాయి. రెండు నుండి ఐదో తరగతి వరకు గణితం, ఆంగ్లం పుస్తకాలు ఇంకా రావాలి. 4, 5, 6 తరగతులకు లక్షకుపైగా పుస్తకాలు రావాలి. 

ఈ ఏడు ఆరోతరగతి నుంచి పది వరకూ తెలుగు, ఇంగ్లీషు పాఠ్యపుస్తకాల్లో సిలబస్‌ మారింది. వీటిలో సగం మాత్రమే జిల్లాకే చేరుకున్నాయి. ప్రకాశం జిల్లాకు పాఠ్యపుస్తకాలు 18 లక్షలు అవసరమని అంచనా వేశారు. ఆ మేరకు పుస్తకాలు వచ్చాయని డిఇఓ డివి సుప్రకాష్‌ తెలిపారు. హైస్కూల్‌ విద్యార్థులు పది శాతం పుస్తకాల కొరత ఉన్నట్లు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలో 21లక్షల 96 వేల పాఠ్య పుస్తకాలు తెప్పించారు. ఇంకా 76 వేల పుస్తకాలు రావాలి. అయితే ప్రాథమిక పాఠశాలలకు సంబంధించిన ఇంగ్లీషు మాధ్యమం పాఠ్య పుస్తకాలు 20 వేలు అవసరం ఉందని విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కడప జిల్లాకు మొత్తం 14 లక్షల పుస్తకాలు అవసరం. గతేడాది 30 వేల మిగులు పుస్తకాలతో కలిపి 12,71,694 పుస్తకాలను పంపిణీ చేశారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు జిల్లాలో మొత్తం 12,251 మంది ఉర్దూ మీడియం విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి అవసరమైన 26,774 పాఠ్యపుస్తకాలకు కొరత ఏర్పడింది. ఆ మేరకు కర్నూలు జిల్లా నుంచి దాదాపు ఏడు వేల పుస్తకాలను తెప్పించుకుంటున్నట్లు సమాచారం. ఇంకా కొత్తగా చేరే విద్యారులకు పుస్తకాలను పంపిణీ చేయడం లేదు. పూర్తి స్థాయిలో పంపిణీ చేయడానికి మరో నెల సమయం పట్టే అవకాశం ఉంది. అనంతపురం జిల్లాకు ఇప్పటివరకు 20,08,187 పుస్తకాలు పంపగా 19,24,168 పుస్తకాలు మండలాలకు చేరినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ జిల్లాలో ఉర్దూ మీడియంలో చదివే విద్యార్థులకు పుస్తకాలు అందించనే లేదు. కర్నూలు జిల్లాకు 23 లక్షల పుస్తకాలు అవసరం కాగా, ఇప్పటికి 19 లక్షలే సరఫరా చేశారు.

It is the time to open all government schools. Till no books were supplied to Government schools. This the best example how Chandrbabu Naidu ruling.