కేబినెట్ మీటింగ్ నారాయ‌ణ కోచింగ్ సెంట‌ర్ లా ఉంది..

25 Jun 2016


రాష్ట్ర లేదా కేంద్ర ప్ర‌భుత్వాలు నిర్వ‌హించే మంత్రి వ‌ర్గ స‌మావేశాల‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ప్ర‌జ‌లు, లేదా ప్ర‌భుత్వాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవ‌డంతో పాటు ప్ర‌తి విష‌యంపైనా.. ముఖ్య‌మంత్రి లేదా ప్ర‌ధాన మంత్రి ఆయా శాఖ‌ల మంత్రుల తో కూలంక‌షంగా చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకుంటుంటారు. దీంతో మంత్రి వ‌ర్గ స‌మావేశాలు అన‌గానే ఇటు ప్ర‌జ‌ల్లోను, అటు మంత్రి వ‌ర్గం, అధికారుల్లోను ఎక్క‌డాలేని ఆస‌క్తి ఉంటుంది. అందుకే మీడియా సైతం మంత్రి వ‌ర్గ స‌మావేశాలు అన‌గానే ఎంతో ఆస‌క్తిక‌ర క‌థ‌నాల‌ను, వార్త‌ల‌ను ప్ర‌సారం చేస్తుంటుంది. ఇక‌, విష‌యంలోకి వ‌ద్దాం..

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌న మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రుల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి, లేదా విజ‌య‌వాడ‌లో నిర్వ‌హిస్తున్న మంత్రి వ‌ర్గ స‌మావేశాల‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆంద్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశాలు నారాయణ కోచింగ్ సెంటర్ లా సాగుతున్నాయని ఆయ‌న అన్నారు. గ‌తంలో ఈయ‌నకు అనేక మంత్రి వ‌ర్గ స‌మావేశాల్లో పాల్లొన్న అనుభ‌వం ఉంది. అయిన‌ప్ప‌టికీ, ప్ర‌స్తుతం ఆయ‌న సీఎం కేబినెట్ మీటింగ్‌ల‌పై విరుచుకుప‌డం ఆస‌క్తిగా మారింది. 

బాబు కేబినెట్ మీటింగ్‌ల‌పై ఆయ‌న మాట్లాడుతూ సింగపూర్ సంస్థలకు భూములు కట్టబెట్టడం చూస్తుంటే అచ్చం నారాయణ కోచింగ్ కేంద్రాన్ని తలపిస్తోందన్నారు. అమ‌రావ‌తి నిర్మాణం సీఎం చంద్ర‌బాబుకు ల‌భించిన వ‌ర‌మ‌ని అంటూనే ఈ అవ‌కాశాన్ని చంద్రబాబు పూర్తి దుర్వినియోగం చేస్తున్నార‌ని, తన బినామీ సంస్థలకు కట్టబెట్టడానికి స్విస్ చాలెంజ్ వ్యవస్థను ప్రవేశపెట్టారని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన కేల్కర్ కమిటీ స్విస్ చాలెంజ్ పద్దతి వద్దని సలహా ఇచ్చిందని అయినా, ఏపీ ప్రభుత్వం అదే విధానంలో వెళ్లడంలో ఉద్దేశం ఏమిటని పార్దసారధి ప్రశ్నించారు. పారదర్శకంగా లేకుండా రాజదాని నిర్మాణ కాంట్రాక్టులను తనకు కావాల్సినవారికి ఇవ్వడానికే చంద్రబాబు ఈ విధానంలోకి వచ్చారని ఆయన ఆరోపించారు. సో.. చంద్ర‌బాబు తాను చెప్పింది ఎదుటివాళ్లు విన‌డ‌మే త‌ప్ప ఎదుటి వాళ్లు చెప్పేది ఆయ‌న వినిపించుకోడు అని చెప్ప‌డానికే మాజీ మంత్రి వ‌ర్యులు కేబినెట్ మీటింగ్ కోచింగ్ సెంట‌ర్‌తో పోల్చారా..!

YSRCP leader and ex minister Parthasaradhi fired on AP cabinet and its behavior. TDP cabinet meetings are like Narayana Coaching center.