చంద్రబాబువన్నీ అబద్ధాలే

17 Jun 2016


ఆచరణకు సాధ్యం కాని హామీలతో అధికారం దక్కించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తి స్థాయిలో హామీలను నెరవేర్చలేదని ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం విజయవాడలో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్ ఆవేశపూరితంగా ప్రసంగించారు. పార్టీ బలోపేతానికి తమ నేతలకు సూచనలు చేస్తూనే అధికార పక్షంపై విమర్శలు గుప్పించారు. ఔత్సాహిక నాయకులు ప్రజల్లోకి వెళ్లి సమస్యలపై పోరాటం చేస్తూ బూత్‌స్థాయి నుంచి పార్టీని పటిష్ట పరిచేందుకు కృషి చేయాలన్నారు. నాయకత్వం వారసత్వం కాదని ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి పాటుపడేవాడే నిజమైన నాయకుడు అవుతాడని జగన్ సూచించారు. "నియోజకవర్గంలో ఇంటింటికీ వెళ్లండి.. ప్రజల యోగక్షేమాలు కనుక్కోండి.. చంద్రబాబుకు ఎన్ని మార్కులు వేస్తారో చూడండి.. పనిలో పనిగా బూత్ కమిటీలు కూడా నియమించండి..'' అంటూ ఔత్సాహిక నాయకులను జగన్ మోహన్‌రెడ్డి ఈ విధంగా సూచనలు చేశారు. ఐదేళ్లుగా అలుపులేని పోరాటం చేస్తున్నానని.. చంద్రబాబుకు తమకు ఐదు లక్షల ఓట్లే తేడానని తెలిపారు. సినిమాలో 13 రీళ్ల వరకూ విలన్‌దే పైచేయి.. 14వ రీల్‌లో హీరో రీవర్స్ అవుతాడంటూ చంద్రబాబును విలన్‌తో పొలుస్తూ జగన్ మాట్లాడారు. నాయకులు మోసాలు చేస్తే చెప్పులు, చీపుర్లు చూపించండంటూ సూచించారు. వ్యవస్థలో మార్పు రాకపోతే ప్రజాస్వామ్యం బతకదన్నారు. ఎక్కడ ఎవరికి ఎటువంటి సమస్య వచ్చినా పార్టీ అధ్యక్షుడిగా స్పందిస్తున్నానని.. పార్టీపరంగా ఎవరూ వెనకడుగు వేయకుండా అండగా ఉన్నానని జగన్ తెలిపారు. పార్టీ స్థాపించాక తొలిసారి ఎన్నికల్లో తాను, తన తల్లి గెలిచామని, తరువాత 18 మంది గెలిచారని, ఆ తరువాత 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలతో అంచెలంచెలుగా బలోపేతమయ్యామన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి 1.35 కోట్ల ఓట్లు వస్తే, వైసీపీకి 1.3 కోట్లు వచ్చాయని, కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతోనే చంద్రబాబు గెలిచారని, ఆయన గెలవడానికి చెప్పిన అబద్ధాలే కారణమన్నారు. "గడప గడపకు వైఎస్సార్'' అనే కార్యక్రమాన్ని రాజశేఖర్‌రెడ్డి జయంతి రోజు జూలై 8న ప్రారంభించనున్నట్లు తెలిపారు. నియోకవర్గ పరిధిలోని ప్రతి గ్రామపంచాయతీకి వెళ్లి.. ప్రజా సమస్యలు తెలుసుకోవడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. సీఎం చంద్రబాబు డ్వాక్రా మహిళలను మోసం చేశారని, ఫ్లెక్సీలకు లైట్లు పెట్టించి మరీ చదువుకునే పిల్లలనూ మోసం చేశారని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలన్నా.. జాబు రావాలన్నా.. రూ.2వేల నిరుద్యోగ భృతి కావాలన్నా.. బాబు రావాలని చెప్పి మోసం చేశారని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు సీఎం అయ్యేనాటికి రైతు రుణాలు రూ.87 వేల కోట్లు ఉండేవని, అంతవరకు లక్ష లోపు రుణం వడ్డీ లేకుండా, 3 లక్షల లోపు రుణం పవలా వడ్డికే వచ్చేదని వాటిని కట్టొద్దని చెప్పి ఈవాళ అపరాధ వడ్డీ కింద రైతులు 14నుంచి 18 శాతం వరకు వడ్డీ కడుతున్నారన్నారు. రెండేళ్లలో రూ.87 వేల కోట్ల రైతు రుణాలపై రూ.25 కోట్లు మాత్రమే చెల్లించారన్నారు. చంద్రబాబు రుణమాఫీ చేసింది వడ్డీలో మూడోవంతు కూడా సరిపోలేదన్నారు. వడ్డీ లేని రుణం పొందే డ్వాక్రా మహిళలకు రుణాలు కట్టని కారణంగా బ్యాంకుల్లో రూ.2.50వరకు వడ్డీ వసూలు చేస్తున్నారన్నారు. కొత్త ఉద్యోగాలు సరికదా.. ఉన్న ఉద్యోగాలు పోతాయేమోనని కాంట్రాక్టు ఉద్యోగులు సైతం భయపడేపరిస్థితి దాపురించిందన్నారు. 

రోజుకో ఉద్యోగం ఊడుతుందని, ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఇప్పిటికే వెళ్లిపోయారని తెలిపారు. నాయకులు అబద్ధాలు చెబితే చెప్పులు, చీపుర్లు చూపిస్తేనే వ్యవస్థ మారుతుందని ప్రజలకు సూచించారు. రేపు తనకైనా ఇదే పరిస్థితి వర్తించాలన్నారు. నాయకులు, కార్యకర్తలు గర్వంగా కాలరెగరేసుకునేలా నాయకులు పనిచేయాలన్నారు. వ్యవస్థలో మార్పు రావాలంటే రాజకీయ వ్యవస్థలో జవాబుదారీతనం పెరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు రూ.30 కోట్ల చొప్పున 20 మంది ఎమ్మెల్యేలను కొన్న అధికార పార్టీ మన రాష్ట్రంలోనే ఉందని ఆరోపించారు. ఇంత సొత్తు ఎక్కడదని ప్రశ్నించే వ్యవస్థ లేదంటే బాధేస్తుందన్నారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ దొరికిపోయిన వ్యక్తి చంద్రబాబు అనడానికి సిగ్గుపడాలన్నారు. ఓ ముఖ్యమంత్రి ఇంత నల్లధనంతో పట్టుడినా జైలుకెళ్లని పరిస్థితి మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని చూసి సిగ్గుపడాలన్నారు. ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యం బతకదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజావ్యతిరేకత ఉన్నప్పుడు డబ్బులు పనిచేయవని.. ప్రజలను కొనుగోలు చేయడానికి అవినీతి చేసి.. ఆ సోమ్మును ఖర్చు చేస్తే గెలవలేరని..ప్రజల గుండెల్లో స్థానం పొందాలని చంద్రబాబు సూచించారు. ప్రజల దగ్గర జీతం తీసుకుంటున్నామని గుర్తిస్తూ ప్రజలకు న్యాయం చేయాలని జగన్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని పణంగా పెట్టి ప్రత్యేక హోదాను మంటగలిపారని, టీడీపీ మంత్రులు కేంద్రంలో ఉన్నా వాళ్లను ఉపసంహరించే పరిస్థితి లేదని మండిపడ్డారు. కృష్ణా-గోదావరి నదులపై కేసీఆర్ అడ్డగోలు ప్రాజెక్టులు కడుతున్నా అడిగే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తే తప్పేంటని జగన్ ప్రశ్నించారు. పోలీసులు తమ టోపి మీద ఉన్న మూడు సింహాలను గౌరవించాలని.. చంద్రబాబుకున్న అధికారం ఎల్లవేళలా ఉండదన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ముద్రగడ పద్మనాభం దీక్ష చేస్తే తప్పేంటని జగన్ ప్రశ్నించారు. పోలీసులు తమ టోపి మీద ఉన్న మూడు సింహాలను గౌరవించాలని.. చంద్రబాబుకున్న అధికారం ఎల్లవేళలా ఉండదన్నారు. కాపుల రిజర్వేషన్ కోసం ముద్రగడ పద్మనాభం చేపట్టిన నిరాహారదీక్షకు సంఘీభావం తెలుపుతున్నట్లు, పోలవరం పర్యటన కార్యక్రమాన్ని డీవియేట్ చేయకూడదని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. జూలై మొదటివారంలో పోలవరం వస్తానని, ఇప్పుడు రాలేకపోతున్నందుకు క్షమించాలని జగన్ కోరారు. ఈ సమావేశంలో వైసీపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, లక్ష్మీపార్వతి, ధర్మాన ప్రసాదరావు, పార్థసారధి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జిల్లాల నుంచి వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంస్థల అధ్యక్షులు, మండల స్థాయి పార్టీ అధ్యక్షులు, జెడ్పీ చైర్మన్లు, మండలాధ్యక్షులు అందరికీ జగన్ కృతజ్ఞతలు తెలిపారు.

YS Jagan fired on Chandrababu Naidu. He formed government with fake promises, but still he not thinking about it.