అర్హులే దొరకటం లేదు అట..

1 Jun 2016


ఇంటి కోసం అర్జీ పెట్టుకుని ఏడాది కావస్తోంది. పేదల కోసం ఎన్‌టిఆర్‌ గృహనిర్మాణ పథకం కింద రెండు లక్షల ఇళ్లను మంజూరు చేసీ ఏడాదవుతోంది. లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల మంజూరుపై అదిగో, ఇదిగో అంటూ కాలం వెళ్లబుచ్చు తున్నారేగానీ, ఒక్కరికీ ఇంటిని మంజూరు చేయలేదు. అదేమంటే అర్హత కలిగిన లబ్ధిదారులను ఎంపిక చేయటం పెద్ద కష్టంగా తయారైందంటూ అధికారులు సెలవిస్తు న్నారు. ఆరు లక్షల ఇళ్ల నిర్మాణం కోసం సిఎం చంద్రబాబు శంకుస్థాపన చేసి నెల రోజులవుతున్నా, రాష్ట్రంలో ఎక్కడా ఒక్క ఇంటి నిర్మాణమూ ఆరంభంకాలేదు. ఏడాదిలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామంటూ డాంభికాలు పలికిన సిఎం, ఎన్‌టిఆర్‌ గృహనిర్మాణ పథకానికి అర్హత కలిగిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అంతగా పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించటంలేదు. ఈ పథకాన్ని ప్రకటించిన కొద్ది వ్యవధి లోనే పది లక్షలకుపైగా దరఖాస్తులు అందాయి. అయితే గృహనిర్మాణ పథకం కింద గ్రామీణ ప్రాంత పేదలకు రెండు లక్షల ఇళ్లనే ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో అర్జీదారులలో అర్హులను ఎంపిక చేసేందుకు ఏడాది నుంచి అధికారులు కుస్తీ పడుతూనే ఉన్నారు. రాష్ట్రంలో. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలు 12 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వమే ప్రకటించింది. 2022నాటికి ఇళ్లులేని వారు ఉండకూడదని ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించింది. కాని ఆ విధానం ఎక్కడా అమలు కాకపోవటం గమనార్హం.

రెండేళ్లవుతున్నా...
జూన్‌ ఎనిమిదో తేదీకి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు కావస్తోంది. ఈ రెండు సంవత్సరాలలో ఒక్క పేదవాడికి ఇల్లు మంజూరు చేసిన పాపాన పోలేదు. ఏడాదిన్నరగా అర్హులైన లబ్ధిదారుల ఎంపికనే ప్రభుత్వం పూర్తి చేయలేకపోతోంది. పాత సమస్యలను కప్పిపుచ్చే ప్రయత్నంలో, కొత్త పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇళ్ల కోసం దాఖలైన దరఖాస్తుల్లో 1.19 లక్షల మంది అర్హులు ఉన్నట్లు ప్రాధమికంగా అధికారులు గుర్తించారు. కనీసం వారికైనా ఇళ్లను మంజూరు చేసి ఉంటే ఈపాటికి సగం ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేవనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే వాటిలో కొందరు అనర్హులు ఉన్నారనే ఆరోపణలతో మొత్తం దరఖాస్తులను పక్కన పెట్టేయటంపై లబ్ధిదారులను ఆందోళనకు గురి చేస్తోంది.

నిబంధనలతో కోత
పేరుకు గృహనిర్మాణ పథకాన్ని అమలు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం, లబ్ధిదారుల జాబితాలో కోత విధింపునకు కసరత్తు చేస్తోంది. అందులో భాగంగానే ఆరు నిబంధనలను అధికారులు అమలు చేస్తున్నారు. సొంత ఇల్లు ఉండకూడదు, విద్యుత్‌ బిల్లు రూ.500 మించకూడదు, పొలం 5 ఎకరాలు మించకూడదు, ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు, మూడు నెలలపాటు రేషన్‌ తీసుకోకుండా ఉండకూడదు, నాలుగు చక్రాల వాహనం ఉండకూడదనే నిబంధనలను అమలు చేస్తున్నారు. అప్పటికీ అర్హుల సంఖ్యలో కోత విధించినా, ఇంకా కోత పెట్టాలనే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. సాధ్యమైనంత వరకు నిబంధనలతో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేయనున్నట్లు గృహనిర్మాణశాఖలో ఒక ఉన్నతాధికారే చెప్పారంటే ఈ పథకంపై ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోంది.
జిల్లాల వారీగా కేటాయించిన ఇళ్లు, అర్హుల గుర్తింపు

జిల్లా పేరు                   మంజూరైనవి                  అర్హులు 
శ్రీకాకుళం                     12,500                  4,266
విజయనగరం                 10,500                  8,514
విశాఖపట్నం                  12,500                11,140
తూర్పు గోదావరి              21,000                11,683
పశ్చిమ గోదావరి              18,400                18,000
కృష్ణా                           15,500                  5,310
గుంటూరు                     18,200                10,498
ప్రకాశం                         14,250               10,875
నెల్లూరు                        11,200                  9,179
చిత్తూరు                        15,250                 8,147
కడప                           10,500                  5,091
అనంతపురం                   14,950                  7,925
కర్నూలు                       14,750                  8,942

Chandrababu naidu introduced NTR Housing Scheme for poor people who dont have houses. He Released two lacks of houses one year age. But still no names were announced for this scheme.