మోడీ జమిలి ఎన్నికల ప్లాన్ వర్కౌట్ అవుతుందా...?

13 Jun 2016


అసెంబ్లీ..లోక్ సభ, పంచాయితీ..మున్సిపాల్టీ, కార్పోరేషన్ ఇలా వరసగా ఎన్నికలు వస్తూ ఏడాదంతా ఓటర్లకు, రాజకీయనేతలు బిజిబిజీగా గడిపిన రోజులు ఇక పై కన్పించవా. ప్రధాని మోడీ ఈ మేరకు ఓ ప్రతిపాదన చేశారు. అన్ని రకాల ఎన్నికలూ ఒకేసారి జరిపితే ఎలా ఉంటుందని. దానికి ఎలక్షన్ కమిషన్ కూడా దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐతే నిర్వహణ మాత్రం కష్టతరమని..అసాధ్యం మాత్రం కాదన్నది. ఇంతకీ నిజంగా అలా జమిలి ఎన్నికలు జరగడం వలన ఎవరికి ప్రయోజనం. పార్లమెంట్ తో పాటు అన్నిరాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి పోలింగ్ జరపడంపై కేంద్రం ఈసీని అభిప్రాయం కోరింది. ఈ మేరకు ఓ నివేదిక కూడా అడిగింది. దీంతో ఈ ప్రతిపాదనకు తమకి అభ్యంతరాలు లేవని. అందుకు సిధ్దంగానే ఉన్నట్లుగా కేంద్రన్యాయశాఖకు ఈసీ లేఖ రాసింది.

 గత ఏడాది 2 రాష్ట్రాలు..ఈ ఏడాది ఐదు రాష్ట్రాలు. వచ్చే ఏడాది మరో నాలుగు రాష్ట్రాలు ఇలా ప్రతిసారీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగడం. వాటిని మినీభారతంగా వర్ణించడం మామూలైపోయింది. ఐతే ఎన్నికల నిర్వహణ అంటేనే విపరీతమైన ఖర్చు. బోలెడంత సమయంవెచ్చించాల్సిన పరిస్థితి. పైగా ఎన్నికల సందర్భంగా చోటు చేసుకునే తగాదాలు మామూలే. వీటన్నింటిని నివారించేందుకు అన్నిరకాల ఎన్నికలు ఓసారే పెడితే ఎలా ఉంటుందనేది మార్చిలో జరిగిన బిజెపి మీట్ లో మోడీ బైటపెట్టారు. వెంటనే ఇదే అంశంపై ఈసీకి లెటర్ రాయడంతో తాజా పరిణామం సంభవించింది. ఐతే ఈసీ ఇలా జమిలి ఎన్నికలకు రాజకీయపార్టీలు కూడా కలిసి రావాలని తెలిపింది. దీంతో కేంద్రన్యాయశాఖ ఇందులోని సాధ్యాసాధ్యాలపై ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జులై 15 నాటికి  తన నివేదిక ఇవ్వనుంది. ఈ నివేదిక అందిన తర్వాత కేంద్రం అన్ని రాజకీయపార్టీలతో భేటీ ఏర్పాటు చేయనుంది. ఐతే దీనికి రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని కూడా తెలుస్తోదంి.

 ఓవేళ కేంద్రం అనుకున్నట్లుగా అన్ని ఎన్నికలు ఒక్కసారే జరపాలంటే 9వేలకోట్ల రూపాయలు అవసరమని ఈసీ అంచనా వేసింది. కానీ ఇది దీనికి పదింతలు ఉండే అవకాశం కూడా ఉంది..ఇది ప్రధాని మోడీ మదిలో ఆలోచనే అయినా. మిగిలిన రాష్ట్రాలు ఏమేరకు అంగీకారం తెలుపుతాయో చూడాలి. ఇప్పుడు దేశంలో బిజెపి ప్రభ వెలిగిపోతుందని..ఇదే ఊపులో రాష్ట్రాలకు కూడా కలిపి ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ ముక్త భారత్ నినాదం పూర్తవుతుందనే వ్యూహంలో ఈ జమిలి ఎన్నికల ప్రస్తావన వచ్చిందనే వాదనా ఉంది.  ఐతే కేంద్ర పాలసీలకు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాల పాలసీలకు సంబంధం ఉండదు..అలానే ఎన్నికల్లో ప్రస్తావనకి వచ్చే అంశాలు కూడా ఎంపి , ఎమ్మెల్యేల ఎన్నికలో కీలక పాత్ర పోషిస్తాయ్.. 

2013-9, 2014-8 రాష్ట్రాల ఎన్నికలు
కాస్త ముందూ వెనుకగా సర్దితే...
2019లో లోక్ సభ ప్లస్ 17 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు
ఇలా 2024కల్లా జమిలి ఎన్నికలకు అవకాశం
 2013లో 9 రాష్ట్రాల ఎన్నికలు జరగడమే ఇప్పటిదాకా ఓ ఏడాదిలో ఎక్కువ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికలు.. తర్వాత 2014లో జరిగిన 8 రాష్ట్రాలకు లోక్ సభతో కలిపి జరిగాయ్.. ఈ పదిహేడు రాష్ట్రాలకు 2019లో కలిపి జరిపితే ఎలా ఉంటుందనేది కూడా  ఎన్డీఏ ప్రభుత్వం మదిలో మెదులుతోంది.. దీనికోసం కొన్ని రాష్ట్రాలు ముందే అసంబ్లీ డిజాల్వ్ చేయాల్సి రావచ్చు..కొన్ని లేట్ గా ఎన్నికలకు వెళ్లాల్సి రావచ్చు..అలా దేశంలోని మొత్తం రాష్ట్రాలకు కాకాపోయినా..కనీసం సగం రాష్ట్రాలు ఇలా జమిలి ఎన్నికలకు వెళ్లవచ్చేనేదే ఇందులో ఉద్దేశం..ఇదే పద్దతిని ఫాలో అయి 2024కల్లా అన్ని రాష్ట్రాల ఎన్నికలు లోక్ సభ ఎలక్షన్స్ తో కలిపి పెట్టడానికి అవకాశం కలుగుతుంది..

అసలు ఇలా అసెంబ్లీ,లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు జరిగిన సందర్భాలు ఉన్నాయా? ఇలా జమిలి ఎన్నికల ప్రభావంతో కొన్ని పార్టీలకే లాభం ఉంటుందా..నష్టం ఉంటుందా అని చూస్తే ఏకపక్షంగా ఎవరికీ లాభం  ఉండదు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు అంటే 1952 . తర్వాత జరిగిన 1957 ఎన్నికలు రెండూ జమిలిగానే జరిగాయ్..అంటే రెండు దఫాలు. అన్ని రాష్ట్రాలకు లోక్ సభతో పాటు ఎన్నికలు జరిగాయ్.. 1967 తర్వాత జరిగిన పరిణామాలతో రాష్ట్రాల విధాన సభలకు . పార్లమెంట్ కి విడివిడిగా జరగడం ప్రారంభమైంది. ఐతే ప్రస్తుతం ఎన్డీఏ మళ్లీ ఇలా జమిలి ఎన్నికల ప్రస్తావన తెస్తోంది. దీనికోసం రాజ్యాంగ సవరణ అవసరమని. లోక్ సభ మాజీ జనరల్ సెక్రటరీ  సుభాష్ కశ్యప్ చెప్తున్నారు. ఐతే విడతల వారీగా ఓ కామన్ డేట్ కి తీసుకొచ్చే ప్రక్రియకి మాత్రం రాజ్యాంగ సవరణ అవసరం లేదని అంటున్నారు.
ఎన్డీఏ ఏర్పాటైన నాటి నుంచి చేపట్టిన కొన్ని చర్యలపై విమర్శలు వస్తూనే ఉన్నాయ్. ప్లానింగ్ కమిషన్ ను రద్దు చేసి నీతి ఆయోగ్ ని ఏర్పాటు చేయడం. కొలీజియం రద్దుకి విఫలయత్నం చేయడం. జీఎస్టీ  బిల్ కోసం ప్రయత్నించడం అందులో కొన్ని, ఇప్పుడు ఈ ప్రతిపాదన కూడా రాజకీయకోణంలోనే ఉందని విపక్షాలు అడ్డుపెట్టడం ఖాయంగా కన్పిస్తోంది. ఐతే రాజ్యాంగసవరణ అవసరమైన ఏ  ప్రతిపాదన అయినా.ఖచ్చితంగా లోక్ సభ,రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది. దానికి తోడు రాజ్యాంగ సవరణకు మొత్తం రాష్ట్రాల్లో కనీసం సగం అసెంబ్లీలు అంగీకరించాలిఈ నేపధ్యంలో జమిలి ఎన్నికల ఆలోచన ఏ మేరకు ఆచరణ వరకూ వస్తుందో తెలీదు.