మధురలో మారణకాండ

7 Jun 2016


ఉత్తరప్రదేశ్  మధురలోని జవహర్ పార్క్ ఘటనలో అసలు పాత్రధారులెవరు, ఓ జిల్లా స్థాయి అధికారిని మట్టుబెట్టే సాహసం వారికి ఎలా వచ్చింది. అంతా మందబలంతో పోలీసులపై దాడి జరిగిందా, లేక దీని వెనుక ఓ పకడ్బందీ వ్యూహం ఉందా, అంటే ఔననే చెప్పాలి. ఇంత మారణకాండ వెనుక స్వాధీన్ భారత్ సుభాష్ సేన అనే ప్రవేట్ ఆర్మీ హస్తముందని తేలింది. ఇంతకీ ఈ స్వాధీన్ భారత్ సుభాష్ సేన వివరాలేంటి. మధురలోని జవహర్ పార్క్ ఘటనలో జనం అవాక్కయ్యే నిజాలు తెలుస్తున్నాయ్. రామ్ వృక్ష్ యాదవ్ అనే  వృధ్దుడే మధురలో హింసాకాండను రెచ్చగొట్టాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇతగాడు గతంలో కూడా  ఇలానే పోలీసులపై రెచ్చిపోయి దాడులకు దిగిన ఘటనలున్నాయ్. 24మందిని బలిగొన్న మధుర మారణకాండలో ఆజాద్ భారత్ వైదిక్ వైచారిక్ క్రాంతి సత్యాగ్రహి అనే ప్రవేట్ ఆర్మీ హస్తముంది. అలానే స్వాధీన్ భారత్ సుభాష్ సేన పేరుతో మరో గ్యాంగ్ కూడా ఈ ఆక్రమణదారుల వెనుక ఉంది. రెండు మూడేళ్లనుంచి 280 ఎకరాల ఈ జవహర్ పార్క్ ను ఆక్రమించుకుని, అధికారులపై దాడులకు పాల్పడ్డారు. పార్క్ ఏరియాలో పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత పోలీసులకు అక్కడ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వెయ్యి గ్యాస్‌ సిలిండర్లు, 50 వరకు అత్యాధునిక తుపాకులు, 200 గ్రెనేడ్లు, కత్తులు, రాళ్లు దొరికాయి. ఐతే ఈ భారీ ఆయుధాల డంప్ ని ఊహించని పోలీసులు కోర్టు ఆదేశాలు ఇవ్వగానే, ముందస్తు వ్యూహం లేకుండా అక్కడికి వెళ్లడంతో ప్రాణనష్టం జరిగింది. ఇదే అంశాన్ని అక్కడి డిజిపి కూడా నిర్ధారించారు. సిఎం అఖిలేష్ అదే అభిప్రాయం వెల్లిబుచ్చారు.

అసలీ స్వాధీన్ భారత్ సుభాష్ సేన కి పెద్ద చరిత్రే ఉంది. వీళ్లంతా సుభాష్ చంద్రబోస్ అనుచరులుగా చెప్పుకుంటుంటారు. వీళ్ల డిమాండ్లు కూడా వీళ్లకి తగ్గట్లే ఉంటాయ్. దేశంలో రాష్ట్రపతి, ప్రధాని పదవులకు ఎన్నికలను రద్దు చేయాలంటారు, అలానే ప్రస్తుతం ఉన్న కరెన్సీ బ్రిటిషర్లు ప్రవేశపెట్టారని, దాని స్థానంలో ఆజాద్ హింద్ ఫౌజ్ కరెన్సీని తీసుకురావాలంటారు. అలానే 60 లీటర్ల డీజల్, 40 లీటర్ల పెట్రోల్ ను రూపాయికే అమ్మాలని అంటారు. జై గురుదేవ్ అనే వ్యక్తి ఈ స్వాధీన్ భారత్ సుభాష్ సేనని స్థాపించారంటారు. యాదవ కులానికి చెందినా, తర్వాతి కాలంలో బ్రాహ్మణ్ గా మారానని చెప్పుకునే జై గురుదేవ్. ఆధ్యాత్మక భోదనలతో బాగా డబ్బు సంపాదించాడు.. 2012 లో చనిపోయిన ఇతగాడి లీలలు వింటే ఆశ్చర్యపోకతప్పదు.. సుభాష్ చంద్రబోస్ 78వ జన్మదినం సందర్భంగా ఫూల్ భాగ్ లోని కాన్పూర్ లో వేలాది మందిని పోగేశాడితగాడు.. నేనే బోస్ ని అంటూ ఉపన్యాసం ప్రారంభించగానే..జనం ఓ క్షణం సైలెంట్ గా ఉండి..రాళ్లవర్షం కురిపించారట.. అంతకుముందే పాంప్లెట్ల ద్వారా తెగ ప్రచారం చేసుకున్న ఈ కొత్త నేతాజీ ఎవరో చూడాలనే ఆ జనం పోగయ్యారట..జనం నుంచి అలాంటి స్పందన రావడంతో సదరు జై గురుదేవ్ వెంటనే అక్కడ్నుంచి పరారయ్యాడు..తర్వాతికాలంలో దూరదర్శి అనే పార్టీ ఒకటి కూడా గురుదేవ్ ప్రారంభించాడు. పన్నెండు రాష్ట్రాల్లో పోటీ చేసినా, ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందీ పార్టీ. ఐతే ఈ మధ్యకాలంలో తన ప్రసంగాలతో జనానికి గాలం వేసి దాదాపు 4వేలకోట్ల రూపాయలు సంపాదించాడు గురుదేవ్.. వందకోట్ల హార్డ్ క్యాష్ తో పాటు..150కోట్ల విలువైన 250 లగ్జరీ కార్లు ఇతగాడి సొంతం..ఐతే ఇదంతా చట్టబద్దంగా సంపాదించిందే అని గురుదేవ్ చెప్పుకునేవాడు.. 

అలా అంత ధనం ఉఁది  కాబట్టే ఎక్కడిక్కడ ప్రవేట్ ఆర్మీలు నడపగలిగేవాడు..2000 సంవత్సరంలో ఇఁడస్ట్రియల్ ల్యాండ్ ని ఆక్రమించారంటూ గురుదేవ్ ట్రస్ట్ లపై 16కేసులు నమోదయ్యాయ్.. దగ్గర్లోని పురావస్తు శిధిలాలను కూడా నాశనం చేశారని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కూడా కేసు పెట్టింది.. స్థానిక రైతులు కూడా తమ భూములు లాక్కుని ఆశ్రమం నిర్మించుకున్నారని కేసులు పెట్టారు.. ఇలా అనేక ఆరోపణలతో పెద్ద సామ్రాజ్యమే విస్తరించిన గురుదేవ్ మరణంతో  ఓ కొలిక్కి వస్తాయని భావించారు..తాజాగా అలహాబాద్ హైకోర్టు జవహర్ బాగ్ ఏరియాలో ఆక్రమణలు తొలగించాల్సిందిగా తీర్పు ఇచ్చింది..ఈ ఆదేశాలతో కదిలిన పోలీసులు తగిన జాగ్రత్త లేకపోవడంతో పెద్ద సంఖ్యలోప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది..

Recent Madura incident created sensation all over India. But this incident some political hand are there.