సింగపూర్‌ కంపెనీలకు భూమి అప్పగింత..

23 Jun 2016


రాజధానిలో భూ పందేరం మొదలైంది. అమరావతి డెవలప్‌మెంట్‌ కంపెనీ పేరుతో స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌(ఎస్‌పివి)ఏర్పాటు చేసి దాని ద్వారా సింగపూర్‌కు భూములు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికోసం సీడ్‌ క్యాపిటల్‌ ఏరియాలో భూములు ఎంపిక చేశారు. సచివాలయ నిర్మాణ పనులకు అవసరమైన నిధులు కేంద్రం నుండి వచ్చే పరిస్థితి లేదని, ఈ సమయంలో ముందడుగు వేయకపోతే పనులు ఆలస్యమె ప్రభుత్వానికి ఇబ్బంది ఏర్పడుతుందని రాజధాని అభివృద్ధి కమిటీ సభ్యుడొకరు తెలిపారు. ఇప్పటికే చాలా ఆలస్యమైందని, వెంటనే భూములు కేటాయిస్తే సింగపూర్‌ కంపెనీలు నిర్మాణాలు మొదలుపెడతాయని, ఇది రాజధాని అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ప్లాట్ల పంపిణీ ఇప్పట్లో అయ్యే పరిస్థితి కాదని అధికారులకు తెలిసినప్పటికీ, దీనివెనుక సింగపూర్‌కు భూములు కేటాయించాల్సిన వ్యవహారం ఉందనే అభిప్రాయం రైతుల్లోనూ వ్యక్తమవుతోంది. 

దీంతోపాటు సీడ్‌ క్యాపిటల్‌ ఏరియాగా ఎంపిక చేసిన ప్రాంతంలోనే సింగపూర్‌ కంపెనీలకు ప్లాట్లివ్వాలని నిర్ణయించారు. దానికోసమే రోడ్డు కూడా వేస్తున్నారనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. ఏమీ పూర్తి కాకుండా రైతులకు ప్లాట్లు కేటాయిస్తే, తరువాతొచ్చే సమస్యలకు తాము బాధ్యత వహించాల్సి ఉంటుందని, కోర్టు కేసుల నుండి ప్లాట్లు ఇవ్వకపోతే దానికీ తమనే బాధ్యలను చేస్తారని అధికారులకు భయం పట్టుకుంది. అయినా ప్రభుత్వం సింగపూర్‌ కంపెనీలను దృష్టిలో పెట్టుకుని వ్యవహారం నడుపుతోంది. ఆయా కంపెనీలూ ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తుండటంతో వాటికి మార్గం సులువు చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన తరువాత మాస్టర్‌ డెవలపర్‌గా అసెండాస్‌, సెంబ్‌కార్ప్‌ కన్సార్టియంను ఎంపిక చేయాలని ముఖ్యమంత్రి కూడా సిఎస్‌ను కోరుతున్నారు. ప్రభుత్వం వైపు నుండి అన్ని అంగీకారాలొచ్చినా వారు అధికారుల నుండి హామీలు కోరుతున్నారు. రేపు ప్రభుత్వాలు మారితే సింగపూర్‌ కంపెనీలకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒప్పందాలు కూడా అధికారుల ద్వారానే జరగాల్సి ఉంది. విధి విధానాలు లేకుండా ఆదాయ వ్యయాలు పరిశీలన చేయకుండా, దీనిపై వేసిన నిపుణుల కమిటీ ఏం చెబుతుందో తెలియకుండా నేరుగా మాస్టర్‌ డెవపలర్‌ను ఎంపిక చేయాలని కోరడం సరైంది కాదని సిఎస్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై రేపు రాజధాని అభివృద్ధి కమిటీతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిసింది. 

సింగపూర్‌ కోసమే ప్లాట్ల తంతు
సింగపూర్‌ కంపెనీలకు సీడ్‌ డెవలప్‌మెంట్‌ ఏరియాలో భూములు కేటాయింపును త్వరితగతిన చేసేందుకే రైతులకు ప్లాట్ల పంపిణీ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చారు. రైతుల వాటా పంపిణీ మొదలుపెట్టామని చెప్పి అక్కడ ఉన్న మొత్తం రైతుల్లో వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాస్తవంగా అయితే రైతులకు లేఅవుట్‌ వేసి రైతులకు ప్లాట్లు ఇచ్చేందుకు కనీసం మూడేళ్లు పడుతుంది. అవి కూడా కోర్టుకేసులు లేకపోతే. తాత్కాలికంగా రైతులకిచ్చే ప్లాట్ల లేఅవుట్‌ను చూపించి వాటిల్లో నెంబర్లను లాటరీ పద్దతిలో కేటాయిస్తామంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భూములను ఫిజికల్‌గా కేటాయించడం సాధ్యం కాదు. చాలావరకూ భూములు సేకరించాల్సి ఉంది. లేదా పూలింగులో తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఏదీ పూర్తి చేయకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకు వెళ్లడం వెనుక సింగపూర్‌ కంపెనీల పేరుతో భూ వ్యాపారం చేయడం తప్ప మరొకటి కాదనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. 

AP Government giving flats to Singapore companies in Amaravathi. To cover it in people, giving flats to people.