బిహర్లో ఫ్యామిలీ పాలిటిక్స్

7 Jun 2016


బిహార్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్‌ లాలు ప్రసాద్ కుటుంబానికి ఓ ప్రత్యేకత ఉంది. లాలు కుటుంబం నుంచి రాజకీయవారసులుగా వచ్చినట్టుగా, చట్టసభ ప్రతినిధులుగా ఎన్నికైనట్టుగా ఆ రాష్ట్రం నుంచి మరే కుటుంబం నుంచి రాలేదు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీ నుంచి మరొకరు పాలిటిక్స్ కి ఎంట్రీ ఇచ్చేశారు. అది కూడా ఎలాంటి పోటీ లేకుండా. తాను అధికారానికి దూరమైనా, తన వాళ్లైనా రాజకీయాల్లో ఉండాలనే పట్టుదల ఆయనది. అందుకే  గతేడాది జరిగిన బిహార్ ఎన్నికల్లో జేడీయూతో పొత్తుపెట్టుకుని మళ్లీ పూర్వవైభవం సాధించారు. లాలు ఈసారి వారసులను తెరపైకి తెచ్చారు. లాలు పుత్రరత్నాల్లో తేజస్వి  యాదవ్ ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కాగా, తేజ్ ప్రతాప్ యాదవ్ రాష్ట్ర మంత్రి గా మారారు.

ఇప్పుడు లాలు కుటుంబం నుంచి మరో వారసురాలు చట్టసభకు ఎన్నికయ్యారు. లాలు పెద్ద కూతురు మీసా భారతి ఆర్జేడీ తరపున రాజ్యసభ సభ్యురాలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె ఇంతకుమందే రాజకీయాల్లో అరంగేట్రం చేసినా 2014 లోక్ సభ ఎన్నికల్లో నిరాశ ఎదురైంది. పాటలీపుత్ర నియోజవర్గం నుంచి పోటీచేసిన భారతి స్వల్ప తేడాతో ఓడిపోయారు, దీంతో ఆమె లోక్ సభ మెట్లు ఎక్కలేకపోయారు. లాలు ఇప్పుడు తన ముద్దుల తనయను రాజ్యసభకు పంపి ఆమె ముచ్చట తీర్చారు. రాజ్యసభ టికెట్ రేసులో స్వయంగా లాలు భార్య రబ్రీదేవి పోటీకి వచ్చినా, ఆయన కూతురుకే ఓటేశారు. ఈ విషయంలో తేజ్ ప్రతాప్, తేజస్వి లు సోదరికే మద్దతుగా నిలిచారు. అలా  లాలు కుటుంబం నుంచి మరొకరు చట్టసభల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లైంది.  దీంతో లాలు, ఆయన భార్య, ఇద్దరు కుమారులు, ఇప్పుడు కుమార్తె, వీరితో పాటు బావమరుదులు.. ఇలా ఫ్యామిలీకి ఫ్యామిలీనే పొలిటికల్ ఫ్యామిలీగా మారినట్లైంది.

Bihar ex chief minister Lalu Prasad yadav is present away form politics. But he is showing his influence on politics. Present his family members are leading politics in Bihar.