ధన రాజకీయం

6 Jun 2016


తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఎంపికలో డబ్బే కీలకపాత్ర పోషించింది. ఇది విపక్షాలు చేస్తున్న ఆరోపణలు కాదు. సొంత పార్టీ నేతలే చెబుతున్న వాస్త వాలు. ఈ ప్రక్రి యలో ఆ పార్టీలో మొదటి నుండి సేవలందిస్తున్న దళిత నేతలను విస్మరించడమే కాదు… అవమానానికి గురిచేశారు. తమ గోడు పార్టీ అధినేత వద్ద వినిపించడానికీ వారికి అవకాశం దక్కలేదు. అంతే కాదు… సిఎం క్యాంపు కార్యాల యం దాకా వెళ్లడానికి కూడా వారికి అనుమతి లభించలేదు. ఎక్కడి కక్కడ అడ్డుకుని తిప్పి పంపారు. సీటు దాదాపుగా ఖరారైన పుష్ప రాజ్‌ను ఏదో విధంగా సిఎం క్యాంపు కార్యా లయంకు చేరుకుంటే ఆయన్ను పక్కగదిలో ఉంచి రాజకీయం చేశా రు. చివరి క్షణంలో టిజి వెంకటేశ్‌్‌ పేరు ఖరారు చేశారు. పుష్ప రాజ్‌ను చంద్రబాబును కలవనీయ కుండానే వెనక్కి పంపారు. టిడిపి రాజ్యసభ ఎంపికలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు ఆ పార్టీలో కలకలం రేపాయి. మరోవైపు నాల్గవ అభ్యర్థిని బరిలోకి దింపడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేసిన ఆ పార్టీ చివరకు వెనకడుగువేసింది. అభ్యర్థుల ఎంపికలో పారిశ్రామిక వేత్తలకే పట్టం కట్టిన తెలుగుదేశం పార్టీ ఆ క్రమంలో దళిత నేతలను అవమానపరిచింది. రాజ్యసభ అభ్యర్థిత్వం విషయంలో తమ వాదన వినిపించడానికి వచ్చిన ముగ్గురు దళిత నేతలకు పార్టీ అధినేత అప్పాయింట్‌మెంటు దొరకలేదు. వీరిలో ఇద్దరిని భద్రతా సిబ్బంది అడ్డుకుని వెనక్కి పంపేశారు. దీంతో వారు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు.

పుష్పరాజ్‌ను పక్కగదిలోనే ఉంచి …
గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్‌ నేత జెఆర్‌ పుష్పరాజ్‌కు రాజ్యసభ టిక్కెట్‌ దాదాపుగా ఖరారైంది. మహానాడు ముగిసిన అనంతరం జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశం అనంతరం టిడిపి నేతలు ఈ విధమైన సంకేతాలే ఇచ్చారు. యనమల రామకృష్ణుడుతో పాటు పలువురు సీనియర్‌ నేతలూ ఆయనకు అభినందనలు తెలిపారు. దీంతో తిరుపతి నుండి నేరుగా సిఎం నివాసానికి చేరుకున్నారు. సోమవారం ఉదయమే క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన సాయంత్రం వరకు పడిగాపులు గాచినా పార్టీ అధినేత దర్శనం దొరకలేదు. మరోవైపు ఆయన పక్కగదిలోనే రాజకీయం శరవేగంగా సాగింది. అనూహ్యంగా రాయలసీమ కోణం తెరపైకి వచ్చింది. సీమలో మరో సీనియర్‌ నేత లేరన్నట్టుగా ఇటీవలే టిడిపిలోకి చేరిన టిజి వెంకటేశ్‌కు రాజ్యసభ అభ్యర్థిత్వం దక్కింది. ఆయన్ను పక్కనే ఉంచుకుని ముఖ్యమంత్రి అభ్యర్థుల ప్రకటన చేసేశారు. ఆ తరువాత కూడా పుష్పరాజ్‌కు చంద్రబాబును కలిసే అవకాశం లభించలేదు. దీంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురై తిరుగుముఖం పట్టారు. మంగళవారం నాడు గుంటూరులో విలేకరులతో మాట్లాడిన జెఆర్‌ పుష్పరాజ్‌ డబ్బు లేదనే తనకు టిక్కెటు ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. ‘టిడిపిలో సీనియర్లకు చోటులేదు.’ అని ఆయన అన్నారు. తనకు సీటు ఇచ్చినట్లు ప్రచారం చేసి చివరి క్షణంలో ఇతరులకు ఇవ్వడంతో మనసు గాయపడిందని చెప్పారు. ఎన్‌టిఆర్‌ హయంలో మాదిరిగా పాలనలో నిజాయతీ లేదని, అప్పుడు డబ్బుకు ప్రాధాన్యత లేదని కేవలం నిబద్ధతన, నిజాయితీలే కొలబద్దగా ఉండేవని తెలిపారు. తాను పూర్తి సమయం పార్టీకే కేటాయించి పనిచేస్తున్నానని అన్నారు. న్యాయపరమైన అధికారాలుండే పదవులనూ అనర్హులకే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హేమలతను ప్రకాశం బ్యారేజీ మీదే …
రాజ్యసభ సీటు ఆశించిన దళిత మహిళా నేత హేమలతను కనీసం క్యాంపు కార్యాలయ రోడ్డుమీదకు కూడా అనుమతించలేదని సమాచారం. చిత్తూరు జిల్లాకు చెందిన హేమలత పేరు కూడా టిడిపి అభ్యర్థుల రేసులో ప్రముఖంగా వినిపించిన విషయం తెలిసిందే. నాల్గవ అభ్యర్థిని బరిలోకి దింపే ఆలోచన చేస్తుండటంతో ఆమె కూడా విజయవాడకు చేరుకున్నారు. పార్టీ అధినేతను కలవడానికి క్యాంపు కార్యాలయానికి బయలు దేరారు. అయితే, హేమలతను ప్రకాశం బ్యారేజి దాటిన వెంటనే భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఆమె పేరు అడిగి మరీ ‘ముఖ్యమంత్రి ఈ రోజు కలవరు… వెనక్కి వెళ్లిపోండి’ అంటూ తిప్పిపంపారు. అక్కడి నుండే సెల్‌ఫోన్లో క్యాంపు కార్యాలయానికి సెల్‌ఫోన్లో ఆమె మాట్లాడటానికి చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలిసింది

రాయపాటికి ఒకే .. డొక్కాకు నో
రాజ్యసభ సీటు అశించిన మరో నేత, టిడిపి అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు చిత్రమైన పరిస్థితి ఎదురైంది. నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావుతో కలిసి ఆయన క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్ళారు. అయితే, భద్రతా సిబ్బంది రాయపాటిని మాత్రమే లోపలికి అనుమతించి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను కరకట్టమీదనే నిలిపివేశారు.

నాలుగో అభ్యర్ధిపై వెనక్కి …!
స్వతంత్ర అభ్యర్థి పేరుతో నాలుగో అభ్యర్థిని రాజ్యసభ ఎన్నికల బరిలోకి దింపాలన్న ప్రతిపాదనను టిడిపి ఉపసంహరించుకుంది. ఈ ప్రయత్నంపై విమర్శలు వ్యక్తం కావడంతో పాటు, అవసరమైన ఎంఎల్‌ఏల సంఖ్యను సమకూర్చుకోవడం కష్టమని భావించడంతో ఈ ప్రతిపాదన నుండి వెనక్కి తగ్గినట్లు సమాచారం

In Andhra Pradesh Chandrababu Naidu playing money politics. In Rajyasabha member selection he did worst politics.