బీపీఎల్ లిస్టులో బీజేపీ ఎమ్మెల్యే

10 Jun 2016


ఆయనో డాక్టర్.. అంతకుమించి ఎమ్మెల్యే.. అందులోనూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన నేత... అంతేకాదు.. కశ్మీర్ ప్రభుత్వంలోనూ భాగస్వామిగా ఉన్న బీజేపీకి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా ఆయన మాత్రం దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారట. బీపీఎల్ జాబితాలో ఆయన పేరుండడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశమవుతోంది. ఒకప్పుడు అక్కడక్కడా నిరుపేద ఎమ్మెల్యేలు ఉండేవారు.. కానీ ఇప్పుడు మాత్రం దేశంలో దుర్భిణీ వేసి వెతికినా కూడా అలాంటివారు మచ్చుకు కూడా కనిపించరు. ఇలాంటి తరుణంలో కశ్మీర్ లోని  ఛాబ్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ క్రిషన్ లాల్ భగత్ పేరు బీపీఎల్ జాబితాలో ఉండడం సంచలనం రేపుతోంది. దీనిపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు అసెంబ్లీలో నిలదీయడంతో కశ్మీర్లోని పీడీపీ-బీజేపీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెహబూబా ముఫ్తీ సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యే పేరును బీపీఎల్ జాబితాలో చేర్చడానికి బాధ్యులైన తహశీల్దార్ - ఇద్దరు పౌరసరఫరాల శాఖ అధికారులను సస్పెండ్ చేసింది. అయినా... విపక్షాల దాడి మాత్రం ఏమాత్రం ఆగడం లేదు.

మరోవైపు ఎమ్మెల్యే భగత్ కూడా ఈ పొరపాటుపై వివరణ ఇచ్చారు. బీపీఎల్ జాబితాలో తన పేరు పొరపాటుగా చేర్చారని అంటున్నారు. ఈ మేరకు ఆయన గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేశారు.  తాజాగా ఈ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించామని కశ్మీర్ రెవెన్యు శాఖ మంత్రి సయిద్ బాష్రాత్ బుకారీ అసెంబ్లీలో తెలిపారు. 7 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని జమ్మూ డిప్యూటీ కమిషనర్ ను ఆదేశించినట్టు చెప్పారు.

ఈ వ్యవహారంపై పాలక పీడీపీపై కూడా గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యే తీరు కారణంగా తాము అప్రతిష్ఠ పాలవుతున్నామని కొందరు పీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. భగత్ పేరు బీపీఎల్ జాబితాలో ఉండడంలో ఆయన ప్రమేయం ఉండొచ్చని భావిస్తున్నారు. విషయం బయటకు రావడంతో ఆయన తనకేమీ తెలియదని అంటున్నారని.. కానీ.. ఏవో ప్రయోజనాలు ఆశించి ఆయన ఇలా బీపీఎల్ జాబితాలో పేరు చేర్చేలా అధికారులపై ఒత్తిడి చేసి ఉంటారని లోలోపల అంటున్నారు. మొత్తానికి విషయం ఏమైనా కూడా ఒక ఎమ్మెల్యే పేరు బీపీఎల్ జాబితాలో ఉండడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

This is the best example how BJP government miss using their power. In Kashmir BJP MLA name is in BPL list.