చంద్రబాబు ఇటుకల బేరం ఏమైంది?

7 Jun 2016


ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు అట్టహాసంగా ప్రారంభించిన ‘నా ఇటుక- నా అమరావతి’కి  బేరాలు తగ్గిపోయాయి. కొత్త రాజధానిలో అందరినీ భాగస్వాములను చేసేందుకు సిఆర్ డిఎ నేతృత్వంలో గత ఏడాది అక్టోబర్ 15న ‘నా ఇటుక - నా అమరావతి’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఒక్కో ఇటుకకు 10 రూపాయల చొప్పున వసూలు చేస్తూ ఆన్ లైన్ లో కొనుగోలుదారుల వివరాలను సిఆర్ డిఎ పొందుపర్చింది. కార్యక్రమం ప్రారంభమైన మూడురోజుల్లోనే ఔత్సాహికులు 18 లక్షల ఇటుకలు కొనుగోలు చేశారు. ఎన్నారైలు సైతం ఆన్ లైన్ ద్వారా ఇటుకలను విరాళంగా అందించేందుకు ముందుకొచ్చారు.
    
అయితే ప్రచారం లేకపోవడంతో ప్రజాస్పందన కరవైంది. ఆన్ లైన్ లో వివరాలు కొంతమందికే పరిమితం కావడంతో ఇటుకకు గిరాకీ తగ్గింది. ఇప్పటివరకు 55 లక్షల 63 వేల 658 ఇటుకలను 2 లక్షల 25 వేల 613 మంది కొనుగోలు చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన గతేడాది అక్టోబర్ 22వ తేదీకే మూడు బిలియన్ల ఇటుకల విక్రయం లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. అయితే ఇప్పటికీ కోటికి కూడా చేరుకోక పోవడం గమనార్హం. అమరావతికి విరాళంగా ఇచ్చే ఇటుకల ద్వారా ప్రభుత్వానికి ఇప్పటివరకు కేవలం 5.5 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. మరో మూడు నెలల్లో ఏడాది పూర్తికావస్తున్నా స్పందన నామమాత్రం కావడంతో సిఆర్ డిఎ అధికారులు విస్తృత ప్రచారం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆన్ లైన్ తో పాటు కరపత్రాలు - పోస్టర్ల ప్రచారం ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించారు. అమరావతి ఇటుకలకు ప్రజాభాగస్వామ్యంలో మంత్రులు - ఎమ్మెల్యేలు అంతగా చొరవచూపడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
    
ప్రభుత్వం చేపట్టే చాలా కార్యక్రమాల పరిస్థితి ఇలాగే ఉంటోందని... ఆరంభ శూరత్వంగానే మిగులుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. నా ఇటుక-నా అమరావతికి కూడా తొలుత భారీ స్పందన వచ్చినా ఆ తరువాత అంతా మర్చిపోయారు. ముఖ్యంగా ప్రభుత్వ వర్గాలు కూడా ఆ విషయం మర్చిపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పొచ్చు.

Six months back Chandrababu Naidu started bricks business to do every one as a part to Amaravathi. And till now he did not reached his target.