310 హాస్టళ్లకు మంగళం

17 Jun 2016


రాష్ట్రంలోని 310 సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు ప్రభుత్వం మంగళపాడింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు తాజాగా వెలువడటంతో అధికారులు ఆ పనిలో నిమగమై ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,100 మంది విద్యార్థులను వేరే వసతిగృహాల్లోకి తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నిర్ణయం ప్రాథమిక పాఠశాలపైనా తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రభుత్వ ఆదేశాల్లో భాగంగా ఐదో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులను సమీప గురుకులాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలలకు తరలించేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులను దగ్గరలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు తరలిస్తున్నారు. వసతి గృహాల మూసివేత అంశాన్ని పాఠశాలలు తెరిచేంతవరకూ నాన్చుతూ వచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు అకస్మాత్తుగా దీన్ని అమలు చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం విద్యార్థుల చదువులపై తీవ్ర ప్రభావం చూపనుంది. 

ఇకపై ఇంగ్లీషులో బోధన
ఇప్పటివరకూ తెలుగు మీడియంలో చదివిన (ఐదో తరగతి నుంచి ఎనిమిది తరగతి వరకూ) విద్యార్థులు ఇకపై ఇంగ్లీషు మీడియంలో చదవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తరగతుల బోధన ఇంగ్లీషు మీడియంలో ఉండటంతో వాటిని ఎంతవరకూ ఆకలింపు చేసుకుంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది. సాధారణంగా తెలుగు మీడియం విద్యార్థులు ఇంగ్లీషు సబ్జెక్టునే కష్టతరంగా భావిస్తారు. చాలామంది విద్యార్థులు ఆ సబ్జెక్టులో ఉత్తీర్ణత చెందడానికి నానా తంటాలు పడుతుంటారు. ఇకపై అన్ని సబ్జెక్టులనూ ఇంగ్లీషు మీడియంలోనే రాయాల్సి ఉండటంతో వారికి కత్తిమీద సాములా మారే అవకాశముంది. దీంతో, వారు గందరగోళానికి గురవడటంతోపాటు, మానసిక ఒత్తిడికి లోనయ్యే ప్రమాదమూ లేకపోలేదు. ఫలితంగా విద్యార్థుల్లో డ్రాపౌట్లు పెరిగే అవకాశాలుంటాయని పలువురు వసతి గృహ సంక్షేమ అధికారులు అభిప్రాయపడుతున్నారు. 
మూసివేయనున్న 310 వసతి గృహాల్లో ఇప్పటివరకూ పని చేస్తున్న 930 మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. ఒక్కొక్క వసతి గృహంలో ముగ్గురు చొప్పున పని చేస్తున్నారు. కుక్‌, అటెండర్‌, నైట్‌ వాచ్‌మెన్‌ వంటి విధులు నిర్వహిస్తున్నారు.
ప్రాథమికోన్నత పాఠశాలలు డౌన్‌ గ్రేడ్‌ 

ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల విద్యార్థులనందరినీ తరలిస్తుండటంతో ఆ పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలుగా డౌన్‌ గ్రేడ్‌ కానున్నాయి. వసతి గృహాల మూసివేత వల్ల ఆయా వసతి గృహాలకు అనుబంధంగా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలల మూసివేతకూ దారి తీసే అవకాశాలున్నాయి. వసతిగృహ విద్యార్థుల తరలింపుతో కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పది కంటే తక్కువకు పడేపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులు తక్కువగా ఉన్నారనే పేరుతో ఇటువంటి పాఠశాలలను కూడా మూసి విద్యార్థులను సమీపంలోని పాఠశాలకు తరలించే ప్రమాదమూ ఉంది.

AP government cancelled 310 residential hostels. He is saying, i will do government schools as corporate school and i will introduced english medium in government schools. But no growth till now.