బాబుకు షాక్: జగన్ వైపు ‘పరిటాల’ వర్గం

23 May 2016


ఏపీలోని అనంతపురం జిల్లాలో చేరికల విషయంలో సీన్ రివర్స్ అవుతోంది. ఇప్పటిదాకా వైసిపికి చెందిన ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌కు ఝలకిస్తూ టిడిపిలో చేరుతున్నారు. కానీ, అనంతలో టిడిపి నేత కందికుంట వెంకటప్రసాద్ వైసిపి వైపు చూస్తున్నారా అనే చర్చ సాగుతోంది. తాను తలుచుకుంటే చంద్రబాబు సర్కారును కూల్చేస్తానని వైయస్ జగన్ కొద్ది నెలల క్రితం రాజ్ భవన్ ఎదుట సవాల్ విసిరిన తర్వాత నుంచి వైసిపి ఎమ్మెల్యేలు వరుసగా టిడిపిలో చేరుతున్నారు.

ఇప్పటిదాకా పదిహేడు మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. ఇది సంచలనం సృష్టిస్తోంది. మరికొంత మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్ పార్టీని వీడిన ఎమ్మెల్యేల స్థానంలో బలమైన నేతలను ఇంఛార్జులుగా నియమిస్తున్నారు. కర్నూలు జిల్లాలో కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా టిడిపిలో చేరారు.

పరిటాల వర్గీయుడైన కందికుంటకు చెక్ చెప్పేందుకేనా? దీంతో నియోజకవర్గ ఇంఛార్జ్ ఉన్న కందికుంట వెంకటప్రసాద్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు. చాంద్ బాషాను పార్టీలో చేర్చుకునే సమయంలోనే కందికుంట తన వ్యతిరేకతను బాబుకు తెలియజేశారు. పరిటాల రవీంద్ర వర్గానికి చెందిన కందికుంటకు చెక్ పెట్టేందుకే ఓ వర్గం నేతలు చాంద్ బాషాను బలవంతంగానే పార్టీలోకి తీసుకు వచ్చిందని అంటున్నారు.

చాంద్ బాషా పార్టీలో చేరడంతో అప్పటిదాకా కదిరిలో చక్రం తిప్పిన కందికుంట ఇప్పుడు ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. కందికుంట అసంతృప్తిగా ఉన్న విషయం తెలుసుకున్న వైసిపి రంగంలోకి దిగిందని తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో కదిరి టీడీపీ టికెట్ చాంద్ బాషాకే దక్కుతుందని ఆయనను తమ వైపుకు లాక్కునేందుకు వైసిపి ప్రయత్నాలు చేస్తోందట. కందికుంట తమ పార్టీలో ఏకంగా హిందూపురం పార్లమెంటు టికెట్ ఇస్తామని చెబుతున్నారట. చేనేత సామాజిక వర్గానికి చెందిన కందికుంటకు హిందూపురం పరిధిలో బలం ఉంది. ఈ నేపథ్యంలో కందికుంట వైసిపిలో చేరుతారా అనే చర్చ సాగుతోంది.

It is really shock to AP CM Chandrababu Naidu. Till now he is attracting YSRCP MLAs by showing offers. But in Karnool district Paritala team is showing interest in YSRCP.