జగన్ దెబ్బకి….ఆగిపోయినా ఆపరేషన్ ఆకర్ష్

26 May 2016


ఆంధ్రప్రదేశ్‌లో ఆపరేషన్ ఆకర్ష్ ఆగిపోయినట్లు కనబడుతోంది. వైసీపీ నుండి ఫిరాయించిన ఎంఎల్ఏల పై అనర్హత వేటు వేయాలని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సుప్రింకోర్టులో కేసు వేయటమే ప్రధాన కారణంగా కనబడుతోంది. అం తేకాకుండా రాజ్యసభ ఎన్నికల ఎన్నికకు ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ జారీ చేయటం కూడా మరో కారణమని తెలుస్తోంది. ఏపిలో సంఖ్యాబ లం రీత్యా తెలుగుదేశం పార్టీకి మూడు స్ధానాలు, వైసీపీకి ఒక స్ధానం ఖాయంగా దక్కుతాయి. అయితే, వైసీపీకి దక్కుతుందనుకున్న ఒక్క స్ధానాన్ని ఎట్టి పరిస్దితుల్లోనూ దక్కనీయకూడదని టిడిపి నాయకత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగానే ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. అందులో భాగంగానే ఇప్పటి వరకూ 17 మంది ఎంఎల్ఏలను పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబనాయడు తన పార్టీలోకి లాక్కున్నారు. వైసీపీ నుండి ఎంఎల్ఏలను లాక్కోవటం పట్ల పార్టీలోని కొందరు సీనియర్లు అభ్యంతరం పెట్టినా చంద్రబాబు లెక్కచేయలేదు. ప్రధాన ప్రతిపక్షంగా ఇటు శాసనసభలోనూ అటు రాష్ట్రంలోను వైసీపీ అధ్యక్షుడు జగన్ అనుసరిస్తున్న వ్యూహాలతోనే చంద్రబాబు ఇబ్బందు పడుతున్నారు. దాంతో ఇటు శాసనసభలోనూ అటు బయట కూడా జగన్‌ను కోలుకోలేని విధంగా దెబ్బతీయాలంటే ఆపరేషన్ ఆకర్ష్ ఒక్కటే మార్గమని చంద్రబాబు భావించారు. తెలంగాణాలో ఇదే పని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మొదలుపెట్టినపుడు ఇదే చంద్రబాబు అప్పట్లో కెసిఆర్‌ను నానా తిట్లు తిట్టారు. ఆ తర్వాత ఏపిలో చంద్రబాబు కూడా చివరకు కెసిఆర్‌నే అనుసరించారు. దాంతో ఇరు రాష్ట్రాల్లోనూ ఆపరేషన్ ఆకర్ష్ బాగా రక్తి కట్టింది. అయితే, కెసిఆర్ దెబ్బకు తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ కుదేలైంది. అదేవిధంగా ఏపిలో కూడా వైసీపీని దెబ్బతీయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ విషయంలో పార్టీలోనే కాకుండా బయటకూడా చంద్రబాబు వ్యవహారశైలిపై వ్యతిరేకత వచ్చినా వెనకాడలేదు.

అదే సమయంలో జగన్ చంద్రబాబుపై ‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్ ‘ అనే పుస్తకం అచ్చేసి ఢిల్లీకి వెళ్ళి మరీ కేంద్ర హోంశాఖ, ఆర్దికశాఖల మంత్రులు రాజనాథ్ సింగ్, అరుణ్‌జైట్లీలను కలిసి అందచేసారు. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి అనుసరిస్తున్న విధానాలను, పెరిగిపోయిన అవినీతి, అధికార దుర్వినియోగం తదితరాలను పూర్తిగా వివరించారు. మిత్రపక్షంగా ఉండి కేంద్రమంత్రులు జగన్‌తో అంతసేపు మాట్లాడటం, కొన్ని వివరాలు అడిగి మరీ చెప్పించుకోవటంతో టిడిపి నేతలకు బాగా మండిపోయింది. ఇదే విషయమై చంద్రబాబు కూడా ఢిల్లీలోని పెద్దల వద్ద అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు అయితే వారు చంద్రబాబును చాలా లైట్ తీసుకున్నట్లు సమాచారం. దాంతో చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్‌కు కొంత విరామం ఇవ్వక తప్పలేదు. అదే సమయంలో ఉత్తరాఖండ్ విషయంలో కూడా ఫిరాయింపు ఎంఎల్ఏల విషయంలో ముందు హైకోర్టు, ఆ తర్వాత సుప్రింకోర్టు కూడా ఫిరాయించిన తొమ్మది మంది ఎంఎల్ఏలకు ఓటింగ్ హక్కు లేకుండా చేయటం కూడా ఏపిలోని ఆపరేషన్ ఆకర్ష్‌కు బ్రేక్ పడిందనే చెప్పాలి. అదేసమయంలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రమంత్రులు ఇద్దరు ఏపికి ప్రత్యేకహోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్, రూ. 17 వేల కోట్ల రెవిన్యూలోటు ఇవ్వటం సాధ్యం కాదని ప్రకటన కూడా రాష్ట్రంలో పెద్ద దుమారాన్నే రేపింది. కేంద్రం చేసిన ప్రకటనతో రాష్ట్రంలో ఒక్కసారిగా ఆందోళనలు మొదలై రాజకీయం వేడెక్కటంతో ఆపరేషన్ ఆకర్ష్ వెనక్కుపోయిందనే చెప్పాలి.

ఒకవైపు కేంద్రం నుండి ఆశించిన సహాకరం అందకపోవటం, ఇంకోవైపు ఉత్తరాఖండ్ ఉదంతాన్ని అనుసరించి జగన్ సుప్రింకోర్టులో కేసు వేయటం, ఇంకోవైపు రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన నిరసన తదితరాలతో చంద్రబాబు తాత్కాలికంగా ఆపరేషన్ ఆకర్ష్‌ను నిలుపుదల చేసారు. అయితే ఇంతలో కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయటంతో ఇక ఆపరేషన్ ఆకర్ష్‌ను విధిలేక ఆపేయాల్సి వచ్చింది. దాంతో వైసీపీకి రాజ్యసభ స్ధానాన్ని దక్కకుండా చేయాలన్న చంద్రబాబు ఆశ నిరాసే అయింది. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ నుండి ఫిరాయించిన 17 మంది ప్రజాప్రతినిధులకు ఓటు హక్కుపై త్వరలో సుప్రింకోర్టు తీర్పు వెలువడనున్నది. అది గనుక వైసీపికి అనుకూలంగా వస్తే చంద్రబాబుకు వ్రతమూ చెడి ఫలితమూ దక్కలేదనే చెప్పాలి.

In Andhra Pradesh Operation attraction is stopped because of YS Jagan. He file a case in supreme court against jumped MLAs. So Chandrababu Naidu was affaired of YS jagan.