అక్రమ ప్రాజెక్టులతో రాష్ట్రం ఎడారే-వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి

18 May 2016


కృష్ణా, గోదావరి నదులపై ఎగువన తెలంగాణ రాష్ట్రంలో తలపెట్టిన అక్రమ ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్‌ ఎడారిగా మారుతుందని వైసిపి అధ్యక్షులు వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా నదిలో మహారాష్ట్ర, కర్ణాటక అవసరాలు తీరాక కిందికి నీటిని వదులుతున్నారన్నారు. మనకొచ్చే నీటిలో 120 టీఎంసీలు కేసీఆర్‌ తీసుకుపోతే ఆంధ్రా పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక జలదోపిడీ చేసేవని, రాష్ట్రం విడిపోయిన తర్వాత జల దోపిడీకి తెలంగాణ తోడైందని తెలిపారు. శ్రీశైలంలోకి కృష్ణా నీరు రాకముందే పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణాలను చేపట్టి కేసీఆర్‌ ప్రభుత్వం నీటిని అడ్డుకుంటోందని తెలిపారు. శ్రీశైలంలోకి నీరు రాకపోతే రాయలసీమకు సాగునీరు కాదు కదా తాగడానికి గుక్కెడు నీరు కూడా దొరకదని చెప్పారు. నాగర్జునసాగర్‌, కృష్ణా డెల్టా పూర్తిస్థాయిలో దెబ్బ తింటుందన్నారు. శ్రీశైలంలో 854 అడుగుల నీరు ఉంటేనే రాయలసీమకు నీటిని మళ్లించుకునే అవకాశం ఉందని తెలిపారు. పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు తెలుగు గంగ, హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి, వెలుగోడు ప్రాజెక్టులు, తెలంగాణకు కల్వకుర్తి, నెట్టంపాడు ఎత్తిపోతల పథకాలకు మాత్రమే అనుమతులున్నాయని చెప్పారు. సిడబ్ల్యుసి వాటర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు, ఎఫెక్స్‌ కమిటీలతో సంబంధం లేకుండా పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ కెసిఆర్‌ నియంతలా ప్రాజెక్టులను చేపడుతుంటే సిఎం చంద్రబాబు నోరు మెదపడం లేదన్నారు.

Telangana government constructing illegal projects on Krishna and Godhavari rivers. AP opponent leader YS Jagan questioning abut this projects.