ఆ తేనెమనసుకు 72 ఏళ్లు

31 May 2016


ఇండస్ట్రీకి వచ్చి 51 సంవత్సరాలైనా..ఇంకా ఆయన్ని తెరపై చూడాలనే అభిమానులే ఎక్కువ, ఆయనే సూపర్ స్టార్ కృష్ణ. ఇది కృష్ణ స్వర్ణోత్సవ సంవత్సరం. తెలుగు సినిమా తెరపై ఆయన వేసిన ముద్ర చెరగనిది. తెలుగు తెరకి సూపర్ స్టార్ అంటే ఆయనే గుర్తొస్తారు. కృష్ణకి ముందు, కృష్ణకి తర్వాత అని తెలుగు చలనచిత్రపరిశ్రమని విభజించి చూడొచ్చంటేనే, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన చేసిన సాహసాలు, అనుసరించిన కొత్త పుంతలు తెలుస్తాయ్. ఓ సాంకేతికతను తెలుగుకు పరిచయం చేయాలంటే ఈ రోజుకి కూడా ఆయనే ముందుంటారు. తెలుగు తెరకి కౌబాయ్ ఆయనే, జేమ్స్ బాండూ ఆయనే, డిటెక్టివ్ హీరో సూపర్ స్టారే, సూటు బూటులో ఎంత స్టయిలిష్ గా ఉంటాడో, పంచెకట్టుతో అచ్చ తెలుగుమనిషిలా కన్పించడమూ ఆయనకే చెల్లు. ఫైట్లు చేసినా, ఒక్క పాట లేకుండా సినిమా అంతా కన్పించినా, సూపర్ స్టార్ కృష్ణకే సాధ్యం. క్రైమ్, సోషల్, ఫ్యామిలీ, నావెల్టీతోనే కాకుండా, చారిత్రక పాత్రల్లోనూ అలరించారు సూపర్ స్టార్.

పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి అయినా, మొదటి సినిమా తేనెమనసులతో కృష్ణ గా బాపు రమణల చేతులమీదుగా తెరకెక్కారు. అప్పట్నుంచీ తెలుగుతెరకు ఆయనో పెట్టని కోటలా ఎదిగారు. సినిమారంగ అభివృధ్దిలో అగ్రభాగాన పయనించారు, మంచి నటుడే కాదు మనసున్న వ్యక్తని అందరూ కొనియాడే సూపర్ స్టార్ తొలి నాలుగైదు సినిమాలతోనే తన స్టార్ డమ్ సంపాదించుకున్నారు. సాక్షితో నటనపరంగా ఆకట్టుకోగా, అవేకళ్లు, గూఢచారి 116 సినిమాలతో మాస్ పల్స్ పట్టేసుకుని, యూత్ లో విపరీతమైన  క్రేజ్ సంపాదించుకున్నారు. జేమ్స్ బాండ్ మూవీలకే కాకుండా, డిటెక్టివ్ కథాంశాలున్న సినిమాల పదుల సంఖ్యలో చేసిన కృష్ణ, ఫ్యామిలీ ఆడియెన్స్ ని దగ్గరయ్యేందుకు కుటుంబ కథాచిత్రాల్లోనూ నటించారు. వాటితో పాటే, యూత్ ని మిస్సవ్వకుండా చూసుకునేవాళ్లు. నేనంటే నేనే సినిమా తర్వాత టీజింగ్ సాంగ్స్ అంటే కృష్ణే చేయాలనేవారు కూడా.

రొటీన్ గా అన్పిస్తున్న కథలతో బోరెత్తిన తెలుగు జనానికి కౌబాయ్ ని పరిచయం చేసిన క్రెడిట్ సూపర్ స్టార్ దే, మోసగాళ్లకు మోసగాడుతో తెలుగు సినిమా స్టాండర్డ్స్ ఎక్కడకో వెళ్లిపోయాయ్. తెలుగోడి సత్తాకి నిదర్శనంగా నిలిచిన ఈ సినిమా ఇప్పటికీ, ఎప్పటికీ సూపర్ మూవీనే. కౌబాయ్ సినిమా మోసగాళ్లకి మోసగాడు వచ్చిన తర్వాత అదే మూసలో దాదాపు 50 సినిమాలు తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపాయ్. ప్రతి హీరో కౌబాయ్ గెటప్ వేసుకుని తరించినోళ్లే, ఇదే టైమ్ లో కృష్ణ ఫ్యామిలీ సినిమాలు కూడా చేశారు. ఆ తర్వాత ఏం చేయాలనే తపనతో ఉన్న కృష్ణ మదిలో ఆలోచనకు సమకాలీకులు ఇచ్చిన రూపమే అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, శోభన్ బాబుతో మొదలవ్వాల్సిన ఈ సినిమా కృష్ణగారితో పూర్తైంది. ఎన్నో  వ్యయప్రయాసలకు ఓర్చి, విమర్శలను ఎదుర్కొని చేసిన ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే, ఈ సినిమా పాటకే  జాతీయ ఉత్తమగీతం అవార్డు దక్కింది.

కెరీర్లో అప్ అండ్ డౌన్స్ అందరికీ సహజం, ఐతే పడిన ప్రతిసారీ అంతే వేగంగా పైకి లేవడం కృష్ణకెరీర్ ని గమనిస్తే అర్ధం అవుతుంది. ఎన్ని ఫ్లాపులు వచ్చినా, వీడని అభిమానులు ఆయనకే సొంతం, వారి అభిమానంతోనే కృష్ణ ఇన్నేళ్లు నటనను కొనసాగించారంటారు. కెరీర్ బిగినింగ్ నుంచి కూడా కృష్ణ మల్టీస్టారర్ మూవీస్ చేశారు. మిగిలిన హీరోలతో ప్రొడక్షన్ కూడా చేశారు, తానెంతగానే అభిమానించే ఎన్టీఆర్ తో తీసిన దేవుడు చేసిన మనుషులు ఓ ట్రెండ్ సెట్టర్. ఇప్పటికీ అలాంటి మల్టీస్టారర్ రాలేదంటే అతిశయోక్తి  కాదు, అందులో ఇద్దరు ముఖ్యమంత్రులు, ఐదుగురు ఎంపీలు నటించడం విశేషం. అప్పటికి జయలలిత, ఎన్టీఆర్ సిఎంలు కాలేదు. కృష్ణ, జమున, రావుగోపాలరావ్, సత్యనారాయణ ఎంపిలవలేదు. జగ్గయ్య మాత్రం అప్పటికే ఎంపి అయ్యారు. పండంటి కాపురం వంటి హిట్ మూవీ తర్వాత, అటు ఎఎన్ఆర్, ఇటు ఎన్టీఆర్ తో పోటాపోటీగా సినిమాలు తీసారు. దేవదాసులో ఆయన నటనకి మంచి మార్కులే పడ్డా సినిమా ఫ్లాపవడంతో అది వెలుగులోకి రాలేదు. పౌరాణిక కథాంశంతో తీసిన కురుక్షేత్రం సినిమా ఫలితం కూడా అంతే, ఎన్టీఆర్ దానవీరశూరకర్ణతో పోల్చి చూసేసరికి రిజల్ట్ తేడా అయింది. ఐతే నిర్మాణవిలువలు, సాంకేతికత పరంగా తెలుగుచిత్ర పరిధిని ఎంతో పెంచిందీ మూవీూ.

ఇక కృష్ణ కెరీర్లో సాహసాల ప్రస్తావన వస్తే..తొలి కలర్..ఫ్యూజికలర్, స్కోప్ సినిమా..సెవెన్టీఎంఎం సినిమా ..స్టీరియోఫోనిక్ అన్నీ ఆయన తీసుకొచ్చినవే..తెలుగు చిత్రపరిశ్రమ ఇంతవేగంగా..ఈ స్థాయికి చేరిందంటే అది కృష్ణ చూపిన తెగువే అని చెప్పాలి.. ఓ 35ఎంఎం సినిమా చూడటానికి అలవాటైన ప్రేక్షకులకు భారీ కాన్వాస్ పై సినిమాను ఇవ్వడమే కాకుండా దానికి దర్శకత్వం కూడా చేయడం ఆయనకే సాధ్యం
80వ దశకంలో సూపర్ స్టార్ డమ్ పీక్ కి చేరింది..ముఖ్యంగా డాన్ స్టైల్లో చేసిన అగ్నిపర్వతంలో సూపర్ స్టార్ డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుతెలుగు తెరపై ఏ హీరో చేయనన్ని ప్రయోగాలు చేశారు సూపర్ స్టార్ కృష్ణ. తెరపై ఆయన కనిపించనప్పటికీ, మహేష్ రూపంలో అభిమానులు ఆయన్ను తెరపై చూసుకుంటున్నారు. అయితే చాలా కాలం తర్వాత కృష్ణ మళ్లీ తెలుగు తెరపై కనిపించబోతున్నారు. ఇప్పుడిది థర్డ్ ఇన్నింగ్స్ అయితే బావుండనే ఫ్యాన్స్ కి కొదవలేదు. ఏకథాటిగా 30 ఏళ్లు ఇండస్ట్రీలో సినిమాలు చేసిన కృష్ణ హీరోగా 300సినిమాలు పూర్తైన తర్వాత ప్రేక్షకులను రంజిపజేయడమే టార్గెట్ గా కన్పించారు..అందులో హిట్లు, ఫ్లాపులూ ఉన్నాయ్. ఐతే కలెక్షన్లొస్తే చాలు, రన్ అక్కర్లేదనే ఇప్పటి ట్రెండ్ ఎప్పుడో సెట్ చేశారాయన. అందుకే ఓ సినిమా రిలీజైన 34 వరోజునే అదే థియేటర్లో తన మరో సినిమా రిలీజ్ చేస్తూ, మరో 40 సినిమాలు చేశారు.

కెరీర్ పీక్ లో ఉండగా, ఎడాపెడా సినిమాలు చేసేయడం సూపర్ స్టార్ స్టైల్, కెరీర్ బిగినింగ్ లో రోజుకి మూడు షిఫ్టులు చేసిన కృష్ణ చివరిదశలో కూడా బిజీగానే గడిపారు. తన సక్సెస్ ను పదిమంది నిర్మాతలకు పంచితే ఇంకో వెయ్యిమంది సినిమా కుటుంబాలు బాగుంటాయనే ఫిలాసఫీతో ఇలా చేశానని చెప్తారు కృష్ణ. అందుకే కెరీర్ డౌన్ అయినా పట్టించుకోకుండా యాక్టింగ్ ని కంటిన్యూ చేశారాయన. పాలిటిక్స్ లోనూ ఓసారి ఎంపిగా గెలిచిన కృష్ణకు అవార్డుల పరంగా తెలుగు పరిశ్రమ. అప్పటి ప్రభుత్వాలు పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు. ఐతే ఫ్యాన్స్ ఇచ్చే రివార్డులనే పట్టించుకుంటాననే కృష్ణకు 2008లో ఆంధ్రాయూనివర్సిటీ డాక్టరేట్, 2009లో పద్మభూషణ్ దక్కడం విశేషం. తనయుడు మహేష్ బాబు మరో సూపర్ స్టార్ గా అవతరించడం తండ్రిగా కృష్ణకి గర్వకారణమని ఎన్నో సందర్భాల్లో ఆయనే చెప్తుంటారు..ఇప్పుడు మళ్లీ శ్రీశ్రీ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఈ పుట్టినరోజు కృష్ణ అభిమానులకు మరో పండగ తెస్తుందనే చెప్పాలి..

Today Super Star Krishna is celebrating 72 birthday. Krishna is care of address for experimental movies. He did Cow boy characters, Family Character, Detective characters. He almost completed more than 500 movies.