తెలు'గోడు' పట్టని మోడీ

26 May 2016


అచ్ఛేదిన్‌ ఆయేగా.. అంటూ సామాన్యునికి గంపెడాశలు చూపింది మోడీ సర్కారు. ప్రధానిగా మెడీ పాలనకు గురువారంతో రెండేళ్లు పూర్తవు తున్నా, ఆంధ్రప్రదేశ్‌ ఆశలేమాత్రమూ నెరవేరలేదు. ఎంతో చేస్తామని చెప్పిన మోడీ ఏపిని ఉద్ధరించింది లేదు సరికదా, అసలు విభజన చట్టంలోని అంశా లనే పట్టించుకున్న దాఖలాలు లేవు. విభజన సమ యంలో ఏపికి ప్రత్యేక హోదా ఐదేళ్ళు కాదు, పదేళ్లుఇవ్వాలని పట్టుబట్టిన బిజెపి, అధికారంలోకి వచ్చాక అసలు హోదా అక్కర్లేదని తేల్చేస్తోంది. ఆర్థిక లోటు లోటును భర్తీ చేయడం, పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజి చట్టంలో ఇచ్చిన హామీలే. ఈ సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రే గోడు వెళ్ళబోసుకున్నా, కేంద్రం నుంచి స్పందన కరు వైంది. రాష్ట్ర విభజనకూ రెండేళ్లలయినా తెలంగాణ, ఏపిల మధ్య సమస్యలూ కేంద్రం పరిష్కరించలేదు. విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9, 10 లోని సం స్థలు, ఆస్తుల పంపకాల విషయంలో ఇప్పటివరకు పురోగతి తగినంతగా లేదు. 

షెడ్యూల్‌ 9,10లోని సమస్యలు - ఏపి పునర్విభజన చట్టం, షెడ్యూల్‌ 9లోని మొత్తం 89 సంస్థలను, వాటి ఆస్తులను ఉభయ రాష్ట్రాలకు పంపకాలు చేయాల్సి ఉంది. వీటికోసం కేంద్రం అనుమతితోనే రిటైర్డ్‌ ఐఎఎస్‌ అధికారి షీలా బేడీతో నిపుణుల కమిటీని వేశారు. తొమ్మిదో షెడ్యూల్‌లో 61 సంస్థల పంపకాలకు సంబంధించి కమిటీ ఆయా శాఖలకు పలు సిఫారసులు చేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. కేంద్రం జోక్యం అవసరమని ఏపి ఢిల్లీలో విన్నవించుకున్నా ఫలితం లేదు. 

- ఉమ్మడి రాష్ట్రంలోని మినరల్‌ డెవలప ్‌మెంట్‌ కార్పొరేషన్‌ కింద ఉన్న దాదాపు రూ.950 కోట్లు ఇరు రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన కాకుండా వనరుల ఆధారంగా విభజించాలని ఏపి కేంద్రాన్ని కోరింది. 
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను జనాభా ప్రాతిపదికన ఇరు రాష్ట్రాలకు విభజించాలని ఏపి కోరగా, తెలంగాణ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా స్థానికత ఆధారంగా విభజించాలని పట్టుబట్టింది. ఈ సమస్య కూడా కేంద్రం పరిష్కరించాల్సి ఉంది. విద్యుత్‌ శాఖలో పని చేసే ఉద్యోగుల వివాదం కూడా ఇంకా ఓ కొలిక్కి రాలేదు.
- పదో షెడ్యూల్‌లో ఉన్న కొన్ని శిక్షణ సంస్థల విభజన శాస్త్రీయంగా జరగలేదనేది ఏపి భావిస్తోంది. పదో షెడ్యూల్‌లో మొత్తం 142 సంస్థలుంటే వాటిలో 123 సంస్థలు హైదరాబాద్‌లోను, ఆ చుట్టుపక్కల పరిధిలోనివే. ఆ సంస్థలను, వాటి ఆస్తులను విభజన చట్టంలోని ప్రొవిజన్‌-4 ప్రకారం ఇరు రాష్ట్రాలకు పంపకాలు చేయాల్సి ఉంది. 58:42 దామాషా ప్రకారం ఇరు రాష్ట్రాలకు పంపకాలు చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ సమస్య పరిష్కారం కాకుంటే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాల్సి ఉంది.
- తెలుగు విశ్వవిద్యాలయం, అంబేద్కర్‌ యూనివర్సిటీలపై హైకోర్టు ఇప్పటికే సూచనలిచ్చింది. ఇంటర్మీడియట్‌ బోర్డు, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌, తెలుగు విశ్వవిద్యాలయానికి చెందిన పురాతన రాతప్రతుల పంపిణీ వంటి పలు అంశాలు ఇంకా హైకోర్టులో పెండింగ్‌లోనే ఉన్నాయి. కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాలన్నిటినీ ఏపి ప్రభుత్వం కేంద్రానికి విన్నవించింది.
- విభజన చట్టంలోని సెక్షన్‌ 56 ప్రకారం బకాయి ఉన్న పన్నులను ఇరు రాష్ట్రాలకు జనాభా నిష్పత్తిలో విభజించాలి. ఈ పన్ను బకాయిలు, రుణాల వల్ల ఏపికి రూ.3,820 కోట్లు నష్టం వాటిల్లుతోంది. జనాభా ప్రాతిపదికన చెల్లించాలనే అంశాన్ని మార్పు చేస్తూ చట్టంలో సవరణ తీసుకురావాలని ఏపి కేంద్రాన్ని కోరింది. 
- విభజన చట్టంలోని సెక్షన్‌ 48 ప్రకారం ఏపిలో లేని ఆస్తులను ఇరు రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన పంపకాలు చేయాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడంతో ఢిల్లీలో ఉన్న ఉమ్మడి ఆస్తుల పంపకాలు సరిగా జరగలేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకపోవడంతో ఏపికి కొంత నష్టం వాటిల్లింది. 

At the time of telugu states division Narendra Modi is in opponent party. At time he gave promise, i will get special status to AP. But till now he not thinking about it.