మారని మహానా(యు)డు!

30 May 2016


నమ్మినవారికి న్యాయం చేయలేరన్న అపప్రధను బాబు ఇప్పటికీ తొలగించుకోలేకపోయారు. యువ నాయకత్వ ప్రమేయంతో పార్టీకి అద్దిన కార్పొరేట్ సంస్కృతి సంప్రదాయ కార్యకర్తను పార్టీకి మానసికంగా దూరం చేస్తోందన్న ఆవేదన లేకపోలేదు. తాను మారానని గతంలో ఒకటికి పదిసార్లు చెప్పినప్పటికీ, బాబు ధోరణిలో ఏ మాత్రం మార్పు రాలేదంటున్నారు. సొంత సామాజికవర్గాన్ని ప్రోత్సహించే విషయంలోనే బాబు గత ధోరణి మారింది తప్ప, మిగిలినదంతా పాతదేనని నేతలు విశే్లషిస్తున్నారు. గతంలో సొంత సామాజికవర్గాన్ని ప్రోత్సహించేందుకు భయపడిన బాబు, ఈసారి మాత్రం ఆ విషయంలో ఎవరికీ భయపడటం లేదని, ఈ విషయంలో పుత్రప్రోత్సాహమే ఎక్కువగా ఉందంటున్నారు. అయితే, అది మోతాదు మించుతున్న ప్రమాదం కనిపిస్తుంది. దానివల్ల మిగిలిన వర్గాలు దూరమవడంతోపాటు, ఏకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పదేళ్లు పార్టీ కోసం పనిచేసిన తనకు ఇప్పటివరకూ బాబు, లోకేష్ అపాయింట్‌మెంట్ దొరకడం లేదని సినీ నటి కవిత ఎన్నోసార్లు మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలకే సమయం ఇచ్చే పరిస్థితి లేదని, ఈ విషయంలో బాబు మళ్లీ పాత ధోరణిలోనే కనిపిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

సీఎంఓలో కూడా ప్రజాసంబంధాలున్న వారు ఒక్కరూ లేరంటున్నారు. కాంగ్రెస్ హయాంలో ఒక వెలుగు వెలిగిన వారికి మళ్లీ అందలం ఎక్కిస్తున్నారు. వారిని మార్చాలని ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నా అప్పుడు ఉండొచ్చు. ఇప్పుడు బాగానే పనిచేస్తున్నారు కదా అని స్వయంగా బాబు ప్రశ్నించడంతో నేతలు బిత్తరపోతున్నారు.

అటు చాలామంది అధికారులు కూడా బాబు పనితీరుతో విసుగెత్తిపోతున్నారు. సమీక్షలు, సమావేశాల విషయంలో బాబు వైఖరిలో మార్పు రాలేదు. గంటలపాటు తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని, సమావేశాల వల్ల పని జరగడం లేదని, అందుకే తాము కూడా అంకెలగారడీ చేయాల్సి వస్తోందంటున్నారు. ఈసారి ఉద్యోగులను ఎక్కువ కష్టపెట్టనని చెప్పినప్పటికీ, అది ఆచరణలో కనిపించడం లేదంటున్నారు.

నిజానికి, తెలంగాణతో పోలిస్తే ఏపిలో అవినీతి ఎక్కువగా ఉందన్న నిజం సర్వేలు కూడా తేల్చాయి. తెలంగాణలో అది కొంతమందికే పరిమితమైతే, ఏపిలో విస్తృతమయింది. ఎమ్మెల్యేల విచ్చలవిడితనంతో పార్టీ పరువు రోడ్డెక్కింది. బాబు తొమ్మిదేళ్లు సీఎంగా చేసినప్పుడు కూడా ఇంత బరితెగింపు ధోరణి లేదని, చివరకు సొంత పార్టీ నేతల ఆస్తులే కొల్లగొడుతున్న దారుణం నెలకొందని సీనియర్లు వాపోతున్నారు. అగ్రనేతల సంతానాలు జనాలను దోచుకుంటున్నారన్న భావన సొంత పార్టీ శ్రేణుల్లోనే నెలకొంది. వాటిని అనుభవిస్తోన్న జనాలకు ‘కాంగ్రెస్ వాళ్లే నయమన్న’ భావన మొదలయింది. ఇది పార్టీ భవిష్యత్తుకే ప్రమాదకరం, దీనిని గాడిలో పెడితేనే పార్టీకి ఆరోగ్యం.

పార్టీ జెండా మోయని వారిని, ప్రతిపక్షంలో ఉండగా తమపై కేసులు పెట్టిన వారిని అందలమెక్కిస్తే, ఇక పార్టీలో మనస్ఫూర్తిగా పనిచేసే వాతావరణం ఎందుకుంటుందని శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. మరి అధికారం వచ్చి ఎవరికి లాభమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికారం వచ్చింది తమకు కాదని, దళారులు, ఫిరాయింపుదారులు, వ్యాపారస్తులకేనన్న భావన బలంగా నాటుకుపోయింది.

వైసీపీ నుంచి చేరిన ఎమ్మెల్యేలతో పార్టీ బలపడిందని భావిస్తున్నప్పటికీ, అది వాపేనని నేతలు స్పష్టం చేస్తున్నారు. పోలీసుల సమక్షంలో మినీ మహానాడు నిర్వహించుకున్నారంటే పార్టీలో క్రమశిక్షణ ఏస్థాయిలో దిగజారిందో, బాబంటే ఏ స్థాయిలో భయం పోయిందో చెప్పకనే చెబుతుందని విశే్లషిస్తున్నారు. అధినేత అంటే గతంలో అంతో ఇంతో నేతలకు భయం ఉండేది. వైసీపీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పిన తర్వాత ఆ భయం కూడా పోయింది.

ఈ రెండేళ్లలో అమరావతిలో మోదీ ఇచ్చిన నీళ్లు, మట్టి తప్ప ఒక్క ఇటుక కూడా రాలేదు. ఇంకా పిల్లిమొగ్గలు వేస్తూనే ఉంది. ఇది బాబు ప్రతిష్ఠకు సవాలుగా మారింది. ఐటి ప్రమోషన్‌కు మారుపేరయిన బాబు, ఇప్పటివరకూ ఏపికి ఒక్క ఐటి కూడా తీసుకురాలేకపోయారన్న భావన యువకుల్లో ఉంది. కొత్త రాజధానిని వృద్ధి చేస్తారన్న నమ్మకంతోనే బాబును గెలిపించారు. ఆ నమ్మకంలో సగం శాతం కూడా ఈ రెండేళ్లలో సాధించలేకపోయారు.

In Mahanadu also Chandrababu Naidu behavior is not changed. In this Mahanadu Chandrababu Naidu also talking too much. He encouraging his community.