చంద్రబాబు ప్రతిష్టకు డామేజీ

19 May 2016


ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో అత్యంత క్లిష్టమైన దశను ఎదుర్కుంటున్నట్లుగా కనిపిస్తుంది. ఆయన పదవిని కోల్పోతారా?లేదా అన్నది ఇక్కడ సమస్య కాదు.దేశవ్యాప్తంగా ఆయన ఒక ఇమేజీ సంపాదించుకున్నారు.సంస్కరణల వాదిగా,ప్రగతిశీలవాదిగా ఆయన పేరొందారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని దేశంలోని వివిధ ప్రాంతాలలో ఆయన ఉపన్యాసాలు ఇచ్చి వచ్చారు.స్వచ్చంద సేవకుడు అన్నా హజారే అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించినప్పుడు జాతీయ జెండాను భుజాన వేసుకుని పాదయాత్రగా ర్యాలీ తీసిన చరిత్ర చంద్రబాబుకు ఉంది.అంతర్గతంగా ఆయన ఎన్నికల రాజకీయాలను ఎలా డీల్ చేస్తారు?రాజకీయాలలో డబ్బు పాత్రను ఆయన చూస్తారు?అన్న అంశాలతో నిమిత్తం లేకుండా బాహ్య ప్రపంచానికి మాత్రం ఆయన ఎప్పుడూ నైతిక విలువల గురించి చెప్పే నేతగానే గుర్తింపు పొందడానికి యత్నించారు. అందులో చాలా వరకు సఫలం అయ్యారు.అందువల్లనే తాను ముప్పై ఏళ్లు నిప్పులా బతికానని చెప్పుకుంటారు. స్వయాన మామ, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ఆయనపై విమర్శలు చేసినా జనం సీరియస్ గా తీసుకోలేదు.కాంగ్రెస్ లో బలమైన నేతగా ఉన్న రాజశేఖరరెడ్డి ఆరోపణలు చేసినా ప్రజలు దానికి విలువ ఇవ్వలేదు.అలా అని డబ్బు రాజకీయాలు చంద్రబాబు చేయలేదని ఎవరూ అనుకోలేదు.అనుకోరు.

ఎందుకంటే ఎపి రాజకీయాలలో దనం పాత్ర ఎంతగా ఉందో అందరికి తెలుసు. అయినా చంద్రబాబు పట్ల ఒక అబిప్రాయం ఏమిటంటే మిగిలినవారికంటే బెటర్ అని.అయితే మొదటిసారిగా చంద్రబాబు ధన రాజకీయాలకు సంబందించి అందరికి తెలిసిపోయేలా కనిపించారు. ఇది ఆయన ను అత్యంత డామేజీ చేసింది. ఆయన ఎన్ని బుకాయించినా, టిడిపి నేతలు ఎన్ని రంకెలు వేసినా అవినీతి విషయంలో వారేమీ అతీతులు కారని ,పైకి ఎన్ని నీతులు చెప్పినా, వారు చేస్తున్నది కూడా అదేనని బట్టబయలు అయింది. తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మహా చురుకు అయిన వ్యక్తి . రాజకీయాలపై చాలా ఆశలు పెట్టుకున్న నేత.అదికారంపై పోరాడడం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నేత.చాలామంది సీనియర్ లను అధిగమించి ఆయన అభిమానులను సంపాదించుకున్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఈయనపై కక్ష పూనారని అంతా నమ్ముతున్నారు. చివరికి శాసనసభలో ఆయనను మాట్లాడనివ్వకపోవడం కూడా రేవంత్ కు ప్లస్ పాయింట్ అయింది.అంత సాహస వీరుడుగా పేరు తెచ్చుకుంటున్న తరుణంలో రేవంత్ ఈ విధంగా దొరికిపోవడం ఆయన రాజకీయానికి మచ్చ మాత్రమే కాదు. ఆయన లాంటి పోరాటకర్తలు గట్టిగా ఉండాలని కోరుకునే వారందరికి తీవ్రమైన నిరాశ కలిగించారు. నిత్యం కెసిఆర్ పైన,ఆయన కుటుంబంపై అవినీతి తదితర ఆరోపణలు చేస్తూ చెలరేగే రేవంత్ రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీవెన్సన్ కు ఏభై లక్షల సొమ్ము ఇస్తూ పట్టుబడడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఆయన సంభాషణలు అందరిని విస్తుపరచాయి. ఇదంతా కుట్ర అని, మరొకటని ఆయన చెప్పవచ్చు. టిడిపి వాదించవచ్చు.కాని అంత పక్కాగా దొరికిపోయాక దాని గురించి ఎంత వాదించినా ప్రజల దృష్టిలో పలచన అయినట్లే. ఈ కేసు కోర్టులో నిలబడుతుందా?లేదా అన్నది వేరే విషయం. కోర్టులు రకరకాల కారణాలతో నిర్ణయాలు ప్రకటించవచ్చు.

కాని రాజకీయంగా మాత్రం రేవంత్ తీవ్రమైన తప్పిదం చేశారు. నైతికంగా కూడా ఎదురుదెబ్బతిన్నారు.ఆయనపై ఉన్న సానుభూతిని కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నారు.రేవంత్ తో సహా పలువురు గతంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత జగన్ జైలులో ఉన్నప్పుడు అనేక విమర్శలు చేసేవారు.సరిగ్గా అదే సమస్యను ఇప్పుడు ఎదుర్కుంటున్నారు.నైతిక విలువలకు పట్టం కడతామని చెప్పుకునే టిడిపి ఎందుకు రేవంత్ పై చర్య తీసుకోలేకపోయింది?అదే సమయంలో రేవంత్ డబ్బు ఇవ్వడానికి వెళ్లలేదని పార్టీ అదినేత చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోయారు?గతంలో కొందరు ఎమ్మెల్యేలు లేదా ఇతర నాయకులు ఏవైనా ఇలాంటి ఘటనలలో చిక్కుకుంటే ఉంటే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామనేవారు.ఉదాహరణకు కృష్ణ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు స్టాంపుల కుంభకోణంలో ఇరుక్కుని అరెస్టు అయ్యారు.దాంతో ఆయనను పార్టీ నుంచి తొలగించినట్లు ప్రకటించారు.కాని ఇక్కడ ఎందుకు జరగలేదు. ఎందుకంటే రేవంత్ తన సంభాషణలలో బాస్ ,అని బాబుగారు అంటూ సంబోధించారు.అది పార్టీ అదినేత చంద్రబాబుకు సంబంధంచిందే అన్న విషయం అందరికి బహిరంగ రహస్యమే.ఇప్పుడు పొరపాటున రేవంత్ ను సస్పెండ్ చేస్తే,ఆయన బాబు, బాస్ అంటే ఎవరో నేరుగా చెప్పేస్తే అది పెద్ద ప్రమాదం అవుతుంది. తెలుగుదేశం పునాదులకే దెబ్బ తగులుతుంది.దాంతో రేవంత్ ను పార్టీ సొంతం చేసుకుంటుందని ప్రకటించారు.ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెబుతున్నారు.ఆ తర్వాత చంద్రబాబు ఆడియో టేపులు బహిర్గతం అవడం మరో సంచలనం,రేవంత్ మాట్లాడినదే డామేజ్ అనుకుంటే చంద్రబాబు స్వయంగా తెలంగాణ ఎమ్మెల్యేతో మాట్లాడి మావాళ్లు ఇచ్చిన కమిట్ మెంట్ నెరవేర్చుతానని చెప్పిన ఆడియో మరింత సమస్య తెచ్చిపెట్టింది.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక చాలా జాగ్రత్తగా తెలంగాణ ఎసిబి అదికారులు డీల్ చేస్తున్నారు.మరొకరు ఎవరైనా ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదన్నది తెలియని విషయం కాదు.ఈ కేసు తన మీదకు వస్తోందని గమనించిన చంద్రబాబు దీనిపై రకరకాలుగా స్పందించారు.ఆయన సలహాదారు అదసలు చంద్రబాబు గొంతు కాదన్నారు.చంద్రబాబు అక్కడక్కడ మాట్లాడినవి తెచ్చి పోగుచేశారని,తప్పుడు డాక్యుమెంటేషన్ చేశారని వాదించారు.అసలు తన ఫోన్ టాపింగ్ ఎలా చేస్తారని ప్రశ్నించారు.ఇక్కడ చిక్కు ఏమిటంటే ఫోన్ టాపింగ్ జరిగిందటే చంద్రబాబు అది తన సంభాషణే అని అంగీకరించినట్లు అవుతుంది.స్వరం తనది కాదంటే ఫోరెన్సిక్ లాబ్ లో ఆయనదేనని వస్తే ఇబ్బంది అవుతుంది.దీనితో ఇది రెండు రాష్ట్రాల సమస్యగా మార్చడానికి ఆయన యత్నిస్తున్నారు.తనను అవమానిస్తే ఐదుకోట్ల మంది ఆంద్రప్రదేశ్ ప్రజలను అవమానించినట్లేనని సూత్రీకరించారు.

నిజమే ఒక్కో సందర్భంలో ఎక్కడైనా ఒక సి.ఎమ్.కు అవమానం జరిగితే ప్రజలంతా స్పందిస్తారు.బాధపడతారు.ఉదాహరణకు గతంలో ముఖ్యమంత్రి అంజయ్యకు రాజీవ్ చేతిలో పరాభవం జరిగిందన్న భావన ఎపి ప్రజలందరిలోను కోపం తెప్పించింది.కాని అది వేరు. ఇది వేరు. ఇది అవినీతి కేసు.దీనిలో చంద్రబాబు పాత్ర లేదా ప్రమేయం ఏమీ లేదని ఆయన నిరూపించుకోవాలి తప్ప,రెండు రాష్ట్రాల సమస్యగా చిత్రించడం పద్దతి కాదు.శేషాచలం అడవిలో ఇరవై మంది ఎర్రచందనం కూలీలను దారుణంగా పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తే తమిళనాడు లో తీవ్ర నిరసన వ్యక్తం అయింది. అయితే ఇది రెండు రాస్ట్రాల సమస్య కాదని, ఎర్రచందనం అక్రమ రవాణా సమస్య అని టిడిపి నేతలు వాదించారు.కాని ఇక్కడ అవినీతి కేసు మాత్రం రెండు రాష్ట్రాల సమస్యగా టిడిపి నేతలు ధీమాగా చెప్పేస్తున్నారు.ద్వంద్వ ప్రమాణాలతో రాజకీయనేతలు లాభం పొందుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.అలాగే ఇప్పుడు కూడా టిడిపి దీనిని తెలివిగా ఫోన్ టాపింగ్ కేసు అనో,మరొకటి అనో బయటపడుతుందా అన్నది కాలమే నిర్ణయించాలి. మహా సంకల్ప సభలో చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఈ విషయంలో భయపెట్టడానికి తీవ్రంగానే యత్నించారు.కాని కెసిఆర్ భయపడినట్లు కనిపించలేదు.బ్రహ్మదేవుడు కూడా బాబును రక్షించలేడని ప్రకటించారు.ఇక్కడ ఒక విషయం గమనించాలి.తెలుగుదేశం చేస్తున్న వాదనలో కూడా కొంత హేతుబద్దత ఉంది.తాము ఒక్క ఎమ్ఎల్యేని కొంటేనే ఇంత పెద్ద రాద్దాంతం చేస్తున్నారు.(ఈ మాట వారు పైకి అనడంలేదు.కాని వారి మనసులో మాట ఇది) మరి కెసిఆర్ తమ పార్టీకి చెందిన ఐదుగురిని,కాంగ్రెస్ కు చెందిన నలుగురిని, వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు చెందిన ఇద్దరిని కొన్నారు కదా అని వారు ప్రశ్నిస్తున్నారు. తలసాని శ్రీనివాస యాదవ్ కు మంత్రి పదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.ఇది వాస్తవమే. కెసిఆర్ ఈ ఫిరాయింపుల విషయంలో నైతికంగా దెబ్బతిన్నట్లే లెక్క. ప్రభుత్వపరంగా ఆఫర్లు ఇచ్చినా అది అవినీతి కిందకు రాదా అన్న ప్రశ్న వస్తుంది. దానిని కాదనలేము. కాని దానిని అడ్డుపెట్టుకుని నేరుగా ఎసిబికి పట్టుబడిన కేసులో టిడిపి ఎలా తప్పించుకుంటుందన్నది చర్చ.ఆ మాటకు వస్తే టిడిపి కూడా ఫిరాయింపులను ప్రోత్సహించకుండా లేదు.ఎపి శాసనమండలిలో పదిమందికిపైగానే ఇతర పార్టీల ఎమ్మెల్సీలను తనవైపు ఆకర్షించుకుంది.అలాగే ఇద్దరు వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పిలకు టిడిపి కండువాలు కప్పింది.అంతేకాదు.కర్నూలు జడ్పిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు మెజార్టీ జడ్పిటీసీలు ఉంటే ఇప్పుడు టిడిపి ఎలా ఆధిపత్యం సంపాదించింది?ప్రకాశం జిల్లా ఇన్చార్జీ చైర్మన్ ను టిడిపిలో ఎలా చేర్చుకుంటుంది?నెల్లూరు మేయర్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ వాడైతే టిడిపిలో ఎలా చేర్చుకుంది?కడప డిసిసిబిలో మెజర్టీ లేకపోయినా ఎలా ఆదిపత్యం సాధించింది?అదికార రాజకీయాలలో టిడిపి,టిఆర్ఎస్ లు పోటాపోటీగా ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలకు పాల్పడుతున్న మాట నిజం.గతంలో కాంగ్రెస్ హయాంలో జరిగాయి. అప్పుడు వీటిపై గొంతెత్తి అరిచిన ఈ పార్టీల పెద్దలు తాము అదికారంలోకి రాగానే అదే బాట పట్టారు.పోని పార్టీలో చేరినవారితో రాజీనామా చేయిస్తే అదో పద్దతి .అది చేయకుండా అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్న వారు ఎదుటివారికి మాత్రం నీతుల చెబుతున్నారు.

ఫిరాయింపుల చరిత్రలోకి వెళితే కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందని అంటారు.అదే చందం ఇది కూడా.ఇంతకీ అంతిమంగా ఏమి అనుకోవాలి?ఎన్నికల సమయంలో వందల కోట్లను గుట్టు చప్పుడు కాకుండా పంచే రాజకీయపార్టీలు ఏభై లక్షల రూపాయల విషయంలో దొరికిపోవడమే పెద్ద వార్త.దానికి కారణం అదికారంలో ఉన్న పార్టీ పధకం ప్రకారం పట్టుకోగలగడమే. ఇలాంటి అవినీతి కేసులు ఎక్కడ బయటపడినా సమాజం ఒకే విధంగా స్పందించాలి. కాని దురదృష్టం ఎదుటివారు ఇలాంటి కేసులలో పట్టుబడితే అమ్మో ఇంత అవినీతా అని గొంతు చించుకోవడం, మనవాళ్లు పట్టుబడితే,ఇంత అన్యాయమా?అని ఇల్లెక్కి కూయడం జరుగుతోంది.ఇది సమజానికి మంచిది కాదు.అవినీతి కేసు ఎవరిదైనా ఒకే విధంగా చూడాలి.అదే సమయంలో అక్రమంగా కేసు పెడితే ఎవరినైనా తప్పు పట్టాలి.మొత్తం మీద ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు, కెసిఆర్ లకు ఇది ప్రతిష్టాత్మకంగా తయారైంది.చంద్రబాబును దోషిగా కెసిఆర్ నిలబెడతారా?లేక కెసిఆర్ నే దోషిగా చంద్రబాబు నిలబెడతారా?అన్నది తేలడానికి మరికొంత సమయం పడుతుంది.

Once upon a time AP CM Chandrababu got good compliments form politics experts. Now he is facing problems. Chandrababu Naidu government is in problems.