బాబుకు మతి పోయింది..

26 May 2016


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాస్తవ పరిస్థితిని ఉద్దేశించి సరదాకు అన్నమాట ఇపుడు వివాదంగా మారింది. విజయవాడలో కలెక్టర్ల సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేస్తూ ఆదాయ వ్యయాల గురించి మాట్లాడారు.  ఆంధ్రప్రదేశ్ లో ఆలయాల ఆదాయం 27 శాతం పెరిగిందని ఇందుకు పెరుగుతున్న పాపాలు - అధికమవుతున్న సమస్యలే కారణమని బాబు పేర్కొన్నారు. "ప్రజలు పాపాలు చేస్తున్నారు. కొంతమంది సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటి నుంచి విముక్తి పొందేందుకు ఆలయాలకు వచ్చి ప్రార్థనలు చేస్తున్నారు.. డబ్బు సమర్పించుకొంటున్నారు. ఇది వాస్తవం" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ప్రజలు ఆలయాలను మాత్రమే కాకుండా చర్చిలను మసీదులను కూడా దర్శిస్తున్నారని చంద్రబాబు ఈ సందర్భంగా  చెప్పారు. ఆలయాలు - మసీదులు - చర్చిలు లేకుంటే ప్రజలు పిచ్చి పట్టేదని అన్నారు. రాష్ట్రంలో మరోవైపు మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయని దీంతో రాష్ట్ర ఆదాయం తగ్గుముఖం పట్టిందని చెప్పారు. చాలామంది అయ్యప్ప దీక్షలు తీసుకుంటూ 40 రోజుల పాటు మద్యానికి దూరంగా ఉంటున్నారు. దీంతో మద్యం అమ్మకాలు తగ్గిపోతున్నాయి అంటూ సరదాగా మాట్లాడారు. పొరుగు రాష్ట్రాల అభివృద్ధి చూసి అసూయ కలుగుతున్నదని వారికంటే బాగా పనిచేయడం కోసం ఆలోచిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర రెవెన్యూ 3.1 శాతం పెరిగిందని ఇకనుంచి ప్రతి మూడు నెలలకొకసారి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని చెప్పారు. అధికారులు రాజకీయనేతలంటే ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని అధికారులు పనిచేయరనే అభిప్రాయం వారిలో నాటుకుపోయిందని ఆ అభిప్రాయాన్ని సమూలంగా మార్చాలన్నారు. 2029 నాటికి దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో నిలవాలన్నారు. తలసరి ఆదాయంలో ఉత్తరాంధ్ర జిల్లాలే తొలి చివరి స్థానాల్లో ఉన్నాయన్నారు. రాష్ట్రాన్ని  కరువు రహితంగా తీర్చిదిద్దాలని ప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేస్తామని బాబు ధీమా వ్యక్తం చేశారు.

పరిస్థితులను ప్రస్తావిస్తూ చంద్రబాబు ఆదాయం లెక్కలేసినప్పటికీ కోట్లాది మంది దైవదర్శనాన్ని పాపంతో ముడిపెట్టడం ఏంటని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్వతహాగా భక్తుడు అయిన చంద్రబాబు నుంచి ఈ మాటలు ఊహించలేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

Chandrababu Naidu comments are like mad person. In a press meet his comment about temples income very comedy.