మోడీకి మాడు పగిలింది

13 May 2016


ఉత్తరాఖండ్ రాజకీయం ఇక కీలక మలుపు దిశలో ఉంది. విశ్వాసపరీక్షలో తానే నెగ్గినట్లు మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ చెప్పారు. దీన్ని సుప్రీంకోర్టు అధికారికంగా వెలువరించడమే మిగిలి ఉంది. అసెంబ్లీలో బలనిరూపణతో మళ్లీ ముఖ్యమంత్రిగా హరీష్ బాధ్యతలు స్వీకరిస్తారా, లేక ఇంకేదైనా మలుపు ఈ వ్యవహారంలో చోటు చేసుకుంటుందా అనేదే ఇక తేలాల్సి ఉంది. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్పీకర్ గోవింద్ సింగ్ కుంజ్ వాల్, హరీష్ రావత్ విశ్వాసపరీక్షను నిర్వహించారు. తర్వాత బలపరీక్ష వివరాలను సీల్డు కవర్ లో సుప్రీం కోర్టుకు సమర్పించారు. ఈ ఫలితాన్ని సుప్రీం కోర్టు అధికారికంగా ప్రకటించనుంది. ఐతే ఓటింగ్ లో తామే గెలిచినట్టు హరీశ్ రావత్ ప్రకటించుకున్నారు. ఉత్కంఠ పరిణామాల మధ్య ఉత్తరాఖండ్ అసెంబ్లీలో పదవీచ్యుత ముఖ్యమంత్రి హరీశ్ రావత్ బలపరీక్ష ఎదుర్కొన్నారు. 

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతుగా 33 మంది ఎమ్మల్యేలు ఓటు వేసినట్టు ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పారు. మరోవైపు బీజేపీ ఓటమిని అంగీకరించినట్టు తెలుస్తోంది. బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో మొత్తం 70 మంది ఎమ్మెల్యేలు ఉండగా తొమ్మిదిమంది కాంగ్రెస్ రెబెల్స్ పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీంతో మిగిలిన 61 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొన్నారు. వీరిలో బీజేపీకి 28, కాంగ్రెస్ కు 27, బీఎస్పీకి ఇద్దరు, ఉత్తరాఖండ్ క్రాంతి దళ్ కు ఓ ఎమ్మెల్యే, మరో ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఉన్నారు. బలపరీక్షకు ముందు హైడ్రామా చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రేఖ ఆర్య బీజేపీ గూటికి చేరగా, బీజేపీ ఎమ్మెల్యే భీమ్ లాల్ ఆర్య ఆ పార్టీకి హ్యాండిచ్చి కాంగ్రెస్ శిబిరంలో చేరారు. కాంగ్రెస్ కు బీఎస్పీ అధినేత్రి మాయావతి మద్దతు ప్రకటించారు. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ మద్దతు తెలిపారు. 

మార్చి 27న ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతిపాలన విధించారు. అప్పట్నుంచీ అక్కడి రాజకీయం అనేక మలుపులు తిరుగుతూ వస్తుంది. ఆ రాష్ట్రపతి పాలనను ఉత్తరాఖండ్ హైకోర్టు సస్పెండ్ చేయడం ఓ సంచలనం. ఐతే దాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడం ఆ తర్వాతి పరిణామాల్లో గోడ దూకిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించడంతో ఇక్కడి పాలిటిక్స్ పై దేశమంతా ఆసక్తి వ్యక్తం చేసింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై ఓ పద్దతి ఫ్రకారం కోర్టులను ఆశ్రయిస్తే వేటు తప్పదని ఈ పరిణామాలు రుజువు చేశాయ్. అభివృధ్ది కోసమే పార్టీ మారుతున్నామని చెప్పడం, కండువాలు మార్చడం సాధారణమైపోయిన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికిప్పుడు ఈ తరహా తీర్పులు రాకపోయినా, భవిష్యత్తులో మాత్రం  ఉత్తరాఖండ్ పరిణామాలు ఓ పాఠంలా ఉపయోగపడతాయంటున్నారు.

Its a big shock to Narendra Modi. Narendra Modi faces force vote in Utharakand. Supreme court ordered to conduct trust motion on congress party.