అమ్మపై అభిమానమే

20 May 2016


తమిళ తంబీలు కొత్త చరిత్రను లిఖించారు. రెండున్నర దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాన్ని తిరగరాశారు. 1989 తర్వాత మరోసారి అధికారంలో ఉన్న పార్టీకే జై కొట్టారు. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న అమ్మనే.. మరోసారి అందలం ఎక్కించారు. ఇక మరోసారి సీఎం పీఠంపై ఆశలు పెట్టుకున్న కురవృద్దుడి ఆశలు.. అడియాశలు కాగా.. పొత్తులతో సంచలనం సృష్టించిన కేప్టెన్‌  విజయ్‌ కాంత్‌.. తనతో పాటూ తనతో వచ్చినవారందరినీ ముంచేశాడు. చరిత్ర ఎందుకుంది..? అది తుడిచి పెట్టుకుపోయేందుకే. అందుకే ఇన్నాళ్లుగా వస్తున్న చరిత్రను తిరగరాస్తూ.. తమిళ ఓటరు కొత్త సంప్రదాయానికి తెరలేపాడు. సుమారు రెండున్నర దశాబ్దాలుగా.. ప్రతీసారీ ప్రతిపక్షానికే అధికారమిచ్చే తమిళ తంబీ నాడి.. ఈ సారి పాతదారి పట్టింది. ఎగ్జిట్‌  పోల్స్‌  అంచనాలను తలకిందులు చేస్తూ.. మరోసారి అమ్మకే పట్టం కట్టాడు. ప్రతిపక్ష పార్టీపై కరుణ చూపిస్తారనుకున్న ఓటర్లు.. పురుశ్చితలైవిపైనే నమ్మకాన్ని ఉంచాడు.

ఎన్నికల తర్వాత పోయెస్‌  గార్డెన్‌  నిశ్శబ్దంగా మారిందని.. ఆ పార్టీ నేతలు అంతా గప్‌చుప్‌గా ఉన్నారనే వార్తలన్నీ రెండు రోజులకే పరిమితమయ్యాయి. ఫలితాల తీరు అనుకూలంగా వస్తుండటంతో.. అమ్మ అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. రెండు రోజుల నిశ్శబ్దాన్ని బ్రేక్‌  చేస్తూ.. పోయెస్‌  గార్డెన్‌లో సంబరాలు మిన్నంటాయి. ముఖ్యంగా జయలలిత గత ఐదేళ్ల పాలనను ఓ సారి గమనిస్తే.. 2011 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుకు తోడుగా.. అధనంగా మరికొన్ని పథకాలను ప్రజలకు చేరువ చేసింది. అంతేకాకుండా.. ఆ మధ్య ఆమెపై వచ్చిన కేసులతో ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకోవడం కూడా.. జయలలితపై ప్రజల్లో సానుభూతి పెరిగిందని చెప్పొచ్చు. ఆ తర్వాత కర్ణాటక హైకోర్టులో కేసు కొట్టేయడంతో ఆమె మళ్లీ ఆర్‌ కే నగర్‌  ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో గెలిచి.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.

ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో.. ప్రజలకు ఉచిత హామీల వర్షం కురపించారు. అన్ని పార్టీలు ఉచిత హామీలను కుమ్మరించినా.. అమ్మపై ఉన్న అభిమానమే ఈ ఫలితాలకు సాక్ష్యమని చెబుతున్నారు. అంతేకాకుండా.. ఎన్నికల ముంగిట్లో అమ్మ ఇచ్చిన హామీలు.. ప్రజల మైండ్‌ సెట్‌ను మార్చేసిందని.. చెబుతున్నారు. ఇక ప్రతిపక్ష డీఎంకే.. మరో ఐదేళ్ల పాటూ.. అదే స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. 90 యేళ్ల కురవృద్దుడైన కరుణానిధి.. ఈ సారి కూడా సీఎం పీఠానికి దూరం కావాల్సి వస్తోంది. ఎన్నిరకాలుగా ఉచిత హామీలిచ్చినా.. కాంగ్రెస్‌తో అలయెన్స్‌ పెట్టుకున్నా.. డీఎంకే ప్రజల నమ్మకాన్ని చూరగొనలేకపోయింది. ముఖ్యంగా గత కొన్నాళ్లుగా.. కుటుంబ కలహాలతోనే కాలం గడిపిన డీఎంకేను.. ప్రజలు ఆదరించలేదు. గతంలో డీఎంకే హయాంలో వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రజలు అంతత్వరంగా మర్చిపోలేదని చెప్పొచ్చు.

పీపుల్స్‌  ఫ్రంట్‌  పేరుతో.. ప్రజల్లో వచ్చిన కేప్టెన్‌  విజయకాంత్‌ .. దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. ఏకంగా సీఎం పీఠంపై కూర్చుంటానని ప్రచారం చేసుకున్న కేప్టెన్‌.. తనతో పాటూ.. కలిసివచ్చిన పార్టీల పడవలన్నీ ముంచేశాడు. కనీస పోటీ ఇవ్వడం కాదు కదా.. పీపుల్స్‌  ఫ్రంట్‌ను సింగిల్‌  డిజిట్‌కే పరిమితం చేశాడు. అంతేకాకుండా.. తాను పోటీ చేసిన ఊళుందర్‌ , ముఖ్యంగా తన వ్యాఖ్యలే కేప్టెన్‌  కొంపముంచాయని చెప్పొచ్చు. మీడియాపైనే దురుసుగా ప్రవర్తించిన విజయ్‌ కాంత్‌.. ఏకంగా సౌత్‌  సూపర్‌ స్టార్‌  రజినీకాంత్‌తో పెట్టుకున్నాడు. రజినీకి ధైర్యం లేదని.. అందుకే రాజకీయాల్లోకి రావడం లేదన్నాడు. ఇటు కరుణానిధి విలన్‌ అని.. జయలలిత లేడీ విలన్‌  అని.. తానే అసలైన హీరో అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ఇలా తమిళ రాజకీయాల్లో విజయ్‌ కాంత్‌  ఘోర పరాభవాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. 

In Tamilnadu Jaya Lalitha break record. In Yesterday election results he formed government. She got magic figure.