శృంగార దానిమ్మ..

25 Apr 2016


దానిమ్మ గింజలు పోషకాల గనులే కాదు. యాంటీ ఆక్సిడెంట్ల నిధులు కూడా. గ్లాసు దానిమ్మ రసంలో గ్రీన్‌టీ, బ్లూబెర్రీ, రెడ్‌వైన్‌ల కన్నా ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండెజబ్బు, క్యాన్సర్ల బారిన పడకుండా మనల్ని కాపాడుతాయి. అంతేనా..? దానిమ్మ గింజలు శృంగారంపైనా ఆసక్తిని ప్రేరేపించటానికీ దోహదం చేస్తున్నట్టు తాజాగా బయటపడింది. 

రోజుకి ఒకగ్లాసు చొప్పున పదిహేను రోజుల పాటు దానిమ్మరసం తాగినవారిలో సెక్స్ హార్మోనైన టెస్టోస్టీరాన్ మోతాదులు 16-30% పెరుగుతున్నట్టు తేలింది. ఎడిన్‌బరోలోని క్వీన్ మార్గరెట్ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఇటీవల 21-64 ఏళ్ల వారిని ఎంచుకొని అధ్యయనం చేశారు.

దానిమ్మ రసం తాగిన స్త్రీ, పురుషులిద్దరిలోనూ టెస్టోస్టీరాన్ స్థాయిలు పుంజుకోవటమే కాదు.. రక్తపోటు తగ్గుతుండటమూ విశేషం. భయం, విచారం, అపరాధభావం, సిగ్గుపడటం వంటివి తగ్గుతూ.. ధైర్యం, ఆత్మవిశ్వాసం వంటి సానుకూల అంశాలు అధికమవుతున్నట్టూ పరిశోధకులు గుర్తించారు. టెస్టోస్టీరాన్ మూలంగా పురుషుల్లో గడ్డం, మీసాలు రావటం.. గొంతు మారటంతో పాటు శృంగార ఆసక్తి కూడా పెరుగుతుంది.

ఈ హార్మోన్ మగవారిలో ఎక్కువ మోతాదులో ఉన్నప్పటికీ.. స్త్రీలల్లోనూ అడ్రినల్ గ్రంథులు, అండాశయాల నుంచి విడుదలవుతుంది. ఇది స్త్రీలల్లో శృంగార వాంఛను పెంచటంతో పాటు ఎముకలు, కండరాల బలోపేతానికి తోడ్పడుతుంది. టెస్టోస్టీరాన్ మోతాదు పెరగటమనేది మూడ్, జ్ఞాపకశక్తి మెరుగుపడటానికీ, ఒత్తిడి దూరం కావటానికీ దోహదం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. 

దానిమ్మగింజల్లో ఎ, ఈ, సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇక వీటిల్లోని ఇనుము శరీరానికి ఆక్సిజన్ సరఫరా బాగా జరిగేలా చేస్తే.. ఫాలీఫెనాల్స్ క్యాన్సర్ కారకాల పని పడతాయి. టానిన్లు రక్తపోటు తగ్గటానికి, రోగనిరోధక శక్తి పుంజుకోవటానికి తోడ్పడతాయి. యాంతోసైయానిన్లు రక్తనాళాలను కాపాడతాయి. వాపునూ తగ్గిస్తాయి. అందువల్ల దానిమ్మను ఆహారంలో భాగంగా చేసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Pomogranate good for health. In this there are so many vitamins are present. In recent research it declared that it is very good for $ex.