తమ్ముళ్ల రచ్చ

20 Apr 2016


నామినేటెట్ పదవుల బేరం గుంటూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్ల మద్య చీలిక తీసుకొచ్చేలా ఉందంటున్నారు. మా వాళ్లకే పదవులు కావాలంటూ ఎవరికి వారే పట్టుబడుతున్నారు. గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి విషయంలో ఈ పోటీ తారా స్థాయికి చేరింది. కమ్మ కులస్థుడనే లెక్కతో ఒకళ్లు, హైకమాండ్ కి దగ్గరనే పేరుతో మరొకరు ఢీ అంటే ఢీ అంటున్నారు. నిజానికి గుంటూరు జిల్లాలో  చాలా రోజులుగా నానుతూ వస్తున్న నామినేటెడ్ పదవుల భర్తీ వ్యవహారం ముదిరి పాకాన పడింది. ఇన్నాళ్లూ అధినేత వద్ద సీక్రెట్ గా లాబీయింగ్ చేసుకున్న నేతలు ఇప్పుడు బహిరంగంగానే పోటీ పడుతున్నారు. గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి కోసం గుంటూరు తెలుగు తమ్ముళ్లు తలపడుతున్న విధానం కేడర్ లో గుబులు పుట్టిస్తోంది. ఈ రచ్చ కాస్తా పార్టీ పరువును బజారును పడేస్తుందేమో అనుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి వరకూ ఉన్న చైర్మన్ పదవులని రద్దు చేసింది. మరి పవర్ లోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటిదాకా వాటి గతే పట్టించుకోలేదు.

అందుకే ఇన్నాల్లూ నివురు గప్పిన నిప్పులా ఉన్న వెన్నా సాంబశివా రెడ్డి, మన్నవ సుబ్బారావుల మధ్య పోటీ ఇక బైటపడుతోంది. మొదటి నుంచీ పార్టీనే నమ్ముకుని పార్టీ కోసం ఆర్థికంగాను, కుటుంబ పరంగాను నష్ట పోయిన సాంబశివారెడ్డిపై జిల్లా నేతల్లో చాలా మందికి సానుభూతి ఉంది. రెండు సార్లు కన్నాపై పోటీ చేసి ఓడి పోయిన వెన్నా, మావోయిస్టుల దాడిలో ఇద్దరు సోదరుల్ని కోల్పోయాడంటారు. మరో నేత మన్నవ సుబ్బారావు, గత ఇరవై ఐదేళ్లుగా పార్టీలోనే ఉంటూ, జిల్లాలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అధిష్టానానికి విధేయుడని పేరున్న మన్నవకి ఒకటి రెండు సందర్బాల్లో ఎమ్మెల్సీ పదవి వచ్చినట్టే వచ్చి చేజారింది. దీంతో ఈ సారైనా మన్నవకి సముచిత స్థానం కల్పించాలని ఆయనకి మద్దతు పలుకున్న నేతలు వాదిస్తున్నారు. ముఖ్యంగా మంత్రి పత్తిపాటి పుల్లారావు మన్నవ కోసం సీఎం దగ్గర గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో ఉన్న 12 మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు, ఇద్దరు ఎంపీలు కమ్మ సామాజిక వర్గానికే చెందిన వారు కావడంతో మార్కెట్ యార్డు పదవి రెడ్లకి ఇస్తే సమాజిక న్యాయం చేసినట్టవుతుందని వాదిస్తున్నారు. ఇలా జిల్లాలో నామినేటెడ్ పదవుల వ్యవహారంతో టిడిపికి తలనొప్పి తెచ్చింది.
It was two years passed away that TDP government formed. Now TDP is preparing to give nominated posts to leaders. Now in Guntur District leaders are fighting for position.