ఈడీ వేడికి ఈడికి కాలింది

17 Apr 2016


జల్సా రాయుడు విజయ్ మాల్యా కూసాలు కదిలిపోతున్నాయ్. ఈడీ అతగాడి పాస్ పోర్ట్  రద్దు చేయడంతో ఇప్పుడు బైటపడే దారి కోసం సెర్చింగ్ మొదలెట్టాడని అంటున్నారు. ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ తర్వాత వేసే అడుగు ఏంటి, విజయ్ మాల్యా ముందున్న మార్గాలేంటో ఓసారి చూద్దాం. మనీ లాండరింగ్ కేసులో 900 కోట్లకు పైగా బొక్కేసాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా కి ఉచ్చు అన్ని వైపులా బిగుసుకుంది. ఐడిబిఐ బ్యాంక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విదేశీ వ్యవహారాల శాఖ మనోడి డిప్లమేటిక్ పాస్ పోర్ట్ ను సస్పెండ్ చేసింది. వారంలోపుగా లండన్ లోని ఇండియన్ హై కమిషన్ ముందు హాజరుకాకపోతే, పూర్తిగా  రద్దు చేస్తామని కూడా వార్నింగిచ్చింది.

పాస్ పోర్ట్ చట్టం  సెక్షన్ 10 ఏ నిబంధన ప్రకారం ప్రస్తుతం నాలుగు వారాల పాటు విజయ్ మాల్యా పాస్ పోర్ట్ సస్పండ్ చేసింది కేంద్రం. దీంతో  ఇప్పుడు విజయ్ మాల్యా ఎక్కడికీ పోలేని పరిస్థితి. చచ్చినట్లు ఇండియాకి సంబంధించిన దర్యాప్తు సంస్థల అనుమతి తీసుకుని మాత్రమే ఎక్కడికైనా పోగలడు. అది కూడా ఒక్క ఇండియాకి మాత్రమే రాగలడు. అలా వచ్చినా వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకునే సిచ్యుయేషన్లో ప్రస్తుతం ఇరికించింది ఈడీ. మాల్యా విదేశాలకు పారిపోవడంలో నిఘా సంస్థలు, దర్యాప్తు సంస్థల మెతకవైఖరే కారణమని ఆరోపణలు వచ్చాయ్. ఆ మచ్చ తొలగించుకునేందుకే ఈడీ తన వాడి వేడి పనితనమేంటో చూపించందంటున్నారు.

పాస్ పోర్ట్ చట్టంలోని 10 వ రూల్ లోని త్రీ సీ నిబంధన ప్రకారం వారంలోగా మాల్యా భారతరాయబార కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. తన పాస్ పోర్ట్ ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇచ్చుకోవాలి. ఈ నేపధ్యంలో విజయ్ మాల్యా ముందున్న మార్గాలు ఒకటి లండన్ లోని భారతరాయబార కార్యాలయం ముందు హాజరు కావడం, రెండు భారతదేశానికి వచ్చి సుప్రీంకోర్టు విచారణ ఎదుర్కోవడం, మూడు నోటీసులను తిరస్కరించి శాశ్వతంగా పాస్ పోర్ట్ రద్దు చేసుకోవడం.

భారత ప్రభుత్వం ఈ కేసులో నాలుగు మార్గాల ద్వారా ముందుకు వెళ్తుందని తెలుస్తోంది. అవి ఏంటంటే ఒకటి ఈ వారం మాల్యా స్పందన కోసం ఎదురుచూడటం, అప్పటికీ అతను దిగిరాకపోతే కోర్టు ధిక్కార నేరం కింద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం, మూడోది ఇంటర్ పోల్ సంస్థకి మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేయడం. ఆ తర్వాత నాలుగో ఆప్షన్ 1993 నేరగాళ్ల అప్పగింత చట్టం కింద బ్రిటన్ ప్రభుత్వాన్ని విజయ్ మాల్యా అప్పగింత కోరడం కన్పిస్తున్నాయ్.
Kingfisher MD Vijay Malya is in problems. Now ED gave notice to Vijay Malya, and cancelled pass port of him.