బాబోయ్ భూకంపాలు

18 Apr 2016


వరుస భూకంపాలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. మొన్న ఇండోనేషియా, నిన్న జపాన్‌, తాజాగా ఈక్వెడార్‌. చిన్నాపెద్దా అన్నీ కలిపి, ఈ నెలలో ఇంతవరకు ప్రపంచ వ్యాప్తంగా పదికిపైగా భూకంపాలు సంభవించాయి. వాటితో పాటు, మన ఏపీలో శ్రీకాకుళంలో ప్రతీ నెలలో రెండు మూడు సెకన్లపాటు భూమి కంపించడం ఆందోళన కలిగిస్తోంది. ఏదో రోజు పెను ముప్పు వస్తే ఎలాగంటూ జనం లోలోపల గుబులు పడుతున్నారు. ఇక ఆదివారం ఈక్వెడార్‌లో సంభవించిన భారీ భూకంపంలో వంద మందికిపైగా మరణించారు. భారీగా ఆస్తినష్టం సంభవించింది. 

రిక్టర్‌ స్కేలుపై 7.8 గా నమోదైన కంపనల తీవ్రత ధాటికి ఈక్వెడార్‌ వాసులు వణికిపోయారు. జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతకు చాలా భవనాలు పేక మేడల్లా కుప్పకులాయి. ఈ ప్రమాదంలో వంద మందికి పైగా మరణించారు. ఈ సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. క్షతగాత్రులు కూడా భారీగానే ఉన్నారు. గాయపడ్డవారికి ఈక్వెడార్‌ రాజధాని క్విటోలోని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కూలిన భవనాల శిథిలాల కింది చాలామంది చిక్కుకుపోయి ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. దీంతో యుద్థప్రాదిపదికన శిథిలాల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. భూకంపం ప్రభావంతో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భూకంపం తర్వాత ఈక్వెడార్‌ తీరప్రాంతంలో సముద్ర జలాలు రెండు మీటర్ల మించి ఎగసిపడటంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

జపాన్‌లోని కుమమోటోలో రెండ్రోజుల క్రితం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదయ్యింది. ఈ ఘటన సంభవించిన కొద్ది గంటల్లోనే 5.4 తీవ్రతతో మరోసారి ప్రకంపనలు రావడంతో జపాన్‌ వాసులు వణికిపోయారు. కుమమోటో భూకంపంలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1500 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనకి రెండ్రోజుల ముందే 6.5 తీవ్రతతో భూమి కంపించడం గమనార్హం. అంటే వారంలో రెండురోజులు ఇలా జరగడం జపాన్ లో పొంచి ఉన్న ముప్పు ను సూచిస్తోంది. కొంతమంది పండితులు ఇటీవల కాలంలో భూకంపాలు, జలవిలయం తప్పవని హెచ్చరించారు. అది ఆ రోజు జరగలేదు కానీ ఇప్పుడిలా భూకంపాలు రావడం వారి వాదనకు బలం చేకూర్చుతుండగా, సైంటిస్టులు మాత్రం భూమి పొరల్లో కదలికలు, సర్దుబాట్లుతోనే ఇలా జరుగుతోందని అంటున్నారు.
All over world is shaking with earthquake. Only this month more than ten places earth quake happen. Recently in Andhra Pradesh, Srikakulam district also it happen.