మరో జంపింగ్ జపాంగ్

23 Feb 2016                        టిడిపి నేతలకు తమ పార్టీలోకి రావాల్సిందిగా కాంగ్రెస్ నేత వీహెచ్ ఆఫరిచ్చిన 24గంటల్లోనే ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. టిడిపి ఖాళీ అయినట్లే ఇక కాంగ్రెస్ పని పడతానంటున్న కేసీఆర్ ఆ పని చేసి చూపించారు మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్యను లాగేసుకున్నారు. దీంతో ముందు తమ చాప కింద నీటిని తోడుకోవాల్సి వచ్చేలా ఉంది వీహెచ్ లాంటి వృద్దజంబూకాలకు. పార్టీలోకి వచ్చిన బస్వరాజ్ సారయ్యకు కండువా కప్పుతూ కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్ ఎగదోశారు. తెలంగాణ వారికి పాలన రాదన్న వారికి చేసి చూపిద్దామంటూ ప్రకటించేశారు. అసలు స్వపరిపాలనకు, తెలంగాణవారి పాలనకు ఈ జంపింగ్ జపాంగ్ లకు సంబంధం ఏంటో ఆయనే చెప్పాలి. ఇతర పార్టీనేతలను వలస తెచ్చుకోవడమే తెలంగాణ పాలనేమో అని కొత్త డౌట్లు తెస్తున్నారాయన. పార్టీ మారే పెతీఓడూ డెవలప్ మెంటే కోరుకుంటే, అసలు పార్టీలతో సంబంధం లేకుండా ఎన్నికలు పెట్టుకుని గెలిచినోళ్లంతా ఓ పార్టీగా మారొచ్చుగా అని సెటైరేసేవాళ్లకు ఏం సమాధానం చెప్తారో ఈ నేతలు.

                    కొత్త జంపింగ్ జపాంగ్ బస్వరాజ్ సారయ్య పార్టీ మారినా తాను మాత్రం కాంగ్రెస్ ను విమర్శించనంటూ తాత్కాలిక భక్తి ప్రదర్శిస్తున్నాడు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని అలాంటి పార్టీపై విమర్శలు చేయనంటూ బ్యాలెన్స్ బిహేవియర్ ప్రదర్శిస్తున్నాడు. అంతకు ముందు డిఎస్ కూడా ఇదేలా ప్రవర్తించాడు. వీళ్లంతా రేపు టైమ్ బాగాలేకపోతే కాంగ్రెస్ టైమ్ బాగుండేట్టయితే మళ్లీ అందులోకి రివర్స్ జంప్ కొట్టే ముందు జాగ్రత్తేమో మరి.
Few days back Telangana congress leader VH became hot topic in media with his comment on TTDP MLAs to join in Congress. Now Congress Ex minister Bhasavaraj Sarayya joined in TRS.