చైనా ఫెస్టివల్

28 Jan 2016           చైనా దేశానికి వెళ్లే విమానాలు కిటకిటలాడుతున్నాయ్. ఫిబ్రవరిలో చైనా కొత్త సంవత్సర వేడుకలకు హాజరయ్యే జనంతో అక్కడ రైళ్లు కూడా విపరీతమైన రద్దీతో ప్రయాణిస్తున్నాయ్. వీటిలో చోటు దొరకని కొంతమంది మారధాన్ రన్లూ చేస్తున్నారు. ఎంతదూరమైనా వెళ్లాల్సిందే అమ్మానాన్నలతో పండగ జరుపుకోవాల్సిందే ఇదే ఇప్పుడు చైనీయుల్లో మెదులుతోంది.
           కొత్త సంవత్సరం వేడుకలు చైనాలో జోరుగా ప్రారంభమయ్యాయ్. మనకి తెలుగు ఉగాది పండగలా చైనాలో ఈ సంప్రదాయ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతాయ్. ఆ సమయంలో ఎలాగైనా తన కుటుంబసభ్యులతో గడపాలనే ఆలోచనతో చైనావాసులు  ఉండటంతో ఎయిర్ పోర్ట్ లు  కిటకిటలాడుతున్నాయ్.. 

 ఈ రద్దీ ఏ స్థాయికి చేరిందంటే జనం కాళ్లకు కూడా పని చెప్తున్నారు.వందలాది మైళ్ల దూరమున్నా సరే లెక్కచేయకుండా.. మారథాన్ రన్స్ చేస్తున్నారు..హువాంగ్ చాంగ్ యాంగ్ అనే కుర్రోడు షెంజెన్ నుంచి చెంజోవ్ అనే పట్టణం వరకూ తన రన్ మొదలెట్టాడు.. అతను ప్రయాణించిన దూరమెంతో తెలిస్తే ఆశ్చర్యపోకతప్పదు..దాదాపు 370కిలోమీటర్లు అలా రన్ చేస్తూనే చేరుకున్నాడు.
 తమ దేశ కొత్తవసంతం వేడుకల్లో పాల్గొనేందుకు ఇప్పటికే చైనాలో వివిధ ప్రాంతాల్లోని ప్రజలు భారీ సంఖ్యలో తమ సొంత ప్రాంతాలకు క్యూకట్టారు. ఈ నేపథ్యంలో అన్ని ట్రాన్స్ పోర్ట్ మార్గాలు రద్దీగా మారాయి.  రెండున్నర కోట్ల మంది ఒక్కసారే స్వస్థలాలకు పయనమైతే ఆ రద్దీ ఎలా ఉంటుందో ఊహించుకోవాల్సిందే తప్ప చెప్పలేం.


             చైనా కొత్త సంవత్సరాన్నే స్ప్రింగ్ ఫెస్టివల్ గా పిలుస్తారు. ఇది దాదాపు 4వేల సంవత్సరాల నుంచీ జరుగుతుందని అంటారు. చైనాదేశంలో భారీవ్యయంతో కళ్లు మిరుమిట్లు గొలిపే పండగగా ఈ స్ప్రింగ్ ఫెస్టివల్ ను చేస్తారు. చైనా దేశం జ్యోతిష్యం ప్రకారం 12 రాశులు ఉంటే వాటికి 12 జంతువులను అధిదేవతలుగా పూజిస్తారు. పన్నెండు నెలల్లో ఫిబ్రవరి నెలకు ఏ అధిపతి వస్తే ఆ జంతువు పేరుతో ఆ ఏడాది ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. చైనా దేశపు చలికాలపు వసంతంగా చెప్పుకునే కొత్తసంవత్సర వేడుకలు గత 4వేల సంవత్సరాలుగా జరుగుతున్నాయని ప్రతీతి. దేశంలో జరుపుకునే అతి పెద్ద పండుగ ఇదే. చైనా దేశపు జ్యోతిష్యం ప్రకారం నెలకోరాశి చెప్పున పన్నెండు రాశులకు పన్నెండు జంతువులను అధిదేవతలుగా బావిస్తూ పూజలు జరుపుతుంటారు. 
             చైనా ఉగాదిని కుటుంబంతో జరుపుకునే పండగగా అమలు చేస్తారు. ఎక్కడెక్కడో స్థిరపడినవారంతా ఓచోటికి  చేరడానికి ఈ సందర్భాన్ని చైనాదేశస్థులు వినియోగించుకుంటారు. అలా ఇది ఫ్యామిలీ ఫెస్టివల్ గా కూడా జరుపుకుంటారు. అలానే పండుగ రోజులు కూడా చాలా  ఎక్కువే. మొత్తం పదిహేను రోజులు పాటు ఉత్సవాలు జరుగుతాయ్..మనకి దసరా పదిరోజులు జరిగితే..చైనా దేశానికి స్ప్రింగ్ ఫెస్టివల్ పదిహేనురోజులు పాటు చంద్రమాసంలో మొదటి రోజునుంచి పదిహేనవరోజు వరకూ జరుపుతారు. ఒక్కోసారి ఇది చాంద్రమానం ప్రకారం పన్నెండో నెలలోని ఇరవైమూడోరోజు నుంచి కూడా జరుపుతారు. పండగరోజుల్లో చైనాదేశంలో ఉద్యోగులకు దాదాపుగా అన్ని సంస్థల్లో ఏడురోజులు మాత్రమే పని ఉంటుంది. అలానే విద్యార్ధులకు నెలరోజులు సెలవే. క్రీస్తుకు పూర్వం 17వ శతాబ్దం నుంచి చైనా స్ప్రింగ్ ఫెస్టివల్ ను నియోన్ అనే రాక్షసిని చంపిన రోజుగా జరుపుకునేవారట, నియాన్ చిన్నపిల్లలను. పెంపుడు జంతువులను చంపితినేదని. షాంగ్ అనే రాజు దానిపై యుధ్దం చేసి చంపాడని ప్రతీతి. నియాన్ కు ఎర్రరంగు అన్నా పెద్ద పెద్ద చప్పుళ్లన్నా భయపడేదట అందుకే ఈ పండగ రోజుల్లో ఎర్రరంగు కాన్వాస్ పెయింట్లు, రెడ్ లైట్స్ ఎక్కువగా వాడుతుంటారు. ఫెస్టివల్ దగ్గరపడేకొద్దీ చైనీయులు ఇళ్లను శుభ్రం చేసుకుని  ఎర్రరంగు పెయింట్ వేస్తారు. స్ప్రింగ్ కపులెట్స్ క్యారెక్టర్ల బొమ్మలతో గోడలను అలంకరిస్తారు.

              చైనా స్ప్రింగ్ ఫెస్టివల్ సందర్భంగా ఇచ్చిపుచ్చుకునే బహుమతులు కూడా ఆకర్షణీయంగా ఉంటాయ్.. లిక్కర్ బాటిల్స్, సిగరెట్లు, పళ్లు, రెడ్ కవర్లు..గడియారాలు..షూస్, పియర్స్ ఫ్రూట్స్ పదునైన ఆయుధాలు, మల్లెపూలు, గొడుగులు ఇవన్నీ గిఫ్ట్ లుగా వాడతారు. ఎర్రరంగు ఉన్నవైతే మరీ ఇష్టపడతారు చైనీయులు. అలానే చైనీయులు భవిష్యత్ శుభసూచకంగా ఉండేందుకు పండగరోజుల్లో  మరణం, పగిలిపోవడం, చంపడం, దెయ్యాలు, అనారోగ్యం, జబ్బులు వంటి పదాలను సంభాషణల్లో వాడరు. అలానే ఏడవడం, బట్టలు ఉతకడం, అప్పు తీసుకోవడం, మెడిసిన్స్ వాడటానికి దూరంగా ఉంటారు. ఈ పనులను పండగరోజుల్లో చేయకుండా వాయిదా వేస్తారు. ప్రతీ రోజూ సాయంత్రం పూట జరిగే సాంస్కృతిక నృత్యాలు అలరిస్తాయ్. యువతీయువకుల ఆటపాటలు, సంప్రదాయబద్ద వాయిద్యాలుతో సంబరాలు అంబరాన్నంటుతాయ్. దేశంలోనే పెద్ద పండుగ కాబట్టే చైనాదేశానికి వెళ్లే దారులన్నీ ఇప్పుడు రద్దీగా మారాయ్. ఈ రద్దీతో కొత్తగా కార్ పూలింగ్ కూడా ట్రావెల్ కంపెనీలు చేపట్టాయ్. దీనికి కూడా విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. మొత్తంమీద జనవరి 24 నుంచి ఫిబ్రవరి 8వరకూ చైనాలో పండగ వాతావరణం నెలకొననుంది.

All trains and flights are very busy in China. Because in February China celebrates new year festival. It is celebrating since B.C. Totally 20 crores of peoples are going to home towns.