రామ్ చరణ్ మైండ్ గేమ్

14 Nov 2015


బ్రూస్‌లీ పరాజయంతో రామ్ చరణ్ కాన్ఫిడెన్స్ కాస్త ఎఫెక్ట్ అయ్యే వుంటుంది. ఇంతకాలం కమర్షియల్ సినిమాలతో సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చిన చరణ్‌కి ఈ చిత్ర పరాజయం షాకిచ్చింది. అన్ని విధాలుగా కమర్షియల్‌గా మలచిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తిప్పి కొట్టారు. అభిమానులు సైతం దీనిని మోసే ప్రయత్నాలు చేయలేదు. అందుకే తదుపరి చిత్రాలని కేర్‌ఫుల్‌గా ప్లాన్ చేస్తున్న రామ్ చరణ్ బిజినెస్ పరంగా కూడా తన తెలివితేటలు చూపిస్తున్నాడు. తని ఒరువన్ చిత్రానికి ముందుగా బ్రూస్‌లీ నిర్మాత దానయ్యే ప్రొడ్యూసర్. అతనికి మెగా ఫ్యామిలీ పట్ల వున్న విధేయతకి ముగ్ధుడై వెంటనే మరో సినిమా చేయడానికి చరణ్ అంగీకరించాడు. ఎప్పుడైతే బ్రూస్‌లీ పోయిందో దానయ్యని సీన్లోనుంచి తప్పించాడు. 

ఈ చిత్రానికి కూడా దానయ్యే నిర్మాత అయినట్టయితే నష్టపోయిన బయ్యర్లు వచ్చి ఈ సినిమాతో నష్ట పరిహారం చేయాలంటారు. అదే దానయ్య లేకపోతే దీనికి ఆ సమస్యలుండవు. నిజానికి బ్రూస్‌లీని కొన్న డ్రిస్టిబ్యూటర్లు ఎవరూ నష్టపోలేదు. వారంతా ముందుగానే థర్డ్ పార్టీలకి అమ్మేసుకుని లాభాలు వెనకేసుకున్నారు. కానీ సినిమా ఫ్లాపయితే మళ్లీ నిర్మాత ముక్కు పిండడానికి కూడా బయ్యర్లు వెనకాడరు. ఇదంతా తెలుసు కనుకే.. చరణ్ తెలివిగా దానయ్యని పక్కనపెట్టి తన తదుపరి సినిమాపై బ్రూస్‌లీ ఎఫెక్ట్ లేకుండా చేసుకున్నాడు. హీరోలన్నాక ఇలాంటి బిజినెస్ పరమైన ఎత్తుగడలూ వుండాలి మరి.