నేలపై కోపంతో ....

9 Nov 2015

నీలాకాశ నేపథ్యంలో మేఘమాలికలు
ధవళ వర్ణ వస్త్రాల్లా తేలాడుతుంటాయి
ఒకసారి ఏకిన దూది పింజలుగా
ఒకసారి పికాసో చిత్రంలా
ఒకసారి రవివర్మ కుంచె రంగులా
ఒకసారి రణక్షేత్ర అశ్వాల్లా
ఒకసారి అంబారీ కట్టిన ఏనుగుల్లా
ఒకసారి వలస వచ్చిన పక్షుల్లా
వేషాలు వేస్తూ రంగులు మార్చుతూ
ఎన్నెన్నో ఊహాకారాలు!
ఉదయించే సూర్యుణ్ణి చూసి
ఎరుపెక్కిన బుగ్గల్తో
వొళ్లంతా రంగుమారుతుంది
అస్తమయాన దు:ఖమయమై
పశ్చిమాన రంగులు పూస్తాయి
నేలపై కోపంతో
సూర్యుడితో చేతులు కలిపి భూమిని కాల్చమని
ఆకాశ సరిహద్దు శయ్యాగృహాల్లో నిద్రిస్తాయి
భానుడితో ఘర్షించి
ఆకాశంలో పందిరి వేసి నేలకు నీడనిస్తాయి
పున్నమి చంద్రుడుకి పైట కప్పి
ఊపిరాడని చంద్రుడు పక్కకు తప్పుకుంటే
మెడకు మేఘమాలిక మఫ్లరై
చందమామకు అందమౌతుంది
ఒకసారి నేలకు కృతజ్ఞత చాటుతాయి
ఒకసారి కృతఘ్నత చెబుతాయి!
ఇక్కడ సముద్రం కన్నబిడ్డ మేఘమాలిక
రక్తసంబంధాల్ని తెంచి ఎటో పారిపోతుంది
ఎక్కడో సముద్రం కన్నబిడ్డ వలసవచ్చి
ఇక్కడ వరదై పారి బంధం ముడి వేస్తుంది
రాగద్వేషాలకు
రాజకీయాలకు మేఘాలు అతీతం కావు
నచ్చని చోట నాలుగు చినుకులు రాల్చి
నచ్చిన చోట కుంభవృష్టి కురిపిస్తాయి
పిడుగుల్ని కురిపించి ప్రాణాలు తీస్తాయి
మెరుపుల్ని పండించి ఆహ్లాదపరుస్తాయి!
ఉరుకుల పరుగుల మేఘానికో విన్నపం
ఇదిగో ఇక్కడ నేల తడవని సీమనేల
ఎండిన చెరువుల పెదాలు తపస్సు చేస్తున్నాయి
గ్రాసం లేక పశువులు మోరెత్తి ప్రార్థిస్తున్నాయి
వ్యధలు నిండిన రైతుల కళ్ళు రోదిస్తున్నాయి
ఎండిన మోళ్లు చిగుళ్లను కలవరిస్తున్నాయి
నాలుగు పదున్ల వానలు కురిసి
నలుగుర్ని ఏరువాకకు నడిపించాలి!
- అడిగోపుల వెంకటరత్నమ్‌
source : Ravikumar Bandla