అమ్మాయిని ఆయుదం లాగా పెంచండి

14 Nov 2015

ఆడపిల్ల అర్థరాత్రి నిర్భయంగా బయట తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని కొంతమంది మహానుభావులు అన్నారు. కానీ పట్టపగలు ఆడపిల్ల బయటకు వెళితే తిరిగివస్తుందో రాదో, ఏ వార్త వినాల్సి వస్తుందో, ఏ ఫోన్‌కాల్‌ రిసీవ్‌ చేసుకోవాల్సి వస్తుందో అని భయపడుతున్న సమాజంలో మనం బతుకుతున్నాం. ఆడపిల్లల ఆత్మాభిమానం దెబ్బతినకుండా ఉండాలన్నా, వారి ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండాలన్నా, వాళ్ళను వాళ్ళు రక్షించుకోవాలన్నా? ముందు తల్లిదండ్రులు మారాలి.
ఆడపిల్ల నవ్వకూడదు, బయటకు వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్లాల్సి వస్తే అన్ననో తమ్ముడినో, తండ్రినో తోడు తీసుకొని వెళ్ళాలి అని ఆంక్షలు పెట్టి వాళ్ళకి పిరికిమందు పోస్తున్నారు. వాళ్ళకు నిజంగా జయించే శక్తి ఉన్నాగానీ ముందుకు పోలేకపోతున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు చెబుతున్నారంటే, అదే నిజమనుకునే ఆమాయకులు వాళ్ళు. ఆడపిల్లకు చిన్నవయస్సులో తండ్రి, పెద్దయ్యాక భర్త, వృద్ధాప్యంలో కొడుకు. ఇలా పుట్టిన దగ్గరనుండి చనిపోయే వరకూ ఎవరో ఒకరి మీద ఆధారపడి బతికేలా చేస్తున్నారు. అయితే అందుకు కారణం ఒక్క తల్లిదండ్రులేకాదు. సినిమాలు, టీవి ఛానళ్ళు, ఇతర మీడియా ప్రభావం కూడా ఉంది. ఈ మధ్య సీరియల్స్‌లో ఆడవాళ్ళను విలన్లుగా చూపించడం మరీ ఎక్కువయ్యింది. ఆడపిల్ల అంటే కర్కోటకరాలు అనే విలనిజాన్ని ఆయా కారెక్టర్లలో చూపిస్తున్నారు. అలాగే 'మనం మగవాళ్ళం. ఆడవాళ్ళకంటే వెయ్యి రెట్లు విలనిజం మనమూ చూపించగలం' అనే భావన ఈ పురుషాధిక్య సమాజంలో ఎక్కువ అవుతోంది. దాని ఫలితమే ఈ యాసిడ్‌ దాడులు, పీకలుకోసెయ్యడాలు, చైన్‌ స్నాచింగ్‌లు వంటి హింసాకాండలు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఆడపిల్లలను ఆయుధాల్లా పెంచాలి కానీ అసమర్థుల్లా కాదు.
చాలామంది తల్లిదండ్రులుకూడా ఆడపిల్లలకు సంతకం పెట్టడం వస్తే చాలు, ఉత్తరం రాస్తే చాలు.. ఆ మాత్రం చదువు చదివిస్తే సరిపోతుంది అనేకునేవాళ్ళూ సమాజంలో ఉన్నారు. మగపిల్లలకు మంచి చదువు, కెరీర్‌ లేకపోతే మంచి కట్నంరాదు, ఆడపిల్లలకైతే ఎంతోకొంత కట్న కానుకలిచ్చి అత్తారింటికి పంపిస్తే మా బాధ్యత తీరిపోతుంది అనుకునేవాళ్ళు లేకపోలేదు. అంతేకాదు నూటికి తొభై శాతం మంది తల్లిదండ్రులు పిల్లల ఎదురుగానే గొడవలు పడటం, తిట్టుకోవడం చేస్తున్నారు. అలాంటి ఇళ్ళల్లోని మగపిల్లలకు 'నాన్నలానే నేనూ నా భార్యను తిట్టొచ్చు, కొట్టొచ్చు అనే భావన పాతుకుపోతోంది. కానీ ఆడపిల్లలు మాత్రం నాన్న అమ్మని హింసించినట్టు రేపు మాకు కూడా పెళ్లయి అత్తారింటికి వెళ్లాక మా పరిస్థితి ఇలాగే ఉంటుందేమో? అని భయపడుతుంటారు. ఎందుకంటే పైన చెప్పిన విధంగా ఆంక్షలు ఉంటాయి కాబట్టి వాళ్లకు ఎదిరించే ధైర్యసాహసాలున్నా?! అడుగు ముందుకు వెయ్యలేని పరిస్థితి.
కాబట్టి మగపిల్లాడితో సమానంగా ఆడపిల్లకు విద్యాబుద్దులు నేర్పించడం, వాళ్ళకు వాళ్ళు రక్షించుకునే విధంగా కరాటే, కుంగుఫూ, కర్రసాము, నాన్‌ -చాక్‌ వంటివి నేర్పించి ఆర్ధికంశాల్లో కూడా భాగ్యస్వాముల్ని చేయడం చేయాలి. ఇలాంటివి ఆడపిల్లకు ఆసరాగా ఉంటే ర్యాగింగు వంటి వాటి నుంచి కూడా బయటపడవచ్చు. ఎందుకంటే ర్యాగింగువల్ల చాలామంది అమ్మాయిలు సూసైడ్‌ చేసుకున్న ఉదంతాలు మనం చూస్తునే ఉన్నాం. తల్లిదండ్రుల, మీడియాల ప్రభావం ఉంటుంది. అని అన్నానని ఏమీ అనుకోవద్దు. మీడియా వలన ఎంతమంచి జరుగుతుందో అంత చెడు కూడా జరుగుతుంది. దాని నుంచి మంచిని తీసుకుని చెడుని విడిచిపెట్టాలి అని నేను కోరుకుంటున్నాను. చివరిగా తల్లిదండ్రులకు నేను చెప్పేది ఒకటే. మీ పిల్లల్ని మీరే కాపాడుకోండి. నేను రాసిన దాంట్లో తప్పులుంటే అపార్ధం చేసుకోకండి.     ravikumar bandla