సల్మాన్ ఖాన్ మజాకా

14 Nov 2015

సల్మాన్ భాయ్ తాజా చిత్రం థియేటర్లలోకి వచ్చింది. దీపావళికి రిలీజ్ చేసిన ప్రేమ్ రతన్ ధన్ పాయో ఊహించినట్టుగానే భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వేట మొదలు పెట్టింది. రెండొందల కోట్ల వసూళ్లని మంచి నీళ్ల ప్రాయంగా సాధిస్తోన్న సల్మాన్‌తో సూరజ్ బర్జాత్యా చాలా కాలం తర్వాత చేసిన చిత్రమిది. చరిత్ర సృష్టించిన 'మైనే ప్యార్ కియా', 'హమ్ ఆప్ కే హై కౌన్' మాదిరిగా ఈ చిత్రం కూడా అదరగొడుతుందనే అంచనాల మధ్య విడుదల కాగా... దీనికి మిక్స్‌డ్ టాక్ బాగా వినిపిస్తోంది. కొందరు ఆ సెంటిమెంట్లు, ఎమోషన్లు భలేగా వున్నాయని అంటోంటే, ఇంకొందరు మాత్రం బాబోయ్ అంటూ తల బాదేసుకుంటున్నారు. విపరీతంగా స్లోగా సాగే ఈ చిత్రాన్ని భరించడం చాలా కష్టమని విమర్శిస్తున్నారు.

పాజిటివ్ రివ్యూల కంటే నెగెటివ్ సమీక్షలే ఎక్కువ వస్తోన్న ఈ చిత్రానికి సల్మాన్ ఖాన్ హైలైట్‌గా నిలిచాడట. గత అయిదేళ్లలో తను చేసిన సినిమాల్లో చాలా వాటికి చెప్పుకోతగ్గ టాక్ రాలేదు, విమర్శకుల్ని మెప్పించలేదు. కానీ బాక్సాఫీస్‌ని మాత్రం చెడుగుడు ఆడేసుకున్నాయి. అదే విధంగా 'ప్రేమ్ రతన్'తో భాయ్ ఖాతాలో మూడవ రెండొందల కోట్ల సినిమా చేరుతుందేమో చూడాలి. కొందరు విమర్శకులైతే ఈ చిత్రం ఏం చేసినా కానీ రెండొందల కోట్లు సాధించలేదని సవాల్ చేస్తున్నారు. కానీ సల్మాన్ సినిమాలకి టాక్‌తో సంబంధం లేకుండా వసూళ్లు వచ్చి పడిపోతాయనే సంగతి తెలియనిది కాదు.