సినీ బాల భారతం స్పెషల్

14 Nov 2015

సినిమా పరిశ్రమలో విజయాలు బహు కొద్దిమందికే లభిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. అయితే వెండితరకు ఎందరో బాల నటులుగా పరిచయమైనప్పటికీ కొదరికి మాత్రమే స్టార్ ఇమేజ్ సొంతమై సూపర్ స్టార్లుగా ఎదిగే అవకాశం లభిస్తుంది. మరి తొలుత చైల్డ్ ఆర్టిస్ట్ గా నటన ప్రారంభించి అటుపై సినీ వినీలాకాశంలో తిరుగులేని ధృవ తారలుగా వెలిగుతున్న నటులను ఇక్కడ ఒకసారి పరీశీలిద్దాం. నేడు అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఒకసారి హీరోలుగా మారిన కొందరు బాలనటుల గురించి, హీరోయిన్లుగా మారిన నటీమణుల గురించి తెలుసుకుందాం...

భారతదేశ సినీ రంగంలో విలక్షణ కథానాయకుడిగా పేరుతెచ్చుకున్న హీరో కమల్ హాసన్. తన నట విశ్వరూపంతో దేశంలో ఆస్కార్ అవార్డును అందుకునేందుకు అర్హత కలిగిన నటులలో ఆయన మొదటిస్థానంలో ఉంటారు. 1954 సంవత్సరం నవంబర్ 7న జన్మించిన కమల్ బాలనటునిగా నాలుగు సంవత్సరాల వయసులోనే సినీ రంగ ప్రవేశం చేయడం విశేషం. 1959లో విడుదలైన కలాతుర్ కన్నమ్మ చిత్రంలో కమల్‌హాసన్ బాలనటునిగా చేశారు.. కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం అరంగేట్రం(1973) కమల్‌హాసన్‌కు ఎంతో పేరును తీసుకువచ్చిపెట్టింది. ఆ తర్వాత పలు బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించిన ఆయన నేడు దేశంలో అద్భుతమైన నటనతో ఆకట్టుకునే కథనాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. తెలుగు సినీ రంగంలో నాటి ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ. 1960 సంవత్సరం జూన్ 10న జన్మించిన ఆయన నేడు టాలీవు డ్‌లోని అగ్ర కథనాయకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఇక 14 సంవత్సరాల వయసులోని బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ రూపొందించిన తాతమ్మ కల సినిమాలో బాల నటునిగా సినీ రంగ ప్రవేశం చేశారు. టాలీవుడ్‌లో సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వర్‌రావు తనయుడు అక్కినేని నాగార్జున. తండ్రి నటనా వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని తెలుగు సినీ రంగంలోని టాప్ హీరోలలో ఒకరిగా నిలిచారు ఆయన. 1959 సంవత్సరం ఆగస్టు 29న జన్మించిన నాగార్జున 1967లో వచ్చిన సుడిగుండాలు చిత్రంతో బాల నటునిగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత 1986లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్ సినిమాలో తొలిసారిగా హీరోగా చేసి ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు తనయుడైన వెంకటేష్ నేడు టాలీవుడ్‌లోని ప్రముఖ హీరోలలో ఒకరు. విక్టరీ వెంకటేష్‌గా పేరుతెచ్చుకున్న వెంకటేష్ 1960 సంవత్సరం డిసెంబర్ 13న జన్మించారు. ప్రేమ్‌నగర్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లోకి వచ్చిన వెంకటేష్ 1986లో విడుదలైన కలియుగ పాండవుల చిత్రంతో హీరోగా చేయడం మొదలెట్టారు. ఈ సినిమాలో ఉత్తమ నటనకుగాను నంది అవార్డును ఆయన అందుకున్నారు.

హీరోయిన్లలో శ్రీదేవి బాలీవుడ్‌లోనూ అగ్రతారగా వెలుగొందింది. బడిపంతులు చిత్రంలో నాటి సీనియర్ నటుడు ఎన్‌టిఆర్‌కు మనవరాలిగా నటించి...తర్వాత ఆయనతో హీరోయిన్‌గా నటించి హిట్ పెయిర్ అనిపించుకుంది. 1991లో జన్మించిన హన్సిక దేశముదురు చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2003లో వచ్చిన హిందీ చిత్రం హవాతో తన హవా కొనసాగించింది. ఆ చిత్రంలో సంజయ్‌దత్‌కు కూతురుగా నటించింది బేబీ హన్సిక. హృతిక్ రోషన్ చిత్రం కోయిమిల్గయాలోనూ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం దక్షిణాది హీరోయిన్‌గా కోలీవుడ్, టాలీవుడ్‌లో నటిస్తోంది. 1988లో జన్మించిన ఈ కేరళ కుట్టి 1998లో హనుమాన్ అనే బాలల సినిమాలో నటించింది. తర్వాత అనేక మలయాళ చిత్రాలలో నటించి తెలుగులో అలా మొదలైంది చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

నేటితరం హీరోలుగా వెలుగిపోతున్న ప్రిన్స్ మహేష్, జూ.ఎన్‌టీఆర్, బన్నీలు కూడా ఒకప్పుడు బాలనటులుగానే ఎంట్రీ ఇచ్చారు. తరుణ్, కళ్యాణరామ్, మంచు మనోజ్ వంటి యువ హీరోలు కూడా ఒకప్పుడు అలా బాలనటులుగా తళుక్కుమని మెరిశారు.
శ్రీమంతుడు చిత్రంతో 150 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన ప్రిన్స్ మహేష్‌బాబు నీడ, పోరాటం, కొడుకు దిద్దిన కాపురం తదితర చిత్రాలలో బాలనటుడిగా నటించి మెప్పించాడు. రాజకుమారుడు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ ప్రిన్స్ ప్రస్తుతం టాలీవుడ్ రికార్డులు తిరగరాస్తున్నాడు.డైలాగులు చెప్పడంలో, భావోద్వేగాలు పలికించడంలో తనకంటూ ఓ ప్రత్యేకత చాటుతున్నాడు జూ.ఎన్‌టీఆర్. బాల రామాయణం చిత్రంలో బాల రాముడిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం మాస్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకుంటున్నాడీ బాద్‌షా. గంగోత్రి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు అర్జున్. చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ విజేత చిత్రంలో బాలనటుడిగా తళుక్కుమని మెరిశాడు బన్నీ. తర్వాత డాడీ చిత్రంలోనూ డ్యాన్సర్‌గా కనిపించాడు. ప్రస్తుతం టాప్ హీరోలులో ఒకడిగా వెలిగిపోతున్నాడు.

తరుణ్ కూడా అనేక సినిమాలలో బాలనటుడిగా కనిపించాడు. బాలకృష్ణ నటించిన ఆదిత్య 369, అంజలి చిత్రాలలో బాలనటుడిగా తనదైన ముద్రవేశాడు. నువ్వేకావాలి చిత్రంలో హీరోగా ఎంట్రీ ఇచ్చి అనేక విజయవంతమైన చిత్రాలలో నటించాడు తరుణ్. మంచు మనోజ్ కూడా మోహన్‌బాబు నటించిన కొన్ని చిత్రాలలో బాలనటుడిగా కనిపించాడు. సీనియర్ నటుడు ఎన్‌టీఆర్‌తో కూడా కలిసి నటించిన ఘనత మనోజ్‌దే అని చెప్పవచ్చు. ఆ తర్వాత అడవిలో అన్న, ఖైదీగారు చిత్రాలలో నటించాడు. హీరోగా దొంగ దొంగది చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో మెప్పిస్తున్నాడు. ఇంకా రాశి, మీనా, రోజారమణి, వరలక్ష్మి, రోహిణి వంటి చాలామంది బాలనటులుగా రాణించిన తర్వాతే అగ్రతారలుగా వెలుగొందారు. రీసెంట్‌గా అఖిల్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని మూడోతరం వారసుడు అక్కినేని అఖిల్. చిన్నతనంలోనే సిసింద్రీగా అదరగొట్టాడు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల ఆదరణతో దూసుకుపోతున్నాడు.