అన్నా కాంటీన్ లు లేనట్టే

7 Jun 2015

పేదలకు ఐదు రూపాయలకే అన్నం పెట్టాలనే యోచనతో ప్రకటించిన అన్న క్యాంటీన్ల ఏర్పాటు అనుమానంగా మారింది. అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత ఏడాది కిందట చెప్పారు. 2014 అక్టోబర్ నుంచి తొలివిడతగా అనంతపురం, చిత్తూరు, గుంటూరు, విశాఖపట్నం జిల్లా కేంద్రాల్లో 35 సెంటర్లను ప్రారంభిస్తామని ప్రకటించారు.ఎన్టీఆర్ క్యాంటీన్ల ద్వారా పేదలకు రూ.5కే సాంబారు అన్నం, రూ.3కు పెరుగన్నం, రూపాయికే ఇడ్లీ ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా ఏర్పాటుపై ప్రభుత్వంలో కదలిక కనిపించడంలేదు. క్యాంటీన్లు ప్రారంభించకుండానే వాటిని ఏర్పాటు చేస్తే అందులో భోజనం చేస్తారా అనే సందేహం ప్రభుత్వం వైపునుంచి వ్యక్తమైనట్లు సమాచారం. దీంతో క్యాంటీన్ల ఏర్పాటుపై ఇప్పట్లో ఆలోచించే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ పేరిట ప్రకటించిన పథకాన్నే పట్టించుకోవడం లేదు. తమిళనాడులో ‘అమ్మ క్యాంటీన్ల’ పేరిట ఆ ప్రభుత్వం ఈ పథకాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తోంది.