త్రిష తప్పుకుంది..కేథరిన్ వచ్చింది

13 May 2015

టాలీవుడ్, కోలీవుడ్‌లలో క్రేజీ బ్యూటీగా వెలుగుతున్న అందాల తార త్రిష. ఇటీవల అమ్మడు యువ నిర్మాత వరుణ్ మణియన్‌తో ప్రేమ, నిశ్చితార్థం, వివాహ రద్దు అంటూ అన్ని చక చకా జరిగిపోయాయి. వారి పెళ్లి ఎందుకు రద్దు అయిందో స్పష్టంగా తెలియదుకానీ, వరుణ్ మాత్రం కక్ష్య సాధింపు చర్యలను మొదలెట్టాడంటూ కోలీవుడ్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అసలు విషయానికి వస్తే శింబు హీరోగా సెల్వరాఘవన్ ఓ సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్లు తాప్సీ, త్రిష నటిస్తున్నారు. ఇటీవలే శింబు, తాప్సీ, త్రిష ఫోటో షూట్‌లో పాల్గొన్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి వరుణ్ మనియన్ ఫండింగ్ చేస్తున్నాడట. ఈ నేపథ్యంలో త్రిషని వద్దని వేరే హీరోయిన్‌ని తీసుకోమని సెల్వరాఘవన్ దగ్గర వరుణ్ మనియన్ చెప్పినట్లు సమాచారం. అసలే నిర్మాతలు చిక్కక కష్టాల్లో ఉన్న సెల్వరాఘవన్‌ ఎక్కడ వరుణ్ మాట కాదంటే సినిమా ఫండింగ్‌కు వెనక్కు తగ్గతాడోననే భయంతో, చేసేది లేక త్రిషను ఆ సినిమా నుంచి తొలగించాలని నిర్ణయించుకున్నాడు. అయితే అంతకు ముందుగానే విషయాన్ని గ్రహించిన త్రిష తానే డేట్స్ కుదరడం లేదంటూ ఆ సినిమా నుంచి  పక్కకు తప్పుకుంది. దీంతో సెల్వరాఘవన్ త్రిష స్థానంలో కేథరిన్ థెరిసాను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక ఇప్పుడు ఈ సినిమాలో చెన్నై బ్యూటీ కేథరిన్ హీరోయిన్‌గా నటిస్తుంది. కేథరిన్ ని సెల్వ ఫైనల్‌గా ఫిక్స్ చేశాడు. ఆదివారం రోజు జరిగిన ఆడిషన్ తరువాత సెల్వ తను ఆ ప్రాజెక్ట్‌కు సరిపోతుంది అని తనని ఎంపిక చేశారు. దీంతో శింబు సరసన నటించేందుకు కేథరిన్ సిద్ధమైంది. బుధవారం నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానున్నట్లు సినీ యూనిట్ సమాచారం.