'మా' విజయం మెగా బ్రదర్స్ దే..!

18 Apr 2015

ప్రతికారాలతో భగ భగ లాడే ఒక ఊరులో జరిగే  పాపులర్ పంచాయతి ఎలక్షన్లు మాదిరి ..  తెలుగు సినిమా నటుల సంఘం 'మా' అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. సామరస్యంగా సాగిపోతుందనుకున్న ఎన్నిక ఇగోల కాష్టం రగలటంతో.. వ్యూహాలు.. ప్రతివ్యుహాలు..  కుళ్ళు.. కుతంత్రాలు.. రాజకీయాలు మేదేసుకుని రచ్చ రచ్చగా తయారైంది. ఆ రచ్చ టీవీలకు ఎక్కింది.. పత్రికలకు ఎక్కింది.. జనాల నోళ్ళలో నానింది... చివరికి కోర్టు మెట్లు కూడా ఎక్కింది.
 
ఈ రేంజ్ తంతు చేసి కొంత  ఉత్కంఠభరిత ఆలస్యాన్ని పాటించి మొత్తానికి ఒక ఆసక్తికరమైన ఫలితాన్ని రాబట్టుకున్నారు 'మా' సభ్యులు. ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్  గెలుస్తాడు అని చాలా మంది అనుకోలేదు. కానీ అంచనాలను తారు మారు చేసి నటకిరీటి 'మా' అద్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అది మాములుగా కాదు రికార్డ్ మెజారిటీ తో..! మురళి మోహన్ రాజేంద్ర ప్రసాద్ ను ఓడించాలని వేసిన పన్నాగాలు ఏవి పారలేదు. పై పెచ్చు బోల్డంత పరువు నష్టాన్ని తెచ్చి భుజాన పెట్టాయి. పొతే ఈ ఎన్నికల్లో రాజేంద్రప్రసాద్ గెలవటానికి ప్రధాన కారణం ఒకటే కనిపిస్తుంది.. అదేమంటే.. మెగా బ్రదర్స్..!
 
మెగా బ్రదర్స్ పూనుకోవటం వల్లనే రాజేంద్రప్రసాద్ ఇంత మెజారిటితో గెలవగాలిగారు అని విశ్లేషణలు సాగుతున్నాయి. మురళి మోహన్ వ్యతిరేక వర్గాన్ని.. మెగా హీరోలకు అనుకూలంగా ఉన్న వాళ్ళను ఏకం చేయటంలో మెగా బ్రదర్ నాగబాబు ప్రదర్శించిన చాతుర్యమే రాజేంద్రుడికి కలిసొచ్చింది. మురళి మోహన్ తనకు అనుకూలంగా ఉన్నవాళ్ళలో చాలా మంది ఓటింగ్ లో పాల్గొనలేదు. ఆ సంగతి రాజేంద్రుడి మెజారిటీకి కారణం అయ్యింది. రాజేంద్ర ప్రసాద్ కూడా గెలుపు తరవాత వ్యతిరేక వర్గాన్ని విమర్శిస్తూ.. విజయానికి కారణం మెగా బ్రదర్స్ అని ప్రకటించారు. మొత్తంగా అయితే ఇది.. మెగా విజయం అన్నమాట..!