చిరంజీవి పై ప్రభాస్ సెటైర్!

6 Apr 2015

సినిమా తీసే అవకాశం చేతిలో ఉంటే.. నచ్చని వాళ్ళకి వ్యతిరేకంగా, వాళ్ళు చేసే తప్పులను గోరంతలను కొండంతలు చేసి చూపించి..  అక్కసు తీర్చుకునే ఫెసిలిటీని గొప్పగా ఉపయోగించుకునే వాళ్ళు తెలుగు సినిమాలలో అనాదిగా ఉన్నారు. అంటే రియల్ లైఫ్ లో ఎదురయ్యే చేదు అనుభవాలను రీల్ తో కడిగేసుకుని ఆనందపడతారు అన్నమాట! అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి.
 
గతంలో NTR పై కోపాన్ని సినిమాల రూపంలో తీర్చుకున్న కీర్తి సూపర్ స్టార్ కృష్ణకు ఉంది. ఇక దాసరి నారాయణ రావు గారి గురించి చెప్పేది ఏముంది..? నచ్చని వాళ్ళ మీద సినిమా సెటైర్స్ వేయటంలో ఆయన పెద్ద మేస్త్రి..! ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకుంటే.. శ్రీను వైట్ల చేస్తున్న అల్లరి ఇంతా..  అంతా.. కాదు. అలా చేసినందుకు ప్రెస్ మీట్స్ పెట్టి మరీ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు గొల్లుమన్న సందర్భాలు మనం చూసి ఉన్నాం. ఇప్పుడు అదే కోవలో చిరంజీవి మీద అక్కసు తీర్చుకునే ప్రయత్నాల్లో.. రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఉన్నట్టు గుసగుసలు వినపడుతున్నాయి.
 
ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ లో చేరి MP సీట్ ఆశించి భంగపడ్డ కృష్ణంరాజు ఎప్పటినుండో చిరంజీవి మీద అక్కసు తీర్చుకోవాలి అని ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది. అందుకోసం ఆయన 'అక్క అడుగు' అని కధ రాసుకున్నారని, ఆ సినిమాలో ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించనున్నానాడని చెబుతున్నారు.  2014 ఎన్నికలు జరుగుతున్నప్పుడే ఈ సినిమా రావాల్సిందని..  కాని ఎన్నికల కోడ్ మూలంగా ఆగిపోయారని.. ఇప్పుడు అలాంటి సమస్యలు లేవు, అలానే ప్రభాస్ బాహుబలి కూడా పూర్తయ్యింది కాబట్టి త్వరలోనే సినిమా సెట్స్ పైకి రావొచ్చని అనుకుంటున్నారు. ఈ చిత్రం ప్రధానంగా చిరంజీవిని విమర్శిస్తూనే సాగుతుందని వినికిడి. పొతే.. ఈ సాహసానికి ప్రభాస్ ఎంతవరకు సహకరిస్తాడు అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.