అంతటా నిత్యా మ్యాజిక్.. !

19 Apr 2015

ఓకే బంగారం సినిమా మొన్న శుక్రవారం విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. విమర్శకులతో పాటు.. మణిరత్నం అభిమానులు, క్లాస్ ప్రేక్షకులు, యూత్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మణిరత్నం అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అమ్మాయిలందరూ హీరో దుల్ఖర్ సల్మాన్ ను లైన్ లో పెట్టే పనిలో పడిపోయారు. వయసుతో సంబంధం లేకుండా అబ్బాయిలందరూ నిత్యా జపం చేస్తున్నారు.
 
అందులో తప్పులేదులెండి.. ఎందుకంటే.. నిత్యా ఈ సినిమాలో మాములుగా కనిపించలేదు. మోహినిలా కనిపించింది. సినిమాలో ఆమె ఉన్న ప్రతి ఫ్రేమ్ ను ఒక పెయింటింగ్ లా చిత్రీకరించారు మణి. నిత్యా సూదులాంటి చూపులతో.. లోతుగా గుచ్చి వదిలిపెడుతుంది. అందమైన నవ్వుతో.. ఒకటే గిలిగింతలు పెట్టింది. ఆమె నవ్వులు, చూపు సినిమా నుండి బయటకు వచ్చాకా కూడా వెంటాడతాయి.. ఇది అనుభవపూర్వకమైన నిజం.
 
అంత విశేషంగా కనిపించిన నిత్యా.. మాములు ప్రేక్షకులనే కాదు పెద్ద పెద్ద సినీ దిగ్గజాలను కూడా విపరీతంగా డిస్ట్రబ్ చేసిందని తెలుస్తుంది. ముఖ్యంగా రొమాంటిక్ సినిమాలు చేసే దర్శకులందరూ.. ఆమె వ్యామోహంలో పడిపోయారనిపిస్తుంది. గౌతమ్ మీనన్ అప్పుడే నిత్యాతో సినిమా చేసే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. గౌతమ్ నిత్యా జపం ఏ రేంజ్ లో చేస్తున్నారు అంటే.. ఆమె అభిమాన సంఘానికి అద్యక్షుడు ఆయనేనెమో అన్న రేంజ్ లో రెచ్చిపోతున్నారు . అది సంగతి.. ప్రస్తుతం మణిరత్నం చలువతో నిత్యా మేనియా అలా నడుస్తుంది.