పవన్ ని టార్గెట్ చేసిన అల్లు

1 Apr 2015

పవన్ కళ్యాణ్ ను రికార్డుల పరంగా, క్రేజ్ పరంగా సమం చెయ్యాలి అని టాలీవుడ్ లోని పెద్ద హీరోలందరూ కలలు కంటున్నారు. కాని అవకాశాలు అనుకున్న వెంటనే అందరికి రావు.. అలానే అసలెవరికి రాకుండాను పోవు. కొంతమంది అదృష్టవంతులు ఉంటారు వాళ్ళకి అనుకోకుండానే కొన్ని కలిసోచ్చేస్తాయి. ఇప్పుడు ఆ కోవలోనే అదృష్టం ఎదురోచ్చేసి పవన్ రికార్డ్ మీద కన్నేశాడు అల్లు వారి సూపర్ స్టార్ బన్ని.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కలయికలో తాజాగా రూపొందిన చిత్రం.. S /O సత్యమూర్తి. ప్రస్తుతానికి ఈ సినిమా గురించే పరిశ్రమ మొత్తం మహా ఆసక్తిగా మాట్లాడుకుంటుంది. ఈ సినిమా ఎటువంటి రికార్డులు నమోదు చేయవచ్చు అని పలురకాల విశ్లేషణలు బయలుదేరాయి. అందులో భాగంగానే కొంతమంది సినిమా పండితులు తేల్చిన దాని ప్రకారం.. బన్ని బాబు ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ కు స్పాట్ పెట్టినట్టే కనిపిస్తుంది అని కబుర్లు సాగుతున్నాయి.
ఇంతకీ విషయం ఏమిటి అంటే.. విదేశాలలో మహేష్ బాబుకు ఎంత క్రేజ్ ఉందో.. దాదాపు అలాంటి ఇమేజ్ త్రివిక్రమ్ కు కూడా ఉంది. అత్తారింటికి దారేది సినిమాతో పవన్, త్రివిక్రమ్ కలిసి అక్కడ ఒక పెద్ద రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు S /O సత్యమూర్తి సినిమాకు మంచి టాక్ వస్తే.. అత్తారింటికి దారేది రికార్డ్ పగిలిపోవచ్చు అనేది ఒక విశ్లేషణ. అలా చూసుకుంటే విదేశాలలో ఎక్కువ డబ్బులు వసూలు చేసిన ఘనత పవన్ పేరు మీద నుండి బన్ని పేరు మీదకు మారిపోయే సూచనలు ఎక్కువగానే ఉన్నాయని మాట్లాడుకుంటున్నారు. చూద్దాం మరీ.. బన్నీ ప్రతాపం ప్రదర్సించటానికి కాలమాన పరిస్థితులు కలిసి వస్తాయో.. ? లేదో..?