జెండాపై కపిరాజు సినిమా రివ్యూ

21 Mar 2015

రివ్యూ: జెండాపై కపిరాజు
రేటింగ్‌: 2.5/5

బ్యానర్‌: వాసన్‌ విజువల్‌ వెంచర్స్‌
తారాగణం: నాని, అమలా పాల్‌, శివబాలాజీ, రాగిణి ద్వివేది, శరత్‌కుమార్‌, వెన్నెల కిషోర్‌, తనికెళ్ల భరణి తదితరులు
సంగీతం: జి.వి. ప్రకాష్‌ కుమార్‌
కూర్పు: ఎస్‌.ఎన్‌. ఫాజిల్‌
ఛాయాగ్రహణం: ఎం. సుకుమార్‌, ఎం. జీవన్‌
నిర్మాత: కె.ఎస్‌. శ్రీనివాసన్‌
కథ, కథనం, దర్శకత్వం: పి. సముద్రఖని
విడుదల తేదీ: మార్చి 21, 2015

సమాజంలోని అవినీతి, లంచగొండితనాన్ని వ్యతిరేక్తిస్తూ చాలా చిత్రాలొచ్చాయి. శంకర్‌ తీసిన భారతీయుడు, అపరిచితుడు, చిరంజీవి చేసిన ఠాగూర్‌ లాంటి చిత్రాలు ఘన విజయాలు కూడా సాధించాయి. శంకర్‌లాంటి దర్శకులు డీల్‌ చేసిన తర్వాత, చిరంజీవి స్థాయి నటులు చేసేసిన తర్వాత మళ్లీ అదే కాన్సెప్ట్‌పై సినిమా తీసి మెప్పించడమంటే మాటలు కాదు. లార్జ్‌ స్కేల్‌లో తీసిన కథలని మళ్లీ సినిమాగా మలచాలంటే కొత్తగా తీసినదాంట్లో తప్పకుండా ఆకట్టుకునే లక్షణాలుండాలి. కానీ ‘జెండాపై కపిరాజు’కి అలాంటి లక్షణాలు లేకపోగా... సినిమా సాంతం ఒక విధమైన లౌడ్‌నెస్‌తో తేలిపోయింది.

నాని ద్విపాత్రాభినయంలో తనదైన ప్రత్యేకత మరోసారి చాటుకున్నాడు. చాలా ఎమోషనల్‌ క్యారెక్టర్‌లో నాని నటుడిగా రాణించాడు. కానీ దర్శకుడు సముద్రఖని మాత్రం ఈ కథని సింపుల్‌గా, నేచురల్‌గా చెప్పడంలో విఫలమయ్యాడు. కాన్సెప్ట్‌ మంచిదే అయినా, సినిమాలో కొన్ని ఆకట్టుకునే అంశాలున్నా కానీ తమిళ బి గ్రేడ్‌ సినిమా అనువాదంలా అనిపించిందంటే దర్శకుడు ఎంచుకున్న స్టయిలే కారణం. కథనం పరుగులు పెట్టించాలనే ప్రయత్నంలో చాలా సార్లు గీత దాటేసాడు. సోషల్‌ ప్రాబ్లమ్‌కి కమర్షియల్‌ యాంగిల్‌ ఇవ్వడంలో చూపించాల్సిన బ్యాలెన్స్‌ మిస్‌ అయ్యాడు. అపరిచితుడు, ఠాగూర్‌లాంటి చిత్రాల్లో డీల్‌ చేసినవి చాలా బర్నింగ్‌ ఇష్యూస్‌ అయినా కానీ రగిలిపోయే పాత్రలు... అతిగా రియాక్ట్‌ అయ్యే సందర్భాలు కనిపించవు.

కేవలం మాసెస్‌ని ఆకట్టుకోవడానికని సముద్రఖని ఈ చిత్రాన్ని మరీ ఊరగా తీసాడేమో అనిపిస్తుంది. అయితే ఈ రకం లౌడ్‌ సినిమాలని ఇష్టపడే మాస్‌ ఆడియన్స్‌ కూడా మనకి తక్కువే. దర్శకుడు ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో విడివిడిగా తెరకెక్కించాడు. రెండు చిత్రాలని ఆయా నేటివిటీకి తగ్గట్టు మలచలేకపోయాడు. తెలుగు ప్రేక్షకులకి తగ్గట్టు సెన్సిబుల్‌ ఎమోషన్స్‌తో సటిల్‌ మూవీ తీయడంలో విఫలమయ్యాడు. రొటీన్‌ కథే అయినా కానీ కొన్ని ఐడియాలు కొత్తగా అనిపిస్తాయి. కానీ వాటిని ఎగ్జిక్యూట్‌ చేసిన విధానం మాత్రం విసిగిస్తుంది. టెన్షన్‌ నిండిన ఛేజ్‌ సన్నివేశాలు, పోరాట దృశ్యాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. అయితే స్మూత్‌ ఫ్లో మాత్రం మిస్‌ అయింది. నమ్మశక్యం కాని సంఘటనలు జరిగిపోతుంటాయి. వాటిని దర్శకుడు చాలా క్యాజువల్‌గా తీసుకోవడం ఆశ్చర్యపరుస్తుంది.
అవినీతిని అస్సలు సహించలేని అరవింద్‌ (నాని) కొందరు ప్రభుత్వ ఉద్యోగులని టార్గెట్‌ చేసి వాళ్ల బండారం బయటపెడతాడు. కౌంటర్‌ ఎటాక్‌లో వాళ్లు అరవింద్‌కి ఎదురుగా అచ్చంగా అలాగే ఉన్న మాయాకన్నణ్‌ని (నాని) తెచ్చి నిలబెడతారు. విజయం సాధిస్తున్నానని అరవింద్‌ అనుకుంటోన్న సమయంలో ఎదురు పడిన మాయాకన్నణ్‌ వల్ల మొత్తం రివర్స్‌ అవుతుంది. మరి అరవింద్‌ అనుకున్నది సాధిస్తాడా లేదా అన్నదే ‘జెండాపై కపిరాజు’ కథ.
అరవింద్‌లో ఉన్న సామాజిక బాధ్యత గురించి చెప్పడానికి, అతని పాత్రని అర్థం చేసుకోవడానికి దర్శకుడు చాలా సమయం కేటాయించాడు. అలాగే ద్వితీయార్థంలో మాయా కన్నణ్‌ పాత్ర ప్రవేశం తర్వాత కూడా డీవియేషన్‌ చాలా టైమ్‌ తీసుకుంటుంది. టీవీ ఇంటర్వ్యూ, కోర్ట్‌ సీన్స్‌లో ఉన్న ఎమోషన్‌, స్పీడ్‌ సినిమా అంతటా లేకపోవడంతో ‘జెండాపై కపిరాజు’ ఆకట్టుకునే క్షణాల కన్నా భారంగా అనిపించే సమయమే ఎక్కువ. చివర్లో వచ్చే ట్విస్టు ఫర్వాలేదనిపించినా తర్వాత వచ్చే ఫైట్‌ సీన్‌ మళ్లీ అతిగా అనిపిస్తుంది.

కన్సిస్టెన్సీ లేకపోవడమే ఈ చిత్రానికి ప్రధాన బలహీనతగా మారింది. అతి పీక్స్‌లో ఉన్న ఈ చిత్రంలోను నాని ఎక్కడా ఓవర్‌ ది బోర్డ్‌ వెళ్లలేదు. చాలా లౌడ్‌ సీన్స్‌లో కూడా బ్యాలెన్స్‌ కోల్పోకుండా డీసెంట్‌గా నటించాడు. మాయా కన్నణ్‌గా అతని బాడీ లాంగ్వేజ్‌, ఎక్స్‌ప్రెషన్స్‌ ఆకట్టుకుంటాయి. అమలా పాల్‌ బాగానే చేసింది కానీ ఆమెకి తగినంత స్కోప్‌ ఇవ్వలేదు. శరత్‌ కుమార్‌ క్యారెక్టర్‌ హడావుడిగా కనిపిస్తుంది. వెన్నెల కిషోర్‌కి మంచి క్యారెక్టర్‌ దక్కింది. బాగా చేసాడు. రాగిణి ద్వివేది చాలా మంది సపోర్టింగ్‌ కాస్ట్‌లా ఓవరాక్షన్‌ చేసింది. తనికెళ్ల భరణి ఓకే అనిపిస్తాడు. టెక్నికల్‌గా ఈ చిత్రం గొప్పగా లేదు. ఏ గ్రేడ్‌ స్టాండర్డ్స్‌ ఉన్న డైరెక్టర్‌ నుంచి వచ్చిన క్వాలిటీ ప్రోడక్ట్‌ అనిపించదు. సినిమా అంతటా బి గ్రేడ్‌ లుక్‌, ఎగ్జిక్యూషన్‌ స్టయిల్‌ డామినేట్‌ చేసాయి. ప్రకాష్‌కుమార్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం కొన్ని సందర్భాల్లో ఆకట్టుకుంది.

ఓవరాల్‌గా నాని పర్‌ఫార్మెన్స్‌తో పాటు సోషల్‌ కాజ్‌ కోసం తీసిన సినిమా అనే ప్లస్‌ పాయింట్‌ మినహా ‘జెండాపై కపిరాజు’ నిరాశ పరుస్తుంది. ఈ కాన్సెప్ట్‌తో ఇంతకంటే బెటర్‌ సినిమాలు చూసి ఉండడం దీనికి మైనస్‌గా మారింది. అయితే లౌడ్‌గా డీల్‌ చేసిన విధానం వల్ల అలాంటి పద్ధతిని ఇష్టపడే కొందరికి ఈ చిత్రం ఫర్వాలేదనిపించవచ్చు. బిజినెస్‌ పరంగా మాస్‌ సెంటర్స్‌లో కాస్త అడ్వాంటేజ్‌ ఉండొచ్చు.

బోటమ్‌ లైన్‌: అవినీతిపై పోరాటం శ్రుతి మించింది!